‘సిప్’ చేస్తున్నారా.. ఈ త‌ప్పులు చేయ‌కండి..

'సిప్' పెట్టుబడుల నుంచి ఎక్కువ ప్రయోజనం పొందేందుకు చేయ‌కూడ‌ని  ఏడు త‌ప్పుల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 

Updated : 09 Oct 2021 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో క్ర‌మ శిక్ష‌ణ‌తో మ‌దుపు చేస్తే దీర్ఘ‌కాలంలో మంచి సంప‌ద‌ను సృష్టించుకోవ‌చ్చు. చిన్న మొత్తాల‌తో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవారికి క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం (సిప్‌) ఒక మంచి మార్గం. అందుకే చాలా మంది మ‌దుప‌రులు ఈ విధానాన్ని ఎంచుకుంటారు. అయితే కొన్ని ప్రాథ‌మిక లోపాల కార‌ణంగా సిప్ నుంచి రాబ‌డిని పెంచ‌డంలో కొంత‌మంది మ‌దుప‌రులు విఫ‌లం అవుతున్నారు. అలాంటి వారు ఈ విధానం ద్వారా ఎక్కువ ప్ర‌యోజ‌నం పొందేందుకు, అధిక రాబ‌డిని సాధించేందుకు చేయ‌కూడ‌ని త‌ప్పులు ఏంటో ఇప్పుడు  తెలుసుకుందాం.

1. అవాస్త‌వ‌ లక్ష్యాలను సెట్ చేయడం.. 
చాలా మంది మ‌దుపరులు చేసే సాధారణ తప్పు అవాస్తవిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. ఒక లక్ష్యాన్ని చేరుకునేందుకు మీకున్న ఆర్థిక వ‌న‌రులు, ఎంచుకున్న పెట్టుబ‌డి సాధనాన్ని బ‌ట్టి కొంత స‌మ‌యం ప‌డుతుంది. స‌రైన కాల‌వ్య‌వ‌ధి లేకుంటే ప‌ర్య‌వేక్షించడం క‌ష్టం. ఉదాహరణకు, మీరు త్వరగా రిటైర్ అవ్వాల‌నుకుంటున్నారు అనుకుందాం. ఇందుకు ఏ వ‌య‌సులో రిటైర్ అవ్వాల‌నుకుంటున్నారు? ఆ స‌మ‌యానికి ఎంత మొత్తం స‌మ‌కూర్చుకోవాలి? ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత ఏం చేయాలి? ఇలా అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి. మీ ల‌క్ష్యం వాస్త‌వానికి దూరంగా ఉండ‌కూడ‌దు. మీ ఆదాయానికి త‌గిన‌ట్లు సాధించద‌గిన లక్ష్యాన్ని ఎంచుకుంటే.. దాన్ని సాధించేందుకు సిప్ ప్ర‌ణాళిక మీకు మ‌ద్ద‌తునిస్తుంది.

2. ల‌క్ష్యం కోసం పెట్టుబ‌డి ఎంపిక‌లో చేసే త‌ప్పులు..
కొంతమంది మ‌దుప‌రులు ఎక్కువ రాబ‌డి ఆశించి.. రిస్క్ ప్రొఫైల్‌ని దృష్టిలో పెట్టుకోకుండా ప‌థ‌కాల‌ను ఎంచుకుని మార్కెట్లు, పోర్ట్‌ఫోలియో అస్థిర‌త గురించి నిరంత‌రం ఆందోళ‌న చెందుతారు. అలా కాకుండా ఉండాలంటే ముందుగా నిర్దిష్ట ల‌క్ష్యాన్ని ఎంచుకోవాలి. దాన్ని చేరుకునేందుకు ఉన్న‌ స‌మ‌యాన్ని అంచ‌నా వేయాలి. మీ ప్ర‌మాద స్థాయిని చూడాలి. ఈ అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని పెట్ట‌బుడి సాధానాన్ని ఎంపిక చేసుకోవాలి.

3. స్వల్ప కాలానికి ఈక్వీటీల్లో సిప్ ద్వారా పెట్టుబ‌డులు పెట్ట‌డం..
ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే, వాటిని దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగించాల‌ని సిఫార‌సు చేస్తుంటారు నిపుణులు. స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల కోసం స్థిర‌త్వంతో పాటు లిక్విడిటీ అధికంగా ఉన్న లిక్విడ్ ఫండ్లు లేదా డెట్ ఫండ్ల‌ను ఎంపిక చేసుకోవ‌డం మేలు.

4. 'సిప్' గ‌రిష్ఠ ప‌రిమితి..
సిప్‌ను ప్రారంభించేందుకు గ‌రిష్ఠ ప‌రిమితి అంటూ ఏదీ లేదు. మీకు వీలైనంత మొత్తాన్ని సిప్ ద్వారా మ‌దుపు చేయొచ్చు. అయితే, ఎంచ‌కున్న మొత్తానికి క‌ట్టుబ‌డి.. కాల‌వ్య‌వ‌ధి వ‌ర‌కు పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాలి. సిప్‌ని ప్రారంభించే ముందు మీరు ప్ర‌తి నెలా సుల‌భంగా చెల్లించ‌ గ‌ల మొత్తాన్ని అంచ‌నా వేసి.. ఎంత మొత్తంతో సిప్ ప్రారంభించ‌వ‌చ్చో నిర్ణ‌యించండి. బ‌డ్జెట్, రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం, కాల‌వ్య‌వ‌ధి త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని సిప్ మొత్తాన్ని సిప్ క్యాలిక్యులేట‌ర్ సాయంతో లెక్కించొచ్చు.

5. ‘సిప్’ క‌నీస మొత్తం..
చాలా వ‌ర‌కు మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్‌ల్లో రూ.500 క‌నీస మొత్తంతో సిప్ ద్వారా మ‌దుపు చేయొచ్చు. అయితే క‌నీస మొత్తంతో సిప్ చేయ‌డం మంచిది కాదు. వివాహం, పిల్ల‌ల విద్య, ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం మ‌దుపు చేసేటప్పుడు ఆ లక్ష్యానికి కావ‌ల‌సిన మొత్తం, అందుకు ఉన్న కాల‌వ్య‌వ‌ధి వంటి అంశాల‌ను, అలాగే మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని త‌గిన రాబ‌డి రేటును అంచనావేసి సిప్ క్యాలిక్యులేట‌ర్ స‌హాయంతో సిప్ మొత్తాన్ని లెక్కించొచ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్యానికి ద‌గ్గ‌ర‌య్యే స‌మ‌యానికి త‌గిన మొత్తం స‌మ‌కూర్చుకోగ‌లుగుతారు. ఎక్కువ మొత్తంలో మ‌దుపు చేయ‌లేని వారు క‌నీస మొత్తంతో సిప్‌ని ప్రారంభించిన‌ప్ప‌టికీ ఆదాయం పెరిగిన ప్ర‌తిసారీ స్టెప్‌-అప్ విధానంలో సిప్ మొత్తాన్ని పెంచుకోవ‌చ్చు.

6. మార్కెట్‌ ఒడుదొడుకుల్లో ‘సిప్’ ర‌ద్దు చేయ‌డం..
ఈక్విటీ ఫండ్లు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని ఇస్తాయి. అనుకున్న ల‌క్ష్యాన్ని చేరేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే మార్కెట్లు స్వ‌ల్ప‌కాలంలో అనిశ్చితికి లోన‌వుతాయి. ఈ స‌మ‌యంలో సిప్‌ని ర‌ద్దు చేస్తే మీ పెట్టుబ‌డుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. స్టాక్ మార్కెట్లలో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తున్నప్ప‌టికీ సిప్‌ని ఆప‌కూడ‌దు. కొన‌సాగించాలి. ఇలా చేస్తే దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి పొందే అవ‌కాశం ఉంది.

7. స్వల్ప వ్యవధిలో 'సిప్' పనితీరును సమీక్షించడం..
మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం, రీబ్యాలెన్స్ చేయడం మంచి విష‌య‌మే. ఇలా చేయ‌డం వ‌ల్ల పోర్ట్‌ఫోలియో ప‌నితీరును బ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. అయితే స్వ‌ల్ప కాల వ్య‌వ‌ధిలో సమీక్షించడం, రీబ్యాలెన్స్ చేయ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితాల‌ను పొంద‌లేక‌పోవ‌చ్చు.

చివ‌రిగా..
సిప్‌ని ఏర్పాటు చేయ‌డం ఒక తెలివైన నిర్ణ‌యం. ఇది మీ ఆర్థిక జీవితాన్ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తుంది. సిప్‌తో దీర్ఘ‌కాలం పాటు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మ‌దుపు చేసే అల‌వాటు వ‌స్తుంది. మార్కెట్ల‌లో పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విష‌యం ఏంటంటే.. స్వ‌ల్ప‌కాల హెచ్చ‌త‌గ్గుల‌కు ఆందోళ‌న చెంద‌కూడ‌దు. దీర్ఘ‌కాలంలో ఇవ‌న్ని స‌ర్దుకుని మంచి రాబ‌డి ఇస్తాయ‌ని గుర్తుంచుకోవాలి. సిప్ ఫోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేయ‌డంలో ఆర్థిక స‌ల‌హాదారు స‌హాయం తీసుకోవ‌చ్చు. త‌ద్వారా మీ ల‌క్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్‌, కాల‌వ్య‌వ‌ధి ఆధారంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేసి మంచి రాబ‌డిని పొంద‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని