Updated : 29 Sep 2021 16:12 IST

Power Crisis In China: ఎవర్‌గ్రాండ్‌ మరువకముందే చైనాలో మరో సంక్షోభం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కర్మాగారంగా పేరొందిన చైనాలో ఏ సంక్షోభమొచ్చినా అది ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దివాలా అంచున ఉన్న స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్‌ సమస్య ఇంకా సమసిపోకముందే.. మరో సంక్షోభం వచ్చి వాలింది. తీవ్ర విద్యుత్తు కొరత ఇప్పుడు డ్రాగన్‌ను పట్టిపీడిస్తోంది. కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌ లైట్లు సైతం వెలగడం లేదంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఐరోపా సహా ఆసియా దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న చైనాలో ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిని కనీసం కొన్ని నెలల పాటైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి..!

ఎందుకీ సమస్య?

చైనాలో విద్యుత్తు కొరతకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ ఆంక్షల అనంతరం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యం పుంజుకోవడంతో చైనాలో ఉత్పత్తి పెరిగింది. దీంతో విద్యుత్తుకు ఒక్కసారిగా గిరాకీ పుంజుకుంది. 2020తో పోలిస్తే 2021లో విద్యుత్తు వినియోగం 13 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో కోతలు తప్పడం లేదు.

బొగ్గు కొరత..

ఇక చైనాలో ఎక్కువ శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారంగానే జరుగుతోంది. ఇదే సమయంలో బొగ్గు కొరత కూడా రావడం సమస్యను మరింత తీవ్రం చేసింది. మరోవైపు ఈ ఏడాది జలవిద్యుదుత్పత్తి రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. దీంతో బొగ్గు ఆధారిత కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. డిమాండ్‌కు సరిపడా స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని పెంచకపోవడంతో విద్యుత్తు కోతలు తప్పడం లేదు. విద్యుత్తు డిమాండ్‌ 13 శాతం పెరిగితే.. బొగ్గు ఉత్పత్తి 6 శాతం మాత్రమే పెరిగింది. మరోవైపు రెండు నెలల క్రితం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ దేశంలో రెండు ప్రధాన పోర్టులను మూసివేశారు. దీంతో బొగ్గు దిగుమతులు దెబ్బతిన్నాయి. ఇది కూడా బొగ్గు కొరతకు ఓ కారణమయింది.

బొగ్గు ఉత్పత్తిని పెంచలేరా?

బొగ్గు కొరతకు కూడా చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా 2060 నాటికి కర్బన రహిత దేశంగా మారాలన్న లక్ష్యం పెద్ద అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా అక్కడి షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం అనేక నిబంధనలను రూపొందించింది. దీంతో బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి అనేక అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు లభించినా వెంటనే బొగ్గు ఉత్పత్తిని పెంచడం సాధ్యం కాదు. పైగా చైనా బొగ్గు గనుల్లో ప్రమాదాలు సర్వసాధారణం. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం భద్రతా ప్రమాణాల దృష్ట్యా కొన్ని బొగ్గు గనులను మూసివేసింది. వీటిని ప్రారంభించడం కూడా ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ప్రారంభమైనా.. ఉత్పత్తి ఊపందుకోవడానికి నెలల సమయం పడుతుంది.

దిగుమతుల మాటేంటి మరి?

చైనా బొగ్గు వనరుల్లో దిగుమతులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి భారీ ఎత్తున బొగ్గు వచ్చేది. కానీ, భౌగోళిక రాజకీయ పరిణామాల దృష్ట్యా అక్కడి నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడం డ్రాగన్‌ ఆపేసింది. ఇటీవల ఇరు దేశాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మరోవైపు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఇటీవలే ‘ఆకస్‌’ కూటమి ఏర్పాటు కావడంతో ఇప్పట్లో బొగ్గు దిగుమతిని ప్రారంభించే సూచనలు కనిపించడం లేదు.

కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలే అడ్డంకి..

కర్బన రహిత లక్ష్యంలో భాగంగా చైనా ప్రభుత్వం అక్కడి రాష్ట్రాలకు టార్గెట్‌లు నిర్దేశించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుదుత్పత్తిపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇది కూడా విద్యుత్తు కోతలకు దారి తీస్తోంది.

స్వచ్ఛ ఇంధన వనరుల వాటా అంతంతే..

విద్యుదుత్పత్తిలో జల, పవన, సౌర వనరుల వాటా పెంచేందుకు చైనా చర్యలు చేపట్టింది. 2025 నాటికి 20 శాతం విద్యుత్తు డిమాండ్‌ను ఈ వనరులతో తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వర్షాలు ఆలస్యంగా కురవడంతో జల విద్యుదుత్పత్తి తగ్గిపోయింది. మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పవన విద్యుత్తు కేంద్రాల్లోనూ ఉత్పత్తి పడిపోయింది.

ఉత్పత్తిని పెంచడానికి సిద్ధంగా ఉన్నారా?

ముఖ్యంగా బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉత్పత్తి పెంపునకు సుముఖంగా లేవు. దీనిక ప్రధాన కారణం బొగ్గు ధరలు పెరగడమే. రవాణా చార్జీలు పెరగడం, వెలికితీత వ్యయాలు ఎగబాకడంతో పాటు డిమాండ్‌-సప్లయ్‌ హెచ్చుతగ్గుల కారణంగా బొగ్గు ధరలు పెరిగాయి. దీంతో విద్యుదుత్పత్తి కేంద్రాలు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. ఒకవేళ ఉత్పత్తిని పెంచినా విద్యుత్తు ఛార్జీలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని స్థానిక ప్రభుత్వాలు ఆయా సంస్థలకు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాయి. ఇది మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది.

పర్యావరణ లక్ష్యాలను చైనా సడలిస్తుందా?

తిరుగులేని అధికారంతో ముందుకెళ్తున్న షీ జిన్‌పింగ్‌ లక్ష్యాల్లో చైనాను కర్బన రహితంగా మార్చాలన్నది ముందు వరుసలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో ఆయన ప్రభుత్వం రాజీపడే అవకాశం లేదనే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా స్థానిక ప్రభుత్వాల ప్రణాళికలేమి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇటీవల ప్రభుత్వ పెద్దలు ఆరోపించడాన్ని బట్టి చూస్తే.. పర్యావరణ లక్ష్యాల విషయంలో రాజీపడే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐరాస సర్వసభ్య సమావేశంలోనూ కర్బన రహిత లక్ష్యాలను జిన్‌పింగ్‌ నొక్కి చెప్పారు.

చైనాలో పరిస్థితి ఇలాగే కొనసాగితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగానూ ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనా జీడీపీలో మూడో వంతు వాటా కలిగిన జీయాంగ్‌సూ, ఝెజియాంగ్‌, గువాంగ్‌డోంగ్‌ ప్రావిన్సుల్లో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉంది. ఆ దేశ పవర్‌హౌస్‌లుగా భావించే ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి దెబ్బతింటే ఆ ప్రభావం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts