7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది.

Published : 05 May 2024 06:54 IST

నేడు 30మండలాల్లో తీవ్ర వడగాలులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ద్రోణి ప్రభావంతో ఈనెల 7న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశముందన్నారు. ఆదివారం 30మండలాల్లో తీవ్ర వడగాలులు, 247మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. శనివారం 28మండలాల్లో తీవ్ర వడగాలులు, 187 మండలాల్లో వడగాలులు వీచాయి. 14 జిల్లాల్లో 43డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5, వైఎస్సార్‌ జిల్లా కలసపాడులో 46.4, నంద్యాలలోని కోవెలకుంట్లలో 46.2, నెల్లూరులోని వేపినాపి అక్కమాంబపురంలో 46.1, కర్నూలులోని వగరూరులో 45.7, పల్నాడు జిల్లా విజయపురిసౌత్‌లో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పల్నాడు జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతిచెందారు. మండల కేంద్రం దుర్గికి చెందిన కొత్త పూర్ణ చంద్రరావు(62)..క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన విప్పర్ల వెంకాయమ్మ(80)అనే వృద్ధురాలు మరణించారు. విశాఖపట్నంలో ఓబాలుడు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేట మండల పరిధిలోని మిడుతూరులో ఎండ వేడికి తాళలేక వడదెబ్బ తగిలి దొడ్డవాండ్ల వెంకటపతి (75) మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని