ఎన్‌ఆర్‌ఐలు, విదేశీ పౌరుల నివాస స్థితిపై ఆర్థిక శాఖ స్పష్టత

కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో మన దేశంలో చిక్కుకున్న ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు- నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌), విదేశీ పౌరుల నివాస స్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. 2020

Published : 05 Feb 2021 00:31 IST

పన్ను చెల్లింపు విషయంలో వారిని భారతీయ నివాసితులుగా పరిగణించం

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో మన దేశంలో చిక్కుకున్న ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు- నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌), విదేశీ పౌరుల నివాస స్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ఏడాది మే నెలలోనే సర్క్యులర్‌ జారీ చేసి స్పష్టతనిచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇక్కడ చిక్కుకుపోయిన ఎన్‌ఆర్‌ఐలు, విదేశీ పౌరుల్ని పన్ను చెల్లింపు విషయంలో భారతీయ నివాసితులుగా పరిగణించబోమని, దీనిపై ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని తెలిపింది. ‘2019-20 ఆర్థిక సంవత్సరానికి వారి నివాస స్థితిపై సర్క్యులర్‌ ఇప్పటికే జారీ చేశాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కూడా భవిష్యత్‌లో జారీ చేస్తామ’ని ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి (పన్ను విధానం, చట్టం) కమలేశ్‌ గురువారం నిర్వహించిన పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) కార్యక్రమంలో వెల్లడించారు. 2021-22 బడ్జెట్‌ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలు, విదేశీ పౌరుల నివాస స్థితిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తుందని భావించగా, అప్పుడు ఏ నిర్ణయం వెలువడలేదు. దీంతో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 6 ప్రకారం, పన్ను చెల్లింపు విషయంలో వారిని భారతీయ పౌరులుగా గుర్తిస్తారని ఆందోళనకు గురవుతుండగా, తాజాగా ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. 2020 మార్చి 25 నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమానాలు రద్దు కావడంతో చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు, విదేశీ పౌరులు ఇక్కడే ఉండిపోయారు. తరవాత కొన్ని పరిమితుల మధ్య ద్వైపాక్షిక ఎయిర్‌ బబుల్‌ ఒప్పందాలతో కొన్ని విమాన సర్వీసులు ప్రారంభమైనా, పూర్తి స్థాయిలో ఇంకా కార్యకలాపాలు మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది తమ బసను ఇక్కడే పొడిగించాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని