ప‌దవీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా ఎన్‌పీఎస్‌లో మ‌దుపు చేయ‌వ‌చ్చు

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆనంద‌క‌ర జీవితం గ‌డిపేందుకు అవ‌స‌ర‌మైన నిధిని ఏర్పాటు చేయ‌డంలో జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(ఎన్‌పీఎస్‌) ఎంతో కీల‌క‌మైన‌ది. ఇందులో వ్య‌క్తులు 60 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు మ‌దుపు చేయ‌వ‌చ్చు.....

Published : 17 Dec 2020 15:27 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌డ‌మెలాగో తెలుసుకుందాం

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆనంద‌క‌ర జీవితం గ‌డిపేందుకు అవ‌స‌ర‌మైన నిధిని ఏర్పాటు చేయ‌డంలో జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(ఎన్‌పీఎస్‌) ఎంతో కీల‌క‌మైన‌ది. ఇందులో వ్య‌క్తులు 60 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు మ‌దుపు చేయ‌వ‌చ్చు. మెచ్యూరిటీ తీరే ద‌శ‌లో అంటే 60 ఏళ్లు నిండాకా, మొత్తం నిధిలో 60 శాతం మొత్తాన్ని ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. మిగిలిన 40 శాతం సొమ్ముతో యాన్యుటీ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొత్తం సొమ్ముల‌తో యాన్యుటీ ఉత్ప‌త్తుల‌ను కూడా కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే మెచ్యూరిటీ తీర‌గానే, మీకు న‌గ‌దును ఉప‌సంహ‌రించుకునే ఉద్దేశ్యం లేక ఎన్‌పీఎస్‌లోనే పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాల‌నుకుంటున్నారా. దీనికి సంబంధించి కొన్ని నిబంధ‌న‌ల‌ను పీఎఫ్ఆర్‌డీఏ స‌వ‌రించింది. ఆ వివ‌రాలు తెలుసుకుందాం.

మీ వ‌య‌సు 60 ఏళ్ల లోపు ఉంటే:

మీ వ‌య‌సు 18 ఏళ్లు దాటి ఉంటే, 60 ఏళ్లు వ‌చ్చేంత వ‌ర‌కూ మీరు ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. మెచ్యూరిటీ తీరిన త‌ర్వాత మీకు మూడు ర‌కాల ఎంపిక‌లు ఉంటాయి. అందులో ఒకటి త‌ప్ప‌నిస‌రిగా మీరు పాటించాల్సి ఉంటుంది. అదేంటంటే మొత్తం నిధిలో 40 శాతం మొత్తాన్ని అలాగే ఎన్‌పీఎస్‌లో ఉంచాలి.

మీ పింఛ‌ను నిధిలో క‌నీస మొత్తం న‌గ‌దును యాన్యుటీ ప‌థ‌కాలను కొనుగోలు చేసి, మిగిలిన మొత్తాన్ని పెట్టుబ‌డులుగా పెట్టి మీకు 70 ఏళ్లు నిండిన త‌ర్వాత ఉపసంహ‌రించుకోవ‌చ్చు. 70 ఏళ్లు నిండేవ‌ర‌కూ, పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు.

అంతేగాకుండా మెచ్యూరిటీ ద‌శ వ‌చ్చిన‌ప్పుడు, యాన్యుటీ ఉత్ప‌త్తుల‌లో మూడేళ్ల పాటు పెట్టుబ‌డులు పెట్టకుండా ఉండే వెసులుబాటు ఉంది. కాబ‌ట్టి ఇలాంటి స‌మ‌యాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది.

అయితే మెచ్యూరిటీ తీరే ద‌శ‌లో మీ పింఛ‌ను నిధి రూ.2 ల‌క్ష‌లు లేదా అంత‌కంటే త‌క్కువుంటే, మీరు మొత్తం సొమ్మును ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. అలాగే యాన్యుటీ ఉత్ప‌త్తుల‌ను త‌ప్ప‌నిస‌రిగా కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం లేదు.

మీ వ‌య‌సు 60 ఏళ్లు మించిన‌ట్ల‌యితే:

మెరుగైన వైద్య స‌దుపాయాల‌తో జీవ‌న ప్ర‌మాణాలు పెర‌గ‌డం, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన డిమాండ్ల‌తో, 60 ఏళ్ల కాల‌పరిమితిని పీఎఫ్ఆర్‌డీఏ 65 ఏళ్ల‌కు పెంచింది. దీని ప్ర‌కారం మీ వ‌య‌సు 60 నుంచి 65 ఏళ్ల లోపుంటే, మీరు ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. మీకు 70 ఏళ్లు నిండేంత వ‌ర‌కు, క‌నీసం మూడేళ్లపాటు మ‌దుపు చేయాల్సి ఉంటుంది.

అంతేగాకుండా ఎన్‌పీఎస్ నుంచి నిష్క్ర‌మించే స‌మ‌యంలో పాత 60 ఏళ్ల లోపున్న చందాదారులకు వ‌ర్తించే నిబంధ‌న‌లే వీరికీ వ‌ర్తిస్తాయి.

ముందే నిష్క్ర‌మించ‌డం సాధ్య‌మ‌వుతుందా:

ప‌దవీ విర‌మ‌ణ‌కు ముందే లేదా 60 ఏళ్లు నిండిన త‌ర్వాత‌, మూడేళ్ల లోపే మీరు ఎన్‌పీఎస్ నుంచి వైదొల‌గాల‌నుకున్న సంద‌ర్భాల‌లో ఈ కింది నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. ఎన్‌పీఎస్ అనేది ప్ర‌ధానంగా ప‌ద‌వీ విర‌మ‌ణకు ఉద్దేశించింది కాబ‌ట్టి, ప‌థ‌కం నుంచి ముందే నిష్క్ర‌మించ‌డానికి నిబంధ‌న‌లు అంత‌గా ఒప్పుకోవు. అయితే మెచ్యూరిటీ తీరిన త‌ర్వాత మీ చేతిలో కేవ‌లం 20 శాతం సొమ్ములు మాత్ర‌మే ఉంటాయి. మిగిలిన 80 శాతం నిధుల‌తో మీరు త‌ప్ప‌నిస‌రిగా యాన్యుటీ ప‌థ‌కాల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అందుకే, ఎన్‌పీఎస్‌లో మ‌దుపు చేసే ముందే, ఎంత మేర మ‌దుపు చేయాల‌నుకుంటున్నారో నిర్ణ‌యించుకోండి. అయితే ఎన్‌పీఎస్‌లో పాక్షికంగా న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌లు చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని