Gold Price: వచ్చే ఏడాది బంగారం భగభగే.. ధర రూ.55వేల పైనే..!

కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో గతేడాది అమాంతం పెరిగిన బంగారం ధర.. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో కాస్త దిగొచ్చింది. ఇటీవల కాలంలో 10 గ్రాముల పసిడి

Updated : 30 Dec 2021 17:14 IST

ముంబయి: కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో గతేడాది అమాంతం పెరిగిన బంగారం ధర.. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో కాస్త దిగొచ్చింది. ఇటీవల కాలంలో 10 గ్రాముల పసిడి ధర రూ.50వేల లోపే పలుకుతోంది. అయితే, కొత్త ఏడాదిలో బంగారం పెరుగుదల తప్పేలా కన్పించట్లేదు. 2022లో పుత్తడి ధర మళ్లీ పెరిగే అవకాశముందని, 10 గ్రాముల ధర రూ.55 వేల పైకి చేరవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణ భయాలు, ఒమిక్రాన్‌పై నెలకొన్న అనిశ్చితే దీనికి కారణమంటున్నారు.

గతేడాది బంగారం ధరకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. 2020 ఆగస్టులో కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఈ లోహం ధర రికార్డు స్థాయిలో రూ.56,200 పలికింది. మహమ్మారి భయాలతో ఈక్విటీ మార్కెట్లు కుదేలై.. పసిడిలో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా గతేడాది పుత్తడి ధర అమాంతం పెరిగింది. అయితే 2021లో వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ఈక్విటీల్లో మళ్లీ పెట్టుబడులు పెరిగాయి. దీంతో గత కొన్ని నెలలుగా పసిడి ధర రూ.48వేలకు అటూఇటుగానే ఉంటోంది. అయితే, వచ్చే ఏడాది మాత్రం దీని ధర మళ్లీ పెరిగే అవకాశముందని కామ్‌ట్రెండ్జ్‌ సీఈవో జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

‘‘ప్రస్తుతం అమెరికా, ఐరోపా దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ ఉద్ధృతి నెలకొంటున్న వేళ క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లపై మళ్లీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో డాలర్‌ విలువ మరింత పెరుగుతుంది. ఇక దీనికి తోడు దేశీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలు కూడా పసిడి ధరలపై ప్రభావం చూపిస్తాయి. ఇక ఎక్కడైనా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు నెలకొంటే అవి కూడా పసిడిపై సెంటిమెంట్‌ను పెంచే అవకాశాలున్నాయి. 2022 తొలి అర్ధభాగంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1700-1900డాలర్ల మధ్య కదలాడొచ్చు. ఇక రెండో అర్ధభాగంలో ఏకంగా 2000 డాలర్ల వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నాం. అదే విధంగా, వచ్చే ఏడాది చివరి నాటికి దేశీయ మార్కెట్లోనూ 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,000 దాటే అవకాశముంది’’ అని త్యాగరాజన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని