మీరు డిజిటల్ బ్యాంకింగ్ ను వినియోగించరా?

ఒకవేళ మీకు సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన లేకనో లేదా భద్రతా కారణాల వలన ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ సర్వీసులను వినియోగించడానికి నివారిస్తున్నట్లైతే, ఇప్పుడు ఆ సంకోచాన్ని తొలగించే సమయం ఆసన్నమైంది. కోవిడ్ -19 కారణంగా ప్రపంచం మొత్తం సామాజిక దూరాన్ని చాలా తీవ్రంగా అమలు చేస్తుంది, అలాగే డిజిటల్ లావాదేవీలు చేయాల్సిన అవసరం కూడా రోజు రోజుకీ పెరుగుతుంది...

Updated : 01 Jan 2021 19:50 IST

ఒకవేళ మీకు సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన లేకనో లేదా భద్రతా కారణాల వలన ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ సర్వీసులను వినియోగించడానికి నివారిస్తున్నట్లైతే, ఇప్పుడు ఆ సంకోచాన్ని తొలగించే సమయం ఆసన్నమైంది. కోవిడ్ -19 కారణంగా ప్రపంచం మొత్తం సామాజిక దూరాన్ని చాలా తీవ్రంగా అమలు చేస్తుంది, అలాగే డిజిటల్ లావాదేవీలు చేయాల్సిన అవసరం కూడా రోజు రోజుకీ పెరుగుతుంది.

భద్రతా సమస్యల కారణంగా చాలా మంది ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ సర్వీసును ఉపయోగించడం లేదు. కానీ కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పుడు ఇంట్లో కూర్చునే పొదుపు ఖాతాలను తెరవడానికి, చెల్లింపులు చేయడానికి అనుమతిస్తున్నాయి, KYC నిబంధనల కోసం ఆధార్ ను ఉపయోగించి, కొత్త బ్యాంకు ఖాతాను తెరిచి, దానికి కొద్ది మొత్తాన్ని బదిలీ చేసి, డిజిటల్ బ్యాంకింగ్‌ సర్వీసును ఉపయోగించుకోండి. ఒకసారి మీకు నమ్మకం వచ్చిన తర్వాత, దానిని మీ ప్రైమరీ ఖాతాగా మార్చుకోవచ్చు.

డబ్బు బదిలీలతో సహా అనేక డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఉచితం అని గుర్తుంచుకోండి. గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బ్యాంకింగ్ సర్వీసులను వినియోగించే వారికి కొంత ఉపశమనం కలిగించారు. ఒకవేళ వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల్లో సగటు నెలవారీ లేదా త్రైమాసిక బ్యాలెన్స్‌ను నిర్వహించలేకపోతే బ్యాంకులు ఎటువంటి చార్జీలు లేదా జరిమానాలు విధించవు.

వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో (ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్) సుమారు 250 కు పైగా ఫీచర్‌లను పొందవచ్చు. వారు వారి చిరునామాను మార్చుకోవడం, చెక్కు బుక్ ఆర్డర్ చేయడం, వారి KYC ని అప్‌డేట్ చేయడం వంటివి చేయవచ్చు. అలాగే వినియోగదారులు కొత్త క్రెడిట్ కార్డు, రుణాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో తమ డబ్బును పెట్టుబడి పెట్టవచ్చునని యాక్సిస్ బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ సమీర్ శెట్టి తెలిపారు.

సుమారు ఒక సంవత్సరం క్రితం వరకు చాలా బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ సర్వీసును యాక్టీవేట్ చేసుకోడానికి బ్యాంకు శాఖలను సందర్శించాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చునే ఇలాంటి సర్వీసులను పొందవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ సర్వీస్ ను యాక్టీవేట్ చేయడానికి చాలా బ్యాంకులు అనుసరించే విధానాన్ని కింద చూద్దాం.

బ్యాంకుకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌కి వెళ్లి “న్యూ యూజర్” ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ కస్టమర్ ఐడీ, ఖాతా నంబర్‌ను ఉపయోగించి సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. మీ చెక్కు బుక్‌, పాస్ బుక్ తో సహా అన్ని బ్యాంకింగ్ కమ్యూనికేషన్లలో కస్టమర్ ఐడీని నమోదు చేస్తారు. చాలా బ్యాంకులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీని (వన్-టైమ్ పాస్వర్డ్) పంపుతాయి. అలాగే మీరు మీ డెబిట్ కార్డ్ నంబర్, దాని పిన్ (వ్యక్తిగత గుర్తింపు సంఖ్య)ని కూడా నమోదు చేయవలసి ఉంటుంది. అనంతరం పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకుని ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసును ఉపయోగించడం ప్రారంభించండి.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

బ్యాంకు వెబ్‌సైట్ సరైనదని నిర్ధారించుకోండి. వెబ్ సైట్ URL “http” తో కాకుండా “https” తో ప్రారంభం కావాలి. దీని అర్ధం వెబ్‌సైట్‌ పూర్తి భద్రతతో కూడుకున్నదని. నకిలీ వెబ్‌సైట్‌లకు “https” తో ప్రారంభమయ్యే చిరునామా ఉండదు.

మొబైల్ బ్యాంకింగ్ యాప్ ని డౌన్‌లోడ్ చేసేటప్పుడు, యాప్ డెవలపర్ మీ సంబంధిత బ్యాంకు అని నిర్ధారించుకోండి.

అన్ని బ్యాంకింగ్ లావాదేవీలు మీ ఇంటి వైఫై లేదా మొబైల్ ఫోన్ డేటాలో చేయాలి. పబ్లిక్ వైఫైని ఎప్పుడూ ఉపయోగించవద్దు.

ఈ లాక్‌డౌన్‌ను భవిష్యత్తులో డిజిటల్ బ్యాంకింగ్‌కు అలవాటు చేసుకునే అవకాశంగా ఉపయోగించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని