సంక్షోభ స‌మ‌యంలో బంగారం పెట్టుబ‌డులు ఎందుకు?

ఆర్ధిక మాంద్యం వంటి సమయాల్లో నగదు లభ్యత, తొందరగా సొమ్ముచేసుకోగల వీలున్న బంగారాన్ని ఇష్టపడతారు....

Updated : 01 Jan 2021 18:12 IST

బంగారం ధరలు , స్టాక్ మార్కెట్లు వ్యతిరేక దిశలో పయనిస్తాయి. అనేక సందర్భాల్లో స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ,బంగారం ధరలు తగ్గడం, లేదా స్టాక్ మార్కెట్ పడుతున్నప్పుడు , మదుపరులు తమ పెట్టుబడుల రక్షణ కోసం బంగారం వైపు వెళ్తారు . అందువలన ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం సమయాల్లో బంగారం ధరలు పెరగడం జరుగుతుంటాయి .

జాతీయ , అంతర్జాతీయ ఆర్ధిక, ప్రాదేశిక సమస్యల సమయంలో మదుపరులు తమ సురక్షితమైన పెట్టుబడి కోసం బంగారం వైపు వెళతారు. ఎందుకంటే బంగారం ధరలలో కొద్దిగా హెచ్చుతగ్గులుండవచ్చు గానీ, అసలు విలువ లేని పెట్టుబడిగా మారదు .

2000 నాటి ఆర్ధిక మాంద్యం సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో బంగారం ధరలు పెరిగాయి . అలాగే న్యూ యార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి, మిడిల్ ఈస్ట్ దేశాలలో యుఎస్ సైనిక చర్యలు, లాంటి అనేక సందర్భాలలో స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు, బంగారం ధరలలో పెరుగుదల ఏర్పడింది .

ఆనాటి అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితుల కారణంగా , 2001 నాడు ట్రాయ్ ఔన్స్ (31.1 గ్రా ) ల బంగారం ధర యుఎస్ డాలర్ ($) 271.04 ఉంటే, 2002 నాటికి $309.73 గాను, 2003 నాటికి $363.38 గానే పెరిగింది. అదే 2006 నాటికి $600 గా పెరిగింది.

2008 లో లేహ్ మాన్ (Lehman) బ్రదర్స్ పతనం కారణంగా సంభవించిన ఆర్ధిక మాంద్యం వలన స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 50 శాతం వరకు కోల్పోయింది . ఇది బంగారం ధరల పెరుగుదలకు కారణమైంది . 2008 లో $ 700 ఉన్న ట్రాయ్ ఔన్స్ బంగారం , 2011 నాటికి $ 1,900 కు చేరింది . ఆ తరువాత స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం మొదలవగానే, బంగారం ధరలలో స్థిరత్వం ఏర్పడింది .

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలైన యుఎస్ - చైనా ల మధ్య 2018 లో నెలకొన్న వాణిజ్య యుద్ధం, ఒకరిపై ఒకరు విధించిన సుంకాల నేపథ్యంలో మళ్ళీ స్టాక్ మార్కెట్లు అనిశ్చితిని ఎదుర్కొన్నాయి. దీంతో బంగారం ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. 2017 లో ట్రాయ్ ఔన్స్ $ 1,257.12 గా ఉన్న బంగారం 2019 నాటికి $ 1,392.6 గా పెరిగింది .

పెట్టుబడుల కోసం అనేక పథ‌కాలు ఉన్నప్పటికీ , ఆర్ధిక మాంద్యం వంటి సమయాల్లో నగదు లభ్యత, తొందరగా సొమ్ముచేసుకోగల వీలున్న బంగారాన్ని ఇష్టపడతారు.

అదే రియల్ ఎస్టేట్ అయితే, కొనుగోలుదారులు దొరకక పోవచ్చు, లేదా తగిన ధర రాకపోవచ్చు. అదే డెట్ పెట్టుబడులయితే లాక్-ఇన్ పీరియడ్ వల్ల నగదు పొందలేకపోవచ్చు. పెట్టుబడులలో వైవిధ్యం కోసం బంగారంలో కూడా మదుపుచేయొచ్చు. అత్యవసర సమయాల్లో నగదుగా మార్చుకొవాలంటే బంగారం ఉపయోగిస్తుంది . అయితే మీ మొత్తం పోర్ట్ ఫోలియో లో 10-15 శాతం కన్నా మించకుండా ఉండేటట్లు చూసుకొవాలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని