ప‌న్ను ఆదాచేసుకోవాలా? వీటిలో పెట్టుబ‌డి పెట్టండి!

అర‌వై ఏళ్ల లోపు వారికి వార్షిక ఆదాయం రూ.2.5 ల‌క్ష‌లు దాటితే ప‌న్ను ప‌రిధి కిందికి వ‌స్తారు. ప‌న్ను ఆదా చేసుకోవాలనుకునే చాలా మందికి సెక్ష‌న్ 80సీ సుప‌రిచిత‌మే. సెక్ష‌న్ 80సీ ద్వారా రూ.1.5ల‌క్ష‌ల వ‌ర‌కూ పెట్టే పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు..

Published : 25 Dec 2020 17:47 IST

ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ప‌న్ను ఆదా ప‌థ‌కాల గురించి తెలుసుకుందాం.. అర‌వై ఏళ్ల లోపు వారికి వార్షిక ఆదాయం రూ.2.5 ల‌క్ష‌లు దాటితే ప‌న్ను ప‌రిధి కిందికి వ‌స్తారు. ప‌న్ను ఆదా చేసుకోవాలనుకునే చాలా మందికి సెక్ష‌న్ 80సీ సుప‌రిచిత‌మే. సెక్ష‌న్ 80సీ ద్వారా రూ.1.5ల‌క్ష‌ల వ‌ర‌కూ పెట్టే పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. అంటే ఏడాదికి రూ.4ల‌క్ష‌లు సంపాదించేవారు సైతం దాదాపు ఎలాంటి ప‌న్ను చెల్లించ‌కుండా ఉండే మార్గాలు మ‌న ఆదాయ‌పు ప‌న్ను వ్య‌వ‌స్థ క‌ల్పిస్తోంది. ఇవి కాకుండా మ‌రిన్ని సెక్ష‌న్లు, ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి ద్వారా మ‌రింత ప‌న్ను ఆదాచేసుకునే స‌దుపాయం ఉంది. ఇప్ప‌టికైతై సెక్ష‌న్ 80సీ ప‌రిధిలోనికి వ‌చ్చే ప‌న్ను ఆదా ప‌థ‌కాల గురించి తెలుసుకుందాం.

సెక్ష‌న్ 80 C కింద ప‌న్ను ఆదా ప‌థ‌కాలు
మార్కెట్ ఆధారిత ప‌థకాలు: ఈఎల్ఎస్ఎస్‌, యూలిప్స్‌.
స్థిర ఆదాయ ప‌థకాలు : పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ, ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సుక‌న్య స‌మృద్ధి యోజ‌నా, సీనియ‌ర్ సిటిజ‌న్స్ పొదుపు ప‌థ‌కం, ప్ర‌భుత్వ బాండ్ల‌లో పెట్టుబ‌డులు (ఉదా. నాబార్డ్ వంటివి).
ఇత‌ర ప‌థ‌కాలు: ఎల్ఐసీ ప్రీమియం, పెన్ష‌న్ పెట్టుబ‌డులు, ఎన్‌పీఎస్‌, గృహ‌రుణ ప్రిన్సిప‌ల్ రీ పేమెంట్‌, పిల్ల‌ల ట్యూష‌న్ ఫీజులు.
మార్కెట్ ఆధారిత ప‌థ‌కాలు
1. ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థకాలు (ఈఎల్ఎస్ఎస్‌)
ఈఎల్ఎస్ఎస్ అనేవి ఈక్విటీ ఆధారిత మ్యూచ్‌వ‌ల్ ఫండ్లు, ఇందులో పెట్టుబ‌డిని క‌నీసం మూడేళ్ల పాటు కొన‌సాగించాల్సి (లాక్‌-ఇన్ పీరియ‌డ్‌) ఉంటుంది. న‌ష్ట‌భ‌యం ఉన్నా మార్కెట్ ప‌రిస్థితుల‌క‌నుగుణంగా రాబ‌డులు అధికంగా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. మెచ్యూరిటీ సొమ్ముల‌కు, డివిడెండ్ ల‌కు ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.

2. యూనిట్ ఆధారిత బీమా ప‌థ‌కాలు (యూలిప్స్‌)
బీమా సౌక‌ర్యంతో పాటు పెట్టుబ‌డులు నిర్వ‌హించే స‌దుపాయం ఉంటుంది. ప్రీమియం సొమ్మును మిన‌హ‌యించ‌గా, మిగ‌తా మొత్తాన్ని వివిధ ర‌కాల (ఈక్విటీ, డెట్‌) ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడ‌తారు. క‌నీసం 5 ఏళ్లు పెట్టుబ‌డులు వెన‌క్కి(లాక్‌-ఇన్ పీరియ‌డ్‌) తీసుకోరాదు. ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 10(10d) ప్ర‌కారం ఇందులో వ‌చ్చే ప్ర‌తిఫ‌లాలు, మెచ్యూరిటీ మొత్తాల‌కు ఎలాంటి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అయితే జీవితా బీమా ప‌రిధి(క‌వ‌రేజీ) వార్షిక ప్రీమియం చెల్లింపుల కంటే ప‌ది రెట్లు ఉంటే మాత్రం మెచ్యూరిటీ మొత్తాల‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

స్థిర ఆదాయ ప‌థ‌కాలు
1. ప్ర‌జా భ‌విష్య నిధి ఖాతా (పీపీఎఫ్‌)
బ్యాంకులలో, పోస్టాఫీసుల‌లో పీపీఎఫ్‌ ఖాతా తెర‌వాల్సి ఉంటుంది. క‌నీస కాలావ‌ధి 15 ఏళ్లు, మ‌రో 5 ఏళ్ల వ‌ర‌కూ పొడిగించుకునే అవ‌కాశం క‌ల‌దు. సంవ‌త్స‌రానికి 8% వ‌డ్డీ వ‌స్తుంది. గ‌రిష్టంగా రూ. 1,50,000ల‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. క‌నీస కాలావ‌ధి ముగియ‌క ముందే సొమ్మ‌ను ఉప‌స‌హ‌రించ‌రాదు. అయితే కొన్ని నిబంధ‌న‌ల‌న‌నుస‌రించి 5 ఏళ్ల త‌ర్వాత సొమ్మ‌ను ఉప‌సంహ‌రించవ‌చ్చు.

2. జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎన్ఎస్‌సీ)
వీటిని భార‌త ప్ర‌భుత్వం, పోస్టాఫీసులు జారీ చేస్తాయి. కాల వ్య‌వ‌ధి 5 ఏళ్లు. ఆరు నెల‌ల‌కు 8% వ‌డ్డీ వ‌స్తుంది. వ‌డ్డీ ఆదాయం పై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తీర‌క‌ముందే సొమ్మ‌ను ఉప‌సంహ‌రించ‌రాదు.

3. ఉద్యోగ భ‌విష్య నిధి (ఈపీఎఫ్)
సెక్ష‌న్ 80 C ప్రకారం గ‌రిష్టంగా రూ.1,50,000 వ‌ర‌కు ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నం ఉంటుంది. క‌చ్చిత‌మైన రాబ‌డుల‌తో పాటు, మెచ్యూరిటీ మొత్తాల‌పై ప‌న్ను మియ‌హాయింపు ల‌భిస్తుంది. అద‌నంగా మ‌రో 5 ఏళ్ల పాటు కొన‌సాగించ‌వ‌చ్చు.

4. ప‌న్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు
గుర్తింపు పొందిన బ్యాంకులు, పోస్టాఫీసుల‌లో ఖాతా ప్రారంభించవ‌చ్చు. మెచ్యూరిటీ కాలావ‌ధి 5 ఏళ్లు. వార్షికంగా 7నుంచి 7.5% వ‌ర‌కు వ‌డ్డీ వ‌స్తుంది. అయితే మూలం వ‌ద్ద ప‌న్ను(టీడీఎస్)ను వసూలు చేస్తారు. మెచ్యూరిటీ తీర‌క‌మునుపే సొమ్మును ఉప‌సంహ‌రించ‌రాదు.

5. సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా
ఈ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం అమ్మాయిల చ‌దువు, వివాహ స‌మ‌యంలో ఖ‌ర్చుల నిమిత్తం ఆర్ధికి అవ‌సరాల కోసం ఇబ్బంది ప‌డ‌కుండా త‌గినంత మొత్తం స‌మ‌కూర్చు కోవ‌డం. ఈ ఖాతాను ప్రారంభించిన‌ప్ప‌టినుంచి 14 ఏళ్ల‌పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వ‌ర‌కు ఎలాంటి డిపాజిట్ చేయ‌న‌వ‌స‌రం లేదు.

ఈ ఖాతా ప్రారంభించిన‌ప్ప‌టినుంచి 21 ఏళ్ల త‌ర్వాత లేదా అమ్మాయికి 21 ఏళ్ల ముందే వివాహం జ‌రిగితే, ఏది ముందైతే అప్పుడు మెచ్యూరిటీ తీరుతుంది. క‌నీస డిపాజిట్ మొత్తం సంవ‌త్స‌రానికి రూ.1,000 కాగా, గ‌రిష్టంగా రూ.1,50,000 వ‌ర‌కు చేయాల్సి ఉంటుంది. వార్షిక వ‌డ్డీ రేటు 8.50% గా నిర్ణ‌యించారు. పోస్టాఫీసుల్లో, వాణిజ్య బ్యాంకుల్లో ఎక్క‌డైనా ఖాతా తెర‌వ‌వ‌చ్చు. బాలిక‌కు 10 సంవ‌త్స‌రాలు నిండిన నాటి నుంచి ఖాతాను త‌న పేరు మీద తెర‌వ‌వ‌చ్చు.

6. సీనియ‌ర్ సిటిజ‌న్స్ పొదుపు ప‌థ‌కం (ఎస్‌సీఎస్ఎస్)
క‌నీస కాలావ‌ధి 5 ఏళ్లు. క‌నీస పెట్టుబ‌డి మొత్తం రూ.1000, గ‌రిష్ట మొత్తం రూ.15 ల‌క్ష‌లు. వార్షిక వ‌డ్డీ రేటు 8.50%. డిపాజిట్ ప్రారంభించిన నాటి నుంచి మూడు నెల‌లకొక సారి చెల్లింపులు ఉంటాయి. మ‌దుప‌రులు నిబంధ‌న‌ల‌న‌నుస‌రించి న‌గ‌దును ఉప‌సంహ‌రించుకోవాల్సి ఉంటుంది.

7. నాబార్డ్ గ్రామీణ బాండ్లు
సెక్ష‌న్ 80 C ప్ర‌కారం నాబార్డ్ (నేష‌నల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్) జారీ చేసిన గ్రామీణ బాండ్ల‌కు సైతం ప‌న్ను మిన‌హాయింపులుంటాయి.

ఇత‌ర ప‌న్ను ఆదా ప‌థ‌కాలు
జీవిత బీమా ప్రీమియం: మీ గురించి, మీ భార్యా పిల్ల‌ల సంర‌క్ష‌ణ కోసం తీసుకున్న జీవిత బీమాల నుంచి కూడా సెక్ష‌న్ 80 C ప్ర‌కారం ప‌న్ను మిన‌హాయింపులుంటాయి. 31.03.2012 త‌ర్వాత తీసుకున్న పాల‌సీల‌కు 20% చొప్పున‌, 01.04.2012 త‌ర్వాత తీసుకున్నపాల‌సీల‌కు 10% వంతున హ‌మీ మొత్తం లేదా ప్రీమియం చెల్లింపు(ఏది త‌క్కువ‌గా ఉంటే అది) లో ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(ఎన్‌పీఎస్)
సెక్ష‌న్‌ 80 CCD-1B: ప‌న్ను ఆదా తో పాటు పదవీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాల‌ను ఇది క‌ల్పిస్తుంది. ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతా కింద రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాంపుల( సెక్ష‌న్ 80 C కింద రూ.1,50,000, సెక్ష‌న్ 80 CCD కింద రూ.50,000 వ‌ర‌కు) ను పొంద‌వ‌చ్చు. అయితే ఉప‌సంహ‌రించిన సొమ్ముపై ప‌న్ను విధిస్తారు. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందేవ‌ర‌కూ దీంట్లో సొమ్మును ఉప‌సంహ‌రించ‌రాదు. క‌నీస పెట్టుబ‌డి సంవ‌త్స‌రానికి రూ.6 వేలు, ఎలాంటి గ‌రిష్ట ప‌రిమితి లేదు. మ‌దుప‌రులు త‌మ అవ‌స‌రాల‌క‌నుగుణంగా ఈక్విటీ, డెట్‌, గిల్ట్ ప‌థ‌కాల‌లో మ‌దుపు చేయ‌వ‌చ్చు. అలాగే వ‌య‌సుక‌నుగ‌ణంగా పెట్టుబ‌డుల కేటాయింపులు జ‌రిపే లైఫ్ సైకిల్ ఫండ్ ప‌థ‌కం ఉంది.

Source: Zenmoney

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని