Swiss Bank: భారతీయుల సంపద పెరిగిందా?

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద గత ఏడాది వ్యవధిలో భారీగా పెరిగి రూ.20,700 కోట్లకు చేరిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ....

Published : 19 Jun 2021 17:32 IST

స్విస్‌ అధికారుల్ని వివరణ కోరిన కేంద్రం

దిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద ఏడాది వ్యవధిలో భారీగా పెరిగి రూ.20,700 కోట్లకు చేరిందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని స్విట్జర్లాండ్‌ ప్రభుత్వ అధికారుల్ని కోరినట్లు తెలిపింది.  ‘‘స్విస్‌ బ్యాంకుల్లో 2019 ఆఖర్లో రూ.6,625 కోట్లుగా ఉన్న భారతీయుల సంపద 2020 చివరి నాటికి భారీగా పెరిగి రూ.20,700 కోట్లకు పెరిగినట్లు వార్తలు వచ్చాయి. గత రెండేళ్లుగా తగ్గుముఖం పట్టిన ఈ సంపద తిరిగి పెరిగిందని పేర్కొన్నాయి. అలాగే గత 13 ఏళ్లలో ఈసారే అత్యధిక డిపాజిట్లు నమోదైనట్లు తెలిపాయి’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. 

అయితే, ఈ లెక్కలు స్విస్‌ నేషనల్‌ బ్యాంకుకి అక్కడి బ్యాంకులు నివేదించిన అధికారిక సమాచారమని మీడియా కథనాలు సూచిస్తున్నాయని ఆర్థికశాఖ అభిప్రాయపడింది. అంతేగానీ, నల్ల ధనానికి సంబంధించిన లెక్కలని ఎక్కడా సంకేతాలు లేవని తెలిపింది. వాస్తవానికి ఖాతాదారుల డిపాజిట్లు 2019 చివరి నుంచి భారీగా పడిపోయాయని పేర్కొంది. సంస్థలు జమ చేసే సొమ్ము సైతం సగానికి తగ్గిందని తెలిపింది. అయితే, బాండ్లు, సెక్యూరిటీలు సహా ఇతర ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్ల వల్లే నిధులు భారీగా పెరిగినట్లు పేర్కొంది.

అలాగే, భారత కంపెనీల వ్యాపార లావాదేవీలు పెరగడం, భారత్‌లో స్విస్‌ బ్యాంకు శాఖల డిపాజిట్లు పెరగడం, స్విస్‌, భారత బ్యాంకుల మధ్య లావాదేవీలు పెరగడం వంటి కారణాల వల్ల కూడా డిపాజిట్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో డిపాజిట్ల పెరుగుదలకు సంబంధించిన వాస్తవాలు.. అందుకుగల కారణాలను పంపాలని స్విస్‌ అధికారుల్ని కోరినట్లు వెల్లడించింది.

ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం.. 2019, 2020లో ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఉభయ దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఆ సమాచారం ప్రకారం భారతీయుల సంపద భారీగా పెరిగే అవకాశాలు లేవని అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని