Adani: గంటకు రూ.75కోట్లు..!

గంటకు రూ.75 కోట్లు.. ఈ ఏడాది గౌతం అదానీ సంపద పెరిగిన వేగం. ఆయన నేతృత్వంలోని అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో

Updated : 27 May 2021 14:54 IST

 480శాతం పెరిగిన అదానీ లిస్టెడ్‌ కంపెనీల విలువ

ఇంటర్నెట్‌డెస్క్‌: గంటకు రూ.75 కోట్లు.. ఈ ఏడాది గౌతమ్‌ అదానీ సంపద పెరిగిన వేగం. ఆయన నేతృత్వంలోని అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో గతేడాది ఇదే సమయానికి రూ.10,000 పెట్టుబడి పెడితే అది ఇప్పుడు రూ.52,000 విలువ సాధించింది. ఈ ఒక్క ఏడాదిలో సంపాదన ఆయన్ను అంబానీల సరసన చేర్చింది.  దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాలైన టాటా, బిర్లా, అంబానీ, వాడియా కుటుంబాలతో ఇప్పుడు పోటీపడుతోంది.

ఇన్‌ఫ్రా.. ఇన్‌ఫ్రా..

అదానీ సంపద విలువ వేగంగా పెరగడానికి కారణం ఆయన గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలు ఇన్‌ఫ్రాపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. గత రెండేళ్ల నుంచి ఈ కంపెనీలు వేగంగా పెట్టుబడులు పెట్టాయి. మొత్తం పెట్టిన రూ.50 వేల కోట్లలో.. కేవలం గతేడాదిలోనే  రూ.25 వేల కోట్లను పెట్టుబడులు కింద పెట్టారు. అదానీ గ్రూప్‌ వరుసగా గ్యాస్‌ పంపిణీ, పవర్‌, ఓడరేవులు, విద్యుత్తు పంపిణీ రంగాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. వీటిల్లో చాలా రంగాల్లో పెట్టుబడుల విలువ అనతికాలంలోనే కొన్ని రెట్లు పెరిగింది. 

భారీగా మార్కెట్‌ విలువ..

గతేడాది అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.1.64 లక్షల కోట్లు ఉంది. ఈ ఏడాది అదే సమయానికి 420 శాతం పెరిగి రూ.8.5లక్షల కోట్లకు చేరింది. దేశంలో ముఖేశ్‌ అంబానీ సంపద 77 బిలియన్‌ డాలర్లు ఉండగా.. ఆయనకు సమీపంలోని గౌతమ్‌ అదానీ సంపద విలువ 69 బిలియన్‌ డాలర్లు కావడం విశేషం. 2021 సంవత్సర ప్రారంభం నుంచి అదానీ సంపద గంటకు రూ.75 కోట్లు చొప్పున పెరుగుతూ వస్తోంది. ఈ స్థాయిలో సంపాదిస్తున్న వారిలో ప్రపంచంలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌, ఫ్రెంచి లగ్జరీ టైకూన్‌ బెర్నార్డ్‌ ఆర్నల్డ్‌ మాత్రమే ఉన్నారు. 

కంపెనీల విలువ పెరిగింది ఇలా..

అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో ఏడాదిగా అత్యల్పంగా విలువ పెరిగిన కంపెనీ అదానీ పోర్ట్స్‌. అది 144 శాతం విలువ పెరిగింది. అదానీ టోటల్‌ గ్యాస్‌ విలువ అత్యధికంగా 1069 శాతం మార్కెట్‌ విలువను పెంచుకొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 842 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 715శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 442శాతం, అదానీ పవర్‌ 176 శాతం మార్కెట్‌ విలును పెంచుకొన్నాయి. మొత్తం మీద ఆరు కంపెనీలు కలిపి 420శాతం విలువ పెరిగాయి.

అంబానీతో పోటీపడగలరా..?

ప్రస్తుతం అంబానీ, అదానీ సంపదల మధ్య దాదాపు 8 బిలియన్‌ డాలర్లు ఉంది. గతేడాది అదానీ సంపద విలువ పెరిగిన వేగం చూస్తే ఆయన అంబానీని దాటేస్తారని భావిస్తున్నారు. కానీ, ఇది అంత తేలిక  కాదు. గతేడాది జియో ప్లాట్‌ఫామ్స్‌, రిలయన్స్‌ రిటైల్‌ డీల్స్‌తో అంబానీ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. అదే సమయంలో అదానీ ఆస్తుల విలువ పెరగడంలో షేర్‌ మార్కెట్‌ పాత్రకూడా చాలా ఉంది. ఇక అంబానీ వద్ద జియోప్లాట్‌ ఫామ్స్‌ మార్కెట్లో లిస్ట్‌ అవ్వలేదు. అది లిస్ట్‌ అయితే కనుక ముఖేశ్‌ అంబానీ ఆస్తుల విలువ భారీగా పెరిగిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ సంస్థలో ప్రపంచ స్థాయి టెక్‌ దిగ్గజాలు ఆకర్షణీయమైన రేట్లకు వాటాలను కొనుగోలు చేశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని