ఈ సారికి పాత శాలరీనే!

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక స్మృతుల (లేబర్‌ కోడ్స్‌) అమలు వాయిదా పడింది. కొన్ని రాష్ట్రాలు లేబర్‌ కోడ్స్‌కు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయకపోవడమే దీనికి కారణం. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి..

Published : 31 Mar 2021 17:32 IST

దిల్లీ: కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక స్మృతుల (లేబర్‌ కోడ్స్‌) అమలు వాయిదా పడింది. కొన్ని రాష్ట్రాలు లేబర్‌ కోడ్స్‌కు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయకపోవడమే దీనికి కారణం. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి శాలరీ విధానంలో మార్పులు జరగాల్సి ఉండగా.. ప్రస్తుతానికి ఎలాంటి మార్పులూ ఉండబోవు. 

కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్‌ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించిన స్మృతులను కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి నాలుగు కోడ్‌లను అమల్లోకి తీసుకురావాలని కార్మిక శాఖ నిర్ణయించింది. రాజ్యాంగం ప్రకారం కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. దీంతో అటు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ముసాయిదా నిబంధనలు రూపొందించినప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు ఇంకా ఖరారు చేయకపోవడంతో ప్రస్తుతానికి లేబర్‌ కోడ్‌ అమలును వాయిదా వేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

లేబర్‌ కోడ్‌ల వల్ల శాలరీ విధానంలో పలు మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చేవి. కొత్త నిబంధనల ప్రకారం అలవెన్సుల వాటా 50 శాతం మించకూడదు. ఆ లెక్కన బేసిక్‌ పెరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బేసిక్‌+ డీఏ ఆధారంగా లెక్కించే పీఎఫ్‌ వాటా సైతం పెరుగుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త లేబర్‌ కోడ్స్‌ అమల్లోకి వచ్చి ఉంటే.. ఆ మేర టేక్‌ హోమ్‌ శాలరీ, పీఎఫ్‌ మొత్తంలో మార్పులు జరిగేవి. లేబర్‌ కోడ్‌ల అమలు వాయిదా పడిన నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు పాత విధానంలోనే శాలరీని అందుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని