షేర్ల ఎంపిక‌లో ఈ త‌ప్పులు వ‌ద్దు

షేర్ మార్కెట్ లో మ‌దుపుకు సంబంధించి ముందు ఏంచేయ‌కూడ‌ద‌నేది చూద్దాం...

Published : 22 Dec 2020 15:50 IST

షేర్ మార్కెట్ లో మ‌దుపుకు సంబంధించి ముందు ఏంచేయ‌కూడ‌ద‌నేది చూద్దాం

షేర్ల‌లో పెట్టుబ‌డి చేసేముందు మ‌దుప‌ర్లు ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోవాలి. చిన్నచిన్న పొర‌పాట్లే పెద్ద న‌ష్టాల‌కు దారితీయ‌వ‌చ్చు. షేర్ల ఎంపిక‌లో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా మంచి లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చు. ప్రాథ‌మిక అంశాలు తెలియ‌కుండా…మ‌నం మ‌దుపుచేసే షేరు గురించి క‌నీస విష‌యాలు తెలియ‌కుండా మ‌దుపుచేయోద్దు. ఆ కంపెనీ ఏరంగానికి చెందింది ? చేసే వ్యాపారం ఏంటి? లాంటి క‌నీస విష‌యాలు తెలుసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

ఎవ‌రో చెప్పార‌ని…షేర్ల గురించి చ‌ర్చించేంట‌పుడు ఎవ‌రైనా ఫలానా షేరు బావుంటుంద‌ని చెప్పొచ్చు. అంత‌లోనే అవ‌త‌లి వ్య‌క్తి చెప్పింది గుడ్డిగా న‌మ్మి పెట్టుబ‌డి చేయ‌కూడ‌దు. ఆ షేరును ప‌రిశీలించాలి. కంపెనీ చేసే వ్యాపారాన్ని అర్థంచేసుకుని ఆ త‌రువాత నిర్ణ‌యం తీసుకోవాలి. ఇత‌రుల స‌ల‌హాలు నిర్ణ‌యం తీసుకునేందుకు ఉప‌యోగించుకోవాలి కానీ వారిచ్చిన సల‌హాల‌ను నిర్ణ‌యాలుగా తీసుకోకండి. ఎవ‌రైనా చెప్పిన విష‌యాల‌ను విని వాటి ద్వారా కొంత అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోండి. పెట్టుబ‌డి చేసే ముందు మాత్రం మీ ప‌రిశీల‌న‌లో తెలుసుకున్న‌ విష‌యాల ద్వారా నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిది. మార్కెట్లో అంద‌రూ ఒక కంపెనీ షేర్లు కొంటున్నార‌ని మ‌నం కూడా వాటిని కొనుగోలుచేయ‌డం అంత మంచిది కాదు. అస‌లు చెప్పాలంటే మార్కెట్లో అంద‌రూ కొనేట‌పుడు మ‌నం అమ్మాలి. ఆ స‌మ‌యంలో షేర్ల‌కు డిమాండు పెరిగి ధ‌ర కూడా పెరుగుతుంది. మ‌న షేర్ల‌కు మంచి ధ‌ర ప‌లుకుతుంది. అంద‌రూ షేర్లు అమ్మేట‌పుడు మ‌నం కొనాలి. ఆసమ‌యంలో షేర్ల కు డిమాండు త‌గ్గి ధ‌ర కూడా త‌గ్గుతుంది. త‌క్కువ ధ‌ర కు షేర్లు దొరికే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌సార మాధ్య‌మాల్లో, వార్తా ప‌త్రిక‌ల్లోవ‌చ్చే సిఫార్సుల‌ను గుడ్డిగా అనుస‌రించ‌వ‌ద్దు. ఆ సూచ‌న‌ల‌ను స‌రిగా అర్థంచేసుకోకుండా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం చాలా ప్ర‌మాదం. దీర్ఘ‌కాలిక మ‌దుప‌ర్ల‌ను ఉద్దేశించి విశ్లేష‌కులు స‌ల‌హాలు ఇస్తే స్వ‌ల్ప‌కాలిక వ్యూహం క‌లిగిన మ‌దుప‌ర్లకు స‌రిపోవు. స్వ‌ల్ప‌కాలిక మ‌దుప‌ర్ల‌కు ఇచ్చిన స‌ల‌హాలు దీర్ఘ‌కాలిక మ‌దుప‌ర్ల‌కు స‌రిపోవు. కాబ‌ట్టి విశ్లేష‌కులు ఇచ్చిన స‌ల‌హాలు సూచ‌న‌ల‌ను జాగ్ర‌త్త‌గా అర్థం చేసుకుని నిర్ణ‌యాలు తీసుకోవాలి. ఎస్ఎమ్ఎస్ సూచ‌న‌లతో జాగ్ర‌త్త - సంక్షిప్త సందేశాల ద్వారా మ‌దుప‌ర్లకు షేర్ల స‌ల‌హాలు - సూచ‌న‌లను పంపించే సంస్థ‌లు ఉన్నాయి. ఆ సూచ‌న‌ల‌ను పాటించ‌డంవ‌ల్ల న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంది. మీ ఖాతా క‌లిగి బ్రోకింగ్ సంస్థ‌ వారు పంపించే సూచ‌న‌లు ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు. అర్హత లేని వారిని సంప్రదించి సలహాలు తీసుకోవడం కన్నా బ్రోకింగ్ సంస్థ‌లో మీ ఖాతా వ్య‌వ‌హారాల‌ను చూసే వ్య‌క్తిని సంప్ర‌దించి సూచ‌న‌లు-స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది.

ల‌క్ష్యానికి స‌రిపోక‌పోతే:

షేర్ల‌లో పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంపాటు కొన‌సాగే వారికి లాభ‌దాయ‌కంగా ఉంటాయి. కనీసం మూడు నుంచి ఐదు సంవ‌త్స‌రాల‌పైన మ‌దుపు చేసే ఆలోచ‌న‌తో ఉండాలి.

  • స్వ‌ల్ప‌కాలం పాటు పెట్టుబ‌డి పెట్టాల‌నుకునే వారు దానికి స‌రిప‌డే ఇత‌ర పెట్టుబ‌డి సాధ‌నాలైన‌ మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు.

  • ఏ పెట్టుబ‌డి సాధ‌నంలో మ‌దుపు చేసినా మ‌దుప‌ర్లు త‌మ లక్ష్యాన్నిదృష్టిలో ఉంచుకోవాలి.

  • కొన్ని కంపెనీలు లాభాలు ఆర్జించేదుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది.

  • ఉదాహ‌ర‌ణ‌కు ప‌రిశ్ర‌మ‌లు భారీగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తాయి. అయితే వెంట‌నే లాభాలు వ‌చ్చేస్తాయి అని చెప్ప‌లేం. కొన్నికంపెనీలు స్వ‌ల్ప‌కాలంలోనే మంచి లాభాలు గ‌డించి పోనుపోనూ ఆక‌ర్ష‌ణీయ ఫ‌తితాల‌ను రాబ‌ట్ట‌క‌పోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని