బ్యాంకింగ్‌ రంగ రేటింగ్‌ ‘ప్రతికూలం’ నుంచి ‘స్థిరత్వం’కు ఇండియా రేటింగ్స్‌ సవరణ

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) దేశీయ బ్యాంకింగ్‌ రంగం రేటింగ్‌ను ‘ప్రతికూలం’ ‘స్థిరత్వం’కు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సవరించింది. అయితే తక్కువ మొత్తం (రిటైల్‌) రుణాల విభాగంలో మొండి బకాయిలు పెరిగేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

Updated : 23 Feb 2021 12:03 IST

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22) దేశీయ బ్యాంకింగ్‌ రంగం రేటింగ్‌ను ‘ప్రతికూలం’ ‘స్థిరత్వం’కు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సవరించింది. అయితే తక్కువ మొత్తం (రిటైల్‌) రుణాల విభాగంలో మొండి బకాయిలు పెరిగేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా రేటింగ్‌ను ప్రతికూలం నుంచి స్థిరత్వానికి మార్చగా.. ప్రైవేట్‌ రంగ బ్యాంకులకు స్థిరత్వం రేటింగ్‌ను కొనసాగించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్థూల నిరర్థక ఆస్తులు, పునర్‌వ్యవస్థీకరించిన ఆస్తులు 30 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. 2020-21 అర్ధభాగానికి నమోదైన రిటైల్‌ రుణాల విభాగం మొండి బకాయిలతో పోలిస్తే దాదాపు ఇది 1.7 రెట్లు ఎక్కువని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రుణాల వృద్ధిని కూడా 1.8 శాతం నుంచి 6.9 శాతానికి మార్చింది. 2021-22లో రుణాల వృద్ధి 8.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. రుణాల వృద్ధి గాడిన పడుతుండటం, కేపిటల్‌ మార్కెట్లు ఇప్పటికే బాగా పెరిగినందున డిపాజిట్‌ రేట్లు పెరిగే అవకాశం ఉందని కూడా ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది.  


నగదు నిల్వల్లో 8-10 శాతాన్ని డివిడెండుగా చెల్లిస్తాం: హిందాల్కో

దిల్లీ: ఏకీకృత నగదు నిల్వల నుంచి 8-10 శాతాన్ని వాటాదార్లకు డివిడెండుగా చెల్లిస్తామని హిందాల్కో ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం లేదంటే ఆ ముందు సంవత్సరానికి ఆర్జించిన లాభాల నుంచి ఈ డివిడెండును కంపెనీ చెల్లించనుంది. డిసెంబరు చివరినాటికి హిందాల్కో వద్ద నగదు, నగదు సమాన నిల్వలు రూ.18194 కోట్ల వరకు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో డిసెంబరు త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ.. సవరించిన మూలధన కేటాయింపు విధానాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే.


రూ.20,000 కోట్లలో అంతా ఇవ్వకపోవచ్చు
పీఎస్‌బీలకు మూలధన సాయంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.20000 కోట్ల పూర్తి మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీలు) మూలధన సాయంగా  ప్రభుత్వం అందివ్వకపోవచ్చని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈక్విటీ, డెట్‌ మార్గాల్లో మూలధనాన్ని సమీకరించే యత్నాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు కార్యాచరణ జాబితాలోని బ్యాంకులు కూడా నిబంధనలకు మించి మూలధన నిష్పత్తి కలిగి ఉన్నాయని తెలిపారు. పీఎస్‌బీల మూలధన పునర్‌వ్యవస్థీకరణ నిమిత్తం బాండ్ల జారీ ద్వారా 2020-21లో రూ.20000 కోట్లు కేటాయించాలని సవరించిన అంచనాల్లో ప్రభుత్వం పేర్కొన్న విషయం విదితమే. ఇందులో ఇప్పటివరకు రూ.5,500 కోట్లు మాత్రమే ఇచ్చింది. ‘సత్వర దిద్దుబాటు కార్యాచరణ జాబితాలోని బ్యాంకులకు అవసరమైతే మూలధనాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇతర బ్యాంకుల మూలధన అవసరాలను కూడా మదింపు చేస్తున్నామ’ని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌లు సత్వర దిద్దుబాటు కార్యాచరణ జాబితాలో ఉన్నాయి. బాసెల్‌-3 ప్రకారం ఈ మూడు బ్యాంకుల కనీస మూలధన నిష్పత్తులు డిసెంబరు 31 నాటికి వరుసగా 11.49%, 12.39%; 12.08 శాతంగా ఉన్నాయి. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 10.875% కంటే ఈ నిష్పత్తి ఎక్కువగానే ఉంది. మరోవైపు నిధుల సమీకరణ నిమిత్తం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సహా మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే నిధులను సమీకరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని