Amazon Prime: అమెజాన్‌ ప్రైమ్‌ మరింత ప్రియం.. కొత్త ధరలు ఎప్పటి నుంచి అంటే?

అమెజాన్‌ ప్రైమ్ సభ్యత్వం‌(Amazon Prime Membership) మరింత ప్రియం కానుంది. ఇక నుంచి కొత్తగా సభ్యత్వం తీసుకునేవారు ఏకంగా 50శాతం

Published : 14 Dec 2021 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెజాన్‌ ప్రైమ్ సభ్యత్వం‌(Amazon Prime Membership) మరింత ప్రియం కానుంది. ఇక నుంచి కొత్తగా సభ్యత్వం తీసుకునేవారు ఏకంగా 50శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సభ్యత్వం రూ.999 ఉండగా రూ.1,499 చేయనున్నట్లు ఆ సంస్థ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎప్పటి నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయన్న దానిపై స్పష్టత రాలేదు. తాజాగా ఈ పెంచిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి (మంగళవారం డిసెంబరు 14) నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ తన డీల్స్‌ పేజీలో ప్రకటించింది. డిసెంబరు 14వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం తీసుకోవాలంటే రూ.1,499 చెల్లించాల్సిందే. ప్రస్తుతం అమెజాన్‌ సభ్యత్వం మూడు రకాలుగా లభిస్తోంది. నెలవారీ, త్రైమాసిక, వార్షిక సభ్యత్వాలను అందిస్తోంది. మిగిలిన వాటి ధరలు కూడా తాజా పెంపునకు అనుగుణంగా పెరగనున్నాయి.

ప్రస్తుతం నెలవారీ సభ్యత్వ రుసుము రూ.129గా ఉండగా, పెంపుతో రూ.179గానూ (38శాతం అదనం), మూడు నెలలకు రూ.329 కాస్తా, రూ.459(39శాతం అదనం) అవుతుంది. ఇక వార్షిక సభ్యత్వం రూ.999 నుంచి రూ.1,499 (50శాతం అదనం)కి చేరుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ప్రైమ్‌ వీడియోలు, ప్రైమ్‌ మ్యూజిక్‌తోపాటు, ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఉచిత హోమ్‌ డెలివరీ వంటి తదితర ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు, టాప్‌ డీల్స్‌ను 30 నిమిషాల ముందుగానే పొందే అవకాశం లభిస్తుంది. 2016లో అమెజాన్‌.. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను భారత్‌లో ప్రారంభించింది. అప్పుడు వార్షిక సభ్యత్వం రూ.499గా ఉండగా, ఆ తర్వాత 2019లో ఆ మొత్తాన్ని రూ.999కు పెంచింది. 2018లో నెలవారీ సభ్యత్వాన్ని కూడా అమెజాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read latest Business News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని