5జీ స్పెక్ట్రమ్‌ ధర సగానికిపైగా తగ్గించాలి.. ప్రభుత్వాన్ని కోరిన కాయ్‌!

5జీ టెలికాం సేవల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే వేలం ప్రక్రియలో 5జీ స్పెక్ట్రమ్‌ మూలధరను సగానికి పైగా తగ్గించాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (COAI) కోరింది.

Published : 28 Nov 2021 19:31 IST

దిల్లీ: 5జీ టెలికాం సేవల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే వేలం ప్రక్రియలో 5జీ స్పెక్ట్రమ్‌ మూలధరను సగానికి పైగా తగ్గించాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (COAI) కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించే అవకాశం ఉన్న వేళ కాయ్‌ ఈ విన్నపాన్ని ప్రభుత్వం ముందుంచింది. స్పెక్ట్రమ్‌ మూల ధరను 50-60 శాతం మేర తగ్గించాలని ఓ టెలికాం కంపెనీ ప్రతినిధి కోరగా.. ఈ తగ్గింపు 60-70 శాతం మేర ఉండాలని మరో కంపెనీకి చెందిన ఉన్నతాధికారి కోరారు. దీనిపై కాయ్‌ స్పందించడానికి నిరాకరించింది.

3,300- 3,600 మెగాహెర్జ్‌ బ్యాండ్‌లో ఒక మెగాహెర్జ్‌కు స్పెక్ట్రం మూలధరను రూ.492 కోట్లుగా నిర్ణయించాలని ట్రాయ్‌ కేంద్రానికి సూచించింది. 20 మెగాహెర్జ్‌లను ఒక బ్లాక్‌గా విక్రయించాలని పేర్కొంది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా ఒక కంపెనీ 5జీ సేవలు అందించాలంటే రూ.9,840 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో ఏడు బ్యాండ్ల పరిధిలో 2,308.80 మెగాహెర్జ్‌ల స్పెక్ట్రాన్ని కేంద్రం వేలానికి ఉంచగా.. రిజర్వ్‌ ధర రూ.4లక్షల కోట్లుగా నిర్ణయించింది. అయితే, మూల ధర ఎక్కువగా ఉండడంతో 700 మెగాహెర్జ్‌, 2,500 మెగాహెర్జ్‌ల బ్యాండ్లకు పెద్దగా స్పందన లభించలేదు. మరోవైపు దేశంలో 5జీ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. తొలుత ఆరు నెలలుగా ఈ గడువు నిర్దేశించగా.. తాజాగా ఆ గడువును 2022 మే వరకు టెలికాం విభాగం పొడిగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని