విదేశాల‌కు వెళుతున్నారా? ఎన్ఆర్ఐగా మారే ముందు చేయాల్సిన ప‌నులివే!

విదేశాలకు వెళ్తున్నవారు.. ఆర్థిక విష‌యాలైన పెట్టుబ‌డులు, బీమా, బ్యాంకింగ్ వ్య‌వహారాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం

Published : 15 Dec 2020 17:58 IST

ఎన్ఆర్ఐ హోదాకు సంబంధించినంత వ‌ర‌కు రెండు ర‌కాల చ‌ట్టాలు అమ‌ల్లో ఉన్నాయి. వీటి ప్ర‌కార‌మే ఎన్ఆర్ఐగా గుర్తింపు పొంద‌గ‌లం. ఎన్ఆర్ఐ అయ్యాక ప్ర‌భావం చూపించే అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టాల ప్ర‌కారం 

స్థానిక‌త హోదాను నిర్ణ‌యించ‌డంలో ఇన్‌కం ట్యాక్స్ చ‌ట్టాలకు పాత్ర ఉంది. ఏదైనా ఒక‌ ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త్ లో నివ‌సించే నిర్ణీత కాలాన్ని బ‌ట్టి వ్య‌క్తి స్థానిక‌త నిర్ణ‌య‌మ‌వుతుంది.

ఇన్‌కమ్ ట్యాక్స్ చ‌ట్టం ప్ర‌కారం ఎన్ఆర్ఐ అయితే ప్ర‌త్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. అయితే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టాల‌కు లోబ‌డి ఎన్ఆర్ఐగా మారిన వ్య‌క్తికి భార‌త్‌లో గ‌నుక ఆదాయ పన్ను ప్రాధమిక మినహాయింపు పరిధికి మించి ఆదాయం ఉంటే రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. రిట‌ర్న్ దాఖ‌లు చేసేట‌ప్పుడు స్థానిక‌త వివరాలలో ఎన్ఆర్ఐగా పేర్కొనాలి.

ఫెమా చ‌ట్టాల ప్ర‌కారం

విదేశీ మార‌క నిర్వ‌హ‌ణ చ‌ట్టం(ఫెమా) ప్ర‌కారం భార‌త్ వెలుప‌ల నివ‌సించిన కాలాన్ని బ‌ట్టి కాక అక్క‌డికి వెళ్లిన‌ ఉద్దేశాన్ని బ‌ట్టి స్థానికత నిర్ణ‌యమ‌వుతుంది. కాబ‌ట్టి ఫెమా చ‌ట్టం ప్ర‌కారం… ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తి నిర్వ‌హించుకునేందుకు దేశం దాటిన క్ష‌ణ‌మే ఎన్ఆర్ఐగా ప‌రిగ‌ణిస్తారు. అప‌రిమిత కాలానికి విదేశాల్లో స్థిర‌ప‌డాల‌నుకునే ఉద్దేశంతో భార‌త్ వీడి వెళ్లిన‌వారినీ ఎన్ఐఆర్‌గానే చూస్తారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం ఎన్ఆర్ఐగా మారిన వెంట‌నే చేయాల్సిన కొన్ని ముఖ్య‌మైన ప‌నులుంటాయి. ఇలాంటి ప‌నులు అన్ని సంద‌ర్భాల్లోనూ త‌క్ష‌ణ‌మే చేయ‌లేం. అయితే వీలైనంత తొంద‌ర‌గా చేయ‌డం మంచిది.

బ్యాంకింగ్ ఖాతాలలో మార్పులు

  • ఎన్ఆర్ఐగా మారిన విష‌యాన్ని తొలుత మీ బ్యాంకుల‌కు తెలియ‌జేయాలి.
  • విష‌యం తెలిపిన త‌ర్వాత మీ ప్ర‌స్తుత బ్యాంకు ఖాతాల‌న్నింటినీ నాన్ రెసిడెంట్ ఆర్డిన‌రీ (ఎన్ఆర్ఓ) ఖాతాలుగా వారు మారుస్తారు.
  • ఈ మార్పు పొదుపు ఖాతాల‌తోపాటు ఫిక్స్‌డ్‌, రిక‌రింగ్ డిపాజిట్ల‌కు వ‌ర్తిస్తుంది.
  • ఎన్ఆర్ఓ ఖాతాలా మార్చాక బ్యాంకు వారు ప్ర‌వాసుల‌కు వ‌ర్తించేలా వ‌డ్డీపై ప‌న్ను కోత విధించ‌డం మొద‌లుపెడ‌తారు.
  • ప్ర‌స్తుతానికి మూలం వ‌ద్ద జ‌మ అయ్యే వ‌డ్డీపై ప‌న్ను కోత 30శాతంగా ఉంది.
  • సాధార‌ణంగా పొదుపు ఖాతాల్లో జ‌మ అయ్యే వ‌డ్డీపై స్థానికుల‌కు ఎటువంటి ప‌న్ను ప‌డ‌దు. అయితే, ఎన్ఆర్ఓ ఖాతాగా మారిన వెంట‌నే వ‌డ్డీపై టీడీఎస్ కోత ప్రారంభ‌మ‌వుతుంది.

ఎన్ఆర్ఇ ఖాతా

ఎన్ఆర్ఐగా మారిన త‌ర్వాత‌… ఎన్ఆర్ఇ ఖాతాను తెర‌వ‌డం మంచిది. భార‌త్‌లో కూడ‌బెట్టిన‌/ వ‌స్తోన్న ఆదాయానికి, విదేశాల్లో సంపాదించే ఆస్తికి మ‌ధ్య వ్య‌త్యాసం చూపించేందుకు ఈ ఖాతా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎన్ఆర్ఈ ఖాతాలో జ‌మ‌య్యే సొమ్ము భార‌త్ వెలుప‌లికి పంపించ‌వ‌చ్చు. విదేశాల్లో సంపాదించింది ఎన్ఆర్ఓ ఖాతాలోకి జ‌మ అయితే… తిరిగి దాన్ని విదేశాల్లో ఉప‌యోగించాలంటే నిర్ణీత విధానాల‌ను పాటించాల్సి ఉంటుంది. అదే ఎన్ఆర్ఇ ఖాతాలో ఉండే సొమ్మును సుల‌భంగా విదేశాల్లో ఉప‌యోగించ‌వ‌చ్చు లేదా బ‌దిలీ చేయ‌వ‌చ్చు.

డీమ్యాట్ ఖాతాలు

  • స్థానిక హోదా క‌లిగి ఉన్నంత వరకు షేర్లు, బాండ్లు లాంటి వాటిలో పెట్టుబ‌డుల‌ను భార‌తీయ కంపెనీల్లో చేసేందుకు ఎలాంటి ష‌ర‌తులు, ప‌రిమితులు లేవు.
  • అయితే ఎన్ఆర్ఐగా మారిన త‌ర్వాత … నిర్దిష్ట ప‌రిమితులు వ‌ర్తిస్తాయి.
  • ఎన్ఆర్ఐగా మారిన తర్వాత ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి, ప్ర‌స్తుతం మీరు కొన‌సాగిస్తోన్న డీమ్యాట్ ఖాతాను ఎన్ఆర్ఐ డీమ్యాట్ ఖాతాగా మ‌ల‌చుకోవాలి. కానీ ఇలాంటి ఖాతాలో ఉన్న పెట్టుబడులను అమ్మగా వచ్చిన సొమ్మును విదేశీ బ్యాంకు ఖాతాలకు మళ్లించడం కష్టం. కాబట్టి…
  • కొత్త‌గా ఎన్ఆర్ఐ డీమ్యాట్ ఖాతా తెరిచి దానిలోకి మీ ప్రస్తుత ఖాతాలోని పెట్టుబ‌డుల‌ను మ‌ళ్లించుకోవ‌చ్చు. దీని వ‌ల్ల మొత్తం సొమ్ము సుల‌భంగా విదేశీ బ్యాంకు ఖాతాలకు మళ్లించవచ్చు లేదా విదేశాల్లో ఉప‌యోగించ‌వ‌చ్చు.

బీమా, మ్యూచువ‌ల్ ఫండ్ల విషయంలో

  • బ్యాంకుల‌కు స‌మాచారం ఇచ్చినట్లే … మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు, బీమా కంపెనీల‌కు మీరు ఎన్ఆర్ఐగా మారిన విష‌యాన్ని తెలియ‌జేయాలి. దీని వ‌ల్ల వారు వారి రికార్డుల్లో అప్‌డేట్ చేసుకుంటారు.
  • కొన్ని దేశాలలో నివసించే ఎన్ఆర్ఐల మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబడులను అనుమతించరు / పరిమితులు ఉంటాయి. కాబట్టి కొన్ని సిప్‌ల‌ను మ‌ధ్య‌లో నిలిపివేయాల్సి రావ‌చ్చు.

ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ

మీ త‌ర‌ఫున భార‌త్‌లో ఉన్న బ్యాంకు ఖాతాల‌ను నిర్వ‌హించేందుకు లేదా కొన్ని ర‌కాల లావాదేవీలు జ‌రిపేందుకు ఎవ‌రైనా ఓ వ్య‌క్తిని ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీగా అంటే మీ ప్రతినిధిగా నియ‌మించుకోవ‌చ్చు. మీరు దేశంలో లేని స‌మ‌యంలో వారు మీ త‌ర‌ఫున కొన్ని లావాదేవీలు చేస్తారు.

ఎన్ఆర్ఐగా ఇత‌ర దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఆర్థిక సంబంధిత విష‌యాల్లో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని ఆశిస్తున్నాం.

Author:

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని