సీనియ‌ర్ సిటిజ‌న్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు ఎందుకు మొగ్గుచూపుతారంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో సీనియ‌ర్ సిటిజ‌న్ల ఆర్థిక జీవితానికి హామీ ల‌భిస్తుంది.........

Published : 25 Dec 2020 15:38 IST

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో సీనియ‌ర్ సిటిజ‌న్ల ఆర్థిక జీవితానికి హామీ ల‌భిస్తుంది.

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత రెగ్యుల‌ర్‌గా ఆదాయం రావ‌డం ఆగిపోతుంది. అందుకే ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా సంతోషంగా జీవ‌నాన్ని కొన‌సాగించాలంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్‌గా పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు త‌క్కువ‌గా రిస్క్, పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అప్ప‌టివ‌ర‌కు క‌ష్ట‌ప‌డి సంపాదించిన‌దానికి డ‌బ్బు భ‌ద్రంగా ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ప‌లుర‌కాల ప‌థ‌కాలు ఉన్న‌ప్ప‌టికి ఎక్కువ‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.

పెట్టుబ‌డుల భ‌ద్ర‌త‌తో పాటు క‌చ్చిత‌మైన లాభాలు ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లు సీనియ‌ర్ సిటిజ‌న్లు మంచి ఆప్ష‌న్‌గా భావిస్తున్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు ఎందుకు మొగ్గుచూపుతున్నారో ప‌రిశీలిస్తే…

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఎక్కువ వ‌డ్డీ రేట్లు:
బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఎక్కువ వ‌డ్డీని ఇస్తున్నాయి. ఎఫ్‌డీ ఖాతా తెరిచిన‌ప్పుడే ఆటో- రెన్యువ‌ల్ ఆప్ష‌న్ ఎంచుకునే అవ‌కాశం ఉంది. దీంతో మెచ్యూరిటీ త‌ర్వాత తిరిగి పెట్టుబ‌డులు ప్రారంభ‌మ‌వుతాయి. దీంతో లాభాలు రెట్టింపు అవుతాయి.

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత రోజువారీ ఖ‌ర్చుల కోసం, ఇత‌ర అవ‌స‌రాలు, ల‌క్ష్యాల కోసం డ‌బ్బు అవ‌స‌రం కావొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఒక ప్రాప‌ర్టీని మీ పిల్ల‌ల‌కు గిఫ్ట్‌గా ఇవ్వాల‌నుకుంటే, పెళ్లి చేయాల‌నుకుంటే, ఏదైనా వేడుక ఘ‌నంగా జ‌ర‌పాల‌నుకుంటే , ముంద‌స్తు రుణ చెల్లింపులు చేయడం వంటివి. ప్రతి అవసరానికి సౌకర్యవంతంగా చెల్లించడానికి, ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఎఫ్‌డిలను ఎంచుకోవ‌చ్చు. ఈ విధంగా అవసరాలను సకాలంలో పూర్తిచేసేందుకు మీ వ‌ద్ద‌ ఎల్లప్పుడూ నిధులు ఉంటాయి. రెగ్యుల‌ర్‌గా ఆదాయం పొందాల‌నుకుంటే నెల‌కు, మూడు నెల‌ల‌కు, ఆరు నెల‌ల‌కు, సంవ‌త్స‌రానికి న‌గ‌దు పొందే విదంగా ఆప్ష‌న్స్ ఎంచుకోవ‌చ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై రుణ స‌దుపాయం:
మీ జీవితంలో ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు రావొచ్చు. ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు, వ‌య‌సు రిత్యా వ‌చ్చే జబ్బుల‌తో తరచుగా వైద్య చికిత్సలు చేసుకోవాల్సి రావొచ్చు. అటువంటి సమయాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై రుణం పొంద‌వ‌చ్చు. ఈ విధంగా, మీరు మీ పెట్టుబడిని ఉప‌సంహ‌రించుకోకుండా అవ‌స‌రానికి న‌గ‌దు ల‌భిస్తుంది. మెచ్యూరిటీ వ‌ర‌కు దానిపై వ‌డ్డీ పొంద‌వ‌చ్చు.

మార్కెట్ల‌కు సంబంధం లేకుండా క‌చ్చితమైన రాబ‌డి:
ఈక్విటీలు, ఇత‌ర పెట్టుబ‌డుల మాదిరి కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ల లాభాల‌కు, మార్కెట్ల‌కు సంబంధం ఉండ‌దు. చివ‌రి వ‌ర‌కు ఒకేర‌క‌మైన వ‌డ్డీ రేట్లు ఉంటాయి కాబ‌ట్టి క‌చ్చిత‌మైన రాబ‌డి ఉంటుంది. మీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎఫ్‌డీని ఎంచుకోవ‌చ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబ‌డులు సుల‌భం, సుర‌క్షితం:
ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు చాలా సుల‌భం. ఒక ద‌ర‌ఖాస్తును పూర్తి చేసి చెల్లింపు చేస్తే స‌రిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా కూడా సుల‌భంగా ఎఫ్‌డీ ప్రారంభించ‌వ‌చ్చు. ఒకేసారి వేర్వేరు ఎఫ్‌డీల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే మ‌ల్టీ డిపాజిట్‌ స‌దుపాయాన్ని ఎంచుకోవ‌చ్చు. అప్పుడు ఒకేసారి 5 ఆప్ష‌న్ల‌లో ఒకే చెక్కుతో వేర్వేరు కాల‌ప‌రిమితుల‌తో కూడా పెట్టుబడులు చేయ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని