‘నాడు-నేడు’ పనులు నత్తతో పోటీ!

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’ రెండో విడత పనులు సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదు.

Updated : 02 Jun 2023 05:42 IST

రెండేళ్లుగా కొనసాగుతున్న రెండో దశ పనులు
నిధుల్లేక తరగతి గదుల నిర్మాణాలు వాయిదా

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’ రెండో విడత పనులు సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదు. పాఠశాలలు పునఃప్రారంభ(జూన్‌ 12)మయ్యే లోపు పనులు పూర్తి చేయకపోతే విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. క్షేత్రస్థాయిలో చాలాచోట్ల 60 శాతంలోపే పనులు పూర్తయ్యాయి. నిధుల కొరత పేరుతో తరగతి గదుల నిర్మాణాలను వాయిదా వేశారు. గదుల కొరతతో గత విద్యా సంవత్సరం ఇబ్బందులు పడిన పిల్లలకు మళ్లీ అదే సమస్య పునరావృతం కానుంది. నిర్మాణ సామగ్రి పాఠశాల ఆవరణలో వేయడం, సిమెంట్‌ను తరగతి గదుల్లో నిల్వ చేస్తుండటంతో విద్యార్థులు ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ ఆడుకోవాలో తెలియని పరిస్థితి. గత విద్యా సంవత్సరంలో ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదిఇర్లపాడు ప్రాథమిక పాఠశాలను కిలోమీటరు దూరంలోని జడ్పీ పాఠశాలలో విలీనం చేయడంతో 60 మంది విద్యార్థులు అందులో చేరారు. తరగతి గదుల కొరత కారణంగా విద్యార్థులను చెట్ల కింద కూర్చొబెట్టారు. తరగతి గదుల నిర్మాణాలు వాయిదా వేయడంతో ఇలాంటి బడుల్లో ఈ సారీ చెట్ల కింద, వరండాల్లో చదువులు తప్పేలా లేవు.

అధికారి అసంతృప్తి..

రెండో దశ పనులకు 2021 ఆగస్టు 16న సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. పరిపాలన అనుమతులకే సుమారు ఏడాది పట్టింది. మొత్తం 22,344 పాఠశాలలు, వసతి గృహాలు, జూనియర్‌ కళాశాలల్లో పనులు చేపట్టాలని నిర్ణయించగా.. అదనపు తరగతి గదుల నిర్మాణం వాయిదా వేయడంతో ఇప్పుడు ఆ సంఖ్య 14,020 తగ్గిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల తరగతి గదులు నిర్మించాల్సి ఉండగా.. వీటన్నింటినీ పక్కన పడేశారు. మొదటి షెడ్యూల్‌ ప్రకారం గతేడాది జులై నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఫిబ్రవరి అన్నారు.. ఇప్పుడు జూన్‌ 12 నాటికి పూర్తి చేస్తామంటున్నారు. రెండో దశే ఇలా ఉంటే...అసలు మూడో దశ ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా.. పనులు సరిగా జరగకపోవడంపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ క్షేత్రస్థాయి పర్యటనల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు, సమీక్షల్లో పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు.. వాస్తవంగా చూస్తే పనులే ప్రారంభం కాలేదని సీతంపేటలో అధికారులను ప్రశ్నించారు.

రంగుల టెండర్లలో తకరారు..

పాఠశాలలకు రంగులు వేసేందుకు కంపెనీలను ఎంపిక చేసే టెండర్ల ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు. ఒక ప్రముఖ కంపెనీ నిర్ణీత ధర కంటే 40 శాతం ఎక్కువకు కోట్‌ చేసింది. ధర తగ్గించుకోవాలని అధికారులు కోరుతున్నా ఆ కంపెనీ అంగీకరించడం లేదు. ఇదే కంపెనీ మొదటి విడతలో వేసిన రంగులు చాలాచోట్ల వెలిసిపోయాయి. అదే కంపెనీ ఇప్పుడు గిట్టుబాటు కావడం లేదంటూ ఈసారి అధిక ధర అడుగుతోంది. దీంతో చెన్నైలోని మరికొన్ని కంపెనీలను ‘నాడు-నేడు’ అధికారులు సంప్రదించారు.

*  గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ఆంగ్ల భాష ల్యాబ్‌లపై వ్యయం ఇప్పటికీ సున్నా. మేజర్‌, మైనర్‌ మరమ్మతులు 40%, విద్యుత్తు పనులు 25%, ఫర్నీచర్‌, వంటగదుల నిర్మాణానికి 30%, మరుగుదొడ్లు 50%, తాగునీటికి 13% చొప్పున వ్యయం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని