Updated : 26 Dec 2020 17:25 IST

కొవిడ్‌ దెబ్బ.. రెక్కలు విరిగిన విమానాలు

కంపెనీలకు నష్టాలు.. ఉద్యోగులకు వేతన కష్టాలు

దిల్లీ: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌ మహమ్మారి దెబ్బకు ఈ ఏడాది అన్ని రంగాలు కుదేలయ్యాయి. వ్యాపారాలు లేక అనేక కంపెనీలు మూతబడ్డాయి. ముఖ్యంగా దేశీయ విమానయాన రంగంపై కరోనా పెను ప్రభావం చూపించింది. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో నెలల తరబడి విమానాలు ఎగరలేదు. దీంతో ఎయిర్‌లైన్లకు నష్టాలు ఎదురయ్యాయి. ఫలితంగా కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు పెట్టాయి. మరికొన్ని కంపెనీలు సిబ్బంది జీతాలు తగ్గించడం లేదా అసలు ఇవ్వకుండా సెలవులపై పంపించడం చేశాయి. దీంతో ఈ రంగంలో ఉపాధి పొందుతున్న ఎంతోమంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి.

లాక్‌డౌన్‌లో భారీ నష్టాలు..

ఈ ఏడాది మార్చిలో దేశంలో కరోనా మహమ్మారి మొదలవగానే కేంద్ర ప్రభుత్వం వ్యాప్తి నివారణ చర్యలకు ఉపక్రమించింది. మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలు, మార్చి 25 నుంచి దేశీయ విమానాల రాకపోకలను నిలిపివేసింది. దీంతో వందల సంఖ్యలో విమానాలు విమానాశ్రయాలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు బుక్‌ చేసుకున్న టికెట్లకు ఎయిర్‌లైన్‌ సంస్థలు ఛార్జీలను తిరిగి చెల్లించాల్సి వచ్చింది. కరోనా దెబ్బతో ఎయిర్‌లైన్లు ఈ ఏడాది భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయ దిగ్గజ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో తొలి త్రైమాసికం(2020-21 ఆర్థిక సంవత్సరం)లో రూ. 2,884కోట్లు, రెండో త్రైమాసికంలో రూ. 1,194కోట్లు నష్టపోయింది. మరో సంస్థ స్పైస్‌జెట్‌ తొలి త్రైమాసికంలో రూ. 600కోట్లు, రెండో త్రైమాసికంలో రూ. 112కోట్ల నికరనష్టాన్ని నమోదుచేసింది.

ఆ తర్వాత మే 25న దేశీయ విమానాల రాకపోకలను పరిమిత సంఖ్యలో పునరుద్ధరించారు. అదే సమయంలో వందే భారత్‌ మిషన్‌ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడిపారు. జులై నుంచి 24 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని విదేశాల్లోని భారతీయుల కోసం విమానసర్వీసులు నడిపిస్తున్నారు. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణంగా విమానయాన సంస్థలకు అంతర్జాతీయ సర్వీసులతోనే ఎక్కువ ఆదాయం వస్తుంది. దీంతో ఈ ఏడాది ఎయిర్‌లైన్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ గత అక్టోబరులో అంచనా వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన రంగం మొత్తంగా 6 - 6.5 బిలియన్‌ డాలర్లు నష్టపోయే అవకాశముందని పేర్కొంది. ఇందులో ఎయిర్‌లైన్లకు 4  - 4.5 బిలియన్‌డాలర్ల నష్టం తప్పదని అంచనా వేసింది.

ఎయిరిండియా విక్రయాలకు బ్రేక్‌

మరోవైపు నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రయివేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కూడా కొవిడ్‌ వల్ల బ్రేక్‌ పడింది. నిజానికి 2018లోనే ఎయిరిండియాను విక్రయించాలని చూసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఈ ఏడాది జనవరిలో మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టగా.. కరోనా మహమ్మారి కారణంగా బిడ్డింగ్‌ దరఖాస్తులకు గడువు ఐదుసార్లు వాయిదా పడింది. చివరకు డిసెంబరు 14 నాటికి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్‌(ఈఓఐ) దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఎయిరిండియా కొనుగోలుకు చాలా మందే ఆసక్తి చూపగా.. వీరిలో నుంచి అర్హులైన బిడ్డర్లను జనవరి 5న ప్రభుత్వం ఎంపికచేయనుంది.

సిబ్బంది ‘వేతన’ వ్యథ

ఇదిలా ఉండగా.. కరోనా కష్టనష్టాల్లోనుంచి బయటపడేందుకు విమానయాన సంస్థలు ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా 2020లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఉన్న సిబ్బంది వేతనాల్లోనూ కోత విధించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో గోఎయిర్‌ తన సంస్థలోని చాలా మంది ఉద్యోగులను జీతం లేకుండా నెలల తరబడి సెలవులపై పంపింది. అదే సమయంలో ఎయిరిండియా సిబ్బంది జీతంలో 10శాతం కోత విధించింది. ఉద్యోగుల వేతనాలను స్పైస్‌జెట్‌ 10-30శాతం, ఇండిగో 5-20శాతం తగ్గించింది. జులైలో ఇండిగో తన కంపెనీలో 10శాతం సిబ్బందిని తొలగించింది. ఎయిర్‌ఏషియా సీనియర్‌ ఉద్యోగుల వేతనాల్లో 20శాతం వరకు కోత పెట్టింది. దీంతో ఆయా కంపెనీల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

మరికొద్దిరోజుల్లో 2020 ముగుస్తోంది. వచ్చే ఏడాది మన దేశంలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో 2021లో విమానయాన రంగం మళ్లీ గాడినపడుతుందని ఎయిర్‌లైన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసులు పుంజుకున్నాయి. కొవిడ్‌ ముందుతో పోలిస్తే 80శాతం సర్వీసులు నడుస్తున్నాయి. 2021 మార్చి నాటికి సర్వీసులు మళ్లీ మునపటి స్థాయికి చేరుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.  

ఇవీ చదవండి..

2028 నాటికి అమెరికాను అధిగమించనున్న చైనా!

వాహన విక్రయాల్లో జోష్‌!

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని