ఈ బీమా మిమ్మ‌ల్ని ప్ర‌మాద వెత‌ల‌ నుంచి ర‌క్షించ‌గ‌ల‌దు

ప్ర‌మాదాల‌ వ‌ల్ల ఏర్ప‌డే ఇబ్బందుల‌కు ఆర్థిక స‌హ‌కారాన్నందించేదే ప్ర‌మాద బీమా

Published : 20 Dec 2020 15:16 IST

ప్ర‌మాదం అనేది ఎక్క‌డి నుంచి ఎలా జ‌రుగుతుందో చెప్ప‌లేం. కానీ ప్ర‌మాదం ఎంత బాధ‌క‌ర‌మైన‌దో చెప్ప‌గ‌లం. ఒక్కోసారి ప్రాణాల‌ను కోల్పోవాల్సి రావొచ్చు. ఆసుప‌త్రిపాలు చేయ‌గ‌ల‌దు. ప్ర‌మాదం వ్య‌క్తుల‌ను దివ్యాంగుల‌ను చేయ‌గ‌ల‌దు. ట‌ర్మ్ పాల‌సీ కుటుంబ స‌భ్యుల‌ను, పాల‌సీదారుపై ఆధార‌ప‌డిన వారి ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చ‌వ‌చ్చు గాక‌, ఆరోగ్య పాల‌సీ అనారోగ్య స‌మ‌యంలో ఆసుపత్రి బిల్లుల చెల్లింపులో తోడుండొచ్చు గాక‌! వ్య‌క్తిగ‌త ప్ర‌మాదానికి గురైతే మాత్రం ఆదాయాన్ని కోల్పోవాల్సి రావ‌చ్చు. అంగ‌వైక‌ల్యంతో ఎటు క‌ద‌ల‌లేని స్థితి ఏర్ప‌డినా ఏర్ప‌డ‌వ‌చ్చు. అందుకే ఇత‌ర పాల‌సీలున్నా వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా కూడా ఒక‌టి ఉండి తీరాల్సిందే.

ప‌రిహారం అంద‌జేత ఇలా…ప్ర‌మాదం వ‌ల్ల మృతి చెందితే పాల‌సీలో పేర్కొన్న బీమా హామీ సొమ్ము మొత్తాన్ని లంప్‌స‌మ్‌గా నామినీకి అంద‌జేస్తారు. ప్ర‌మాదం వ‌ల్ల శాశ్వ‌త వైక‌ల్యం ఏర్ప‌డితే సాధార‌ణంగా బీమా హామీ సొమ్ము మొత్తాన్ని బాధితుడికి అంద‌జేస్తారు. కొన్ని పాల‌సీలు స‌మ్ అస్యూర్డ్ కంటే ఎక్కువ సొమ్మునే ప‌రిహారంగా ఇస్తాయి. ఆ త‌ర్వాత పాల‌సీ ముగిసిపోతుంది. శాశ్వ‌త పాక్షిక వైక‌ల్యం ఏర్ప‌డితే ప్ర‌మాద తీవ్ర‌త‌ను బ‌ట్టి స‌మ్ అస్యూర్డ్‌లోంచి కొంత శాతాన్ని బాధితుడికి అంద‌జేస్తారు. తాత్కాలిక సంపూర్ణ వైక‌ల్యం ఏర్ప‌డిన సంద‌ర్భాల్లో ప్ర‌తి వారం కొంత మొత్తం ప‌రిహారం అందిస్తుంటారు. సాధార‌ణంగా స‌మ్ అస్యూర్డ్ నుంచి 1శాతం సొమ్మును ప్ర‌తి వారం ఇస్తారు. ఇలా 100 వారాలు ఇస్తారు లేదా బీమా సంస్థ‌ విధించుకున్న ప‌రిమితి మేర‌కు ఇస్తారు. కొన్ని బీమా సంస్థ‌లు మ‌రింత ఎక్కువ స‌మ్ అస్యూర్డ్‌ను అందిస్తాయి. పున‌రుద్ధ‌ర‌ణ వీటికే…సాధార‌ణంగా శాశ్వ‌త పాక్షిక వైక‌ల్యం, తాత్కాలిక సంపూర్ణ వైక‌ల్య ప‌రిస్థితులు ఏర్ప‌డి క్లెయిం చేసుకున్న‌ప్పుడు పాల‌సీని తిరిగి పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. ఆదాయానికి ర‌క్ష‌ణ -వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా ఒక ర‌కంగా ఆదాయానికి ర‌క్ష‌ణ‌గా నిలిచే ప‌థ‌కం లాంటిది. పాల‌సీ ఎంత‌కు తీసుకోవాల‌నేది మ‌న వార్షిక ఆదాయాన్ని బ‌ట్టి నిర్ణ‌యించుకోవాలి. సాధార‌ణంగా వార్షిక ఆదాయానికి 10రెట్లకు స‌మానంగా బీమా తీసుకోమ‌ని స‌ల‌హాదార్లు సూచిస్తుంటారు. వృత్తిని బ‌ట్టి ప్రీమియం - మీ ఆదాయం, మీరు చేసే వృత్తిని బ‌ట్టి వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా క‌వ‌రేజీని ఎంత గ‌రిష్టంగా ఉంచాలి, ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందో బీమా సంస్థ‌లు నిర్ణ‌యిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఓ విమాన‌ పైల‌ట్‌కు ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. అదే ఒక కార్పొరేట్ ఉద్యోగికి త‌క్కువ ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే పైల‌ట్ ప్ర‌మాదాల‌కు గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌. అద‌న‌పు ఫీచ‌ర్లతో…ఇది కాకుండా, వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీ మ‌రిన్ని అద‌న‌పు ఫీచ‌ర్ల‌తో రూపొందిస్తున్నారు. ఈ అద‌న‌పు ఫీచ‌ర్ల‌లో భాగంగా అంబులెన్స్ ఛార్జీల చెల్లింపులు, వాహ‌నానికి, ఇంటికి ప్ర‌మాదం వ‌ల్ల న‌ష్టం ఏర్ప‌డితే దానికి చెల్లింపులు, ఈఎమ్ఐల చెల్లింపులు, ఆదాయం కోల్పోవ‌య‌డం వ‌ల్ల పిల్ల‌ల చ‌దువుల ఖ‌ర్చు, కుటుంబ ర‌వాణా ఖ‌ర్చుల లాంటి ప‌రిహారాల‌ను బీమా సంస్థ‌లు కొత్త‌గా ప్ర‌వేశ‌పెడుతున్నాయి. ఇలాంటి అద‌న‌పు ఫీచ‌ర్ల వ‌ల్ల ప్రీమియం ధ‌ర కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే పాల‌సీ కొనేముందు పాల‌సీ బ్రోచ‌ర్‌ను క్షుణ్ణంగా చ‌ద‌వ‌డం మంచిది. పాలసీకి సంబంధించిన అన్ని వివ‌రాలు ఇందులో ఉంటాయి.

పాల‌సీ అంశాలివే…వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమాలో నాలుగు ప్ర‌ధాన అంశాల‌పై క‌వ‌రేజీ ఇస్తారు. అవి

ACCDNT-POLICY.jpg

అందుబాటు ధ‌ర‌లోనే…

ఓ ప్రాథ‌మిక వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీ చాలా అందుబాటు ధ‌ర‌లోనే ల‌భించ‌గ‌ల‌దు. రూ.10ల‌క్ష‌ల క‌వ‌రేజీ క‌లిగిన పాల‌సీ తీసుకోవాల‌నుకుంటే ప్రీమియం రూ.1500 నుంచి రూ.3వేల మ‌ధ్య‌లోనే ఉంటుంది. వృత్తిని బ‌ట్టి కూడా ప్రీమియం ధ‌ర నిర్ణ‌య‌మ‌వుతుంద‌న్న సంగ‌తిని గుర్తుంచుకోవాలి.

ఇత‌ర పాల‌సీల‌తో క‌లిపి…

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమాను ఒక్క‌రికి మాత్ర‌మే. దీన్ని ఇత‌ర పాల‌సీల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు. పాల‌సీ కొనుగోలు చేసే ముందు డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా చ‌దవ‌డం మేలు. పైన పేర్కొన్న‌ నాలుగు అంశాలు క‌వ‌ర్ అవుతున్నాయో లేదో చూసుకోవ‌డం మంచిది. అవి వ్య‌క్తి మృతి, శాశ్వ‌త వైక‌ల్యం, శాశ్వ‌త పాక్షిక వైక‌ల్యం, తాత్కాలిక సంపూర్ణ వైక‌ల్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని