30 కంపెనీలు.. రూ.31,277 కోట్లు

అంతర్జాతీయంగా నిధుల లభ్యత అధికంగా ఉండటానికి తోడు, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బుల్‌ రన్‌ కొనసాగడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.31,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించాయి.......

Published : 29 Mar 2021 09:44 IST

2020-21లో ఐపీఓల ద్వారా సమీకరించిన మొత్తమిది

దిల్లీ: అంతర్జాతీయంగా నిధుల లభ్యత అధికంగా ఉండటానికి తోడు, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బుల్‌ రన్‌ కొనసాగడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.31,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించాయి. సెకండరీ మార్కెట్‌లో సెంటిమెంట్‌ బాగుండటం, ప్రైమరీ మార్కెట్‌కు మద్దతుగా నిలిచింది. 2021-22లోనూ పబ్లిక్‌ ఇష్యూలు వరుస కట్టే అవకాశం ఉంది. సెబీ వద్ద ఐపీఓ అనుమతుల కోసం 28 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి సుమారు రూ.28,710 కోట్లు సమీకరించాలనుకుంటున్నాయని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ రిటైల్‌ సీఈఓ సందీప్‌ భరద్వాజ్‌ వెల్లడించారు.
*లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఎన్‌సీడీఈఎక్స్, ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల ఐపీఓలు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వచ్చే అవకాశం ఉందని సెంట్రల్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేంద్ర నాయక్‌ వివరించారు.
*2020-21లో ఐపీఓలే కాకుండా యెస్‌ బ్యాంక్‌ ఫాలో-ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ద్వారా రూ.15,000 కోట్లు సమీకరించింది.

ఆర్థిక                  ఐపీఓలు        నిధులు
సంవత్సరం 

2020-21               30     రూ.31,277 కోట్లు    
2019-20               13     రూ.20,352 కోట్లు
2018-19               14     రూ.14,719 కోట్లు 
2017-18               45     రూ.82,109 కోట్లు

విభిన్న రంగాల నుంచి..

2020-21లో భిన్న రంగాల నుంచి ఐపీఓలు వచ్చాయి. ఆభరణాలు, టెక్నాలజీ, స్పెషాల్టీ కెమికల్స్, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లోని కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోవడం కూడా మదుపర్లను ఈక్విటీల వైపు ఆకర్షించాయి.

ఎంటార్‌ టెక్‌కు 200 రెట్ల స్పందన 
* రోసారి బయోటక్, కల్యాణ్‌ జువెలర్స్, బార్బెక్యూ నేషన్‌ హాస్పిటాలిటీ, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏంజెల్‌ బ్రోకింగ్, హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ, సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తదితర కంపెనీలు కూడా నిధుల సమీకరణకు ఐపీఓ మార్గాన్నే ఎంచుకున్నాయి.
*ఎంటార్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు 200 రెట్ల స్పందన లభించింది. మిస్సెస్‌ బెక్టార్స్‌ ఫుడ్‌ స్పెషాల్టీస్‌ ఐపీఓకు 198 రెట్ల స్పందన వచ్చింది.
*బర్గర్‌ కింగ్‌ ఇండియా, నజారా టెక్నాలజీస్, లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్, ఈజీ ట్రిప్‌ ప్లానర్స్, మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్, ఇండిగో పెయింట్స్, కెమ్‌కాన్‌ స్పెషాల్టీ కెమికల్స్‌ ఐపీఓలకు 100 రెట్లకు పైగా స్పందన లభించింది.

నమోదు అదుర్స్‌..
ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఐపీఓలు అధిక భాగం ఇష్యూ ధరతో పోలిస్తే మంచి లిస్టింగ్‌ లాభాలు నమోదు చేయడం విశేషం. రూట్‌ మొబైల్, హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్, రోసారి బయోటెక్, బర్గర్‌ కింగ్‌ ఇండియా, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు లిస్టింగ్‌ నుంచి 84-314 శాతం లాభాల్ని మదుపర్లకు పంచాయి.
*వచ్చే 2-3 ఏళ్లు ఐపీఓ మార్కెట్‌కు బాగుంటుందని ఇన్వెస్ట్‌19 వ్యవస్థాపకులు, సీఈఓ కౌశలేంద్ర సింగ్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్‌ దశాబ్ద వృద్ధి దృక్పథంతో రూపొందడంతో పాటు మార్కెట్‌ గరిష్ఠ స్థాయి వద్ద ఉండటం, దేశీయ, రిటైల్, విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తుండటం కలిసొచ్చే అంశాలుగా వివరించారు.

అధిక మొత్తం ఐపీఓలు ఇవే..

కంపెనీ                       మొత్తం (రూ.కోట్లలో)
గ్లాండ్‌ ఫార్మా                      6,480
ఐఆర్‌ఎఫ్‌సీ                        4,633
కామ్స్‌                            2,240
యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌       2,160 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని