EV scooter: ఒకసారి ఛార్జ్‌ చేస్తే 125కి.మీ. వెళ్లొచ్చు!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ సంస్థ హాప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మంగళవారం విపణిలోకి రెండు కొత్త ఇ-స్కూటర్‌లను తీసుకొచ్చింది.

Published : 15 Jun 2021 17:38 IST

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ సంస్థ హాప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మంగళవారం విపణిలోకి రెండు కొత్త ఇ-స్కూటర్‌లను తీసుకొచ్చింది. మొత్తం ఐదు వాహనాలను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, ఇందులో ఒక ఇ-బైక్‌ కూడా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన వాటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అంతేకాదు, వివిధ నగరాలు, పట్టణాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని హాప్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా జైపూర్‌లో ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. త్వరలోనే మిగిలిన ప్రాంతాల్లోనూ వీటిని సిద్ధం చేయనుంది.

లియో, ఎల్‌వైఎఫ్‌ పేరుతో తీసుకొచ్చిన ఇ-స్కూటర్‌లు ఒకసారి ఛార్జ్‌ చేస్తే 125 కి.మీ. ప్రయాణించవచ్చు. వీటి ధరలు వరుసగా రూ.72,000... రూ.65,000గా నిర్ణయించారు. ఇంటర్నెట్‌, జీపీఎస్‌, మొబైల్‌ యాప్‌తో పాటు, 72వాట్ల అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే మోటార్‌ను వీటిలో అమర్చారు. 180 కేజీల వరకూ ఇవి బరువును మోయగలవు. ఇక త్వరలో విడుదల చేయబోయే ఇ-బైక్‌ OXO100ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 100 కి.మీ. వరకూ ప్రయాణించవచ్చు. ఈ సందర్భంగా హాప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వ్యవస్థాపకుడు కేతన్‌ మెహతా మాట్లాడుతూ.. ‘‘మిలినియల్స్‌, జనరేషన్‌- జెడ్‌ స్థిరమైన , సౌకర్యవంతమైన ప్రయాణాలను కోరుకుంటున్నారు. మేము విడుదల చేసిన ఉత్పత్తులు దేశంలోని ఇ-మొబిలిటీ ఖాళీని భర్తీ చేయగలవు. రెండు మోడళ్లు, ప్రీమియం ఫీచర్లతో పాటు, చక్కటి బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి’’ అని వివరించారు.

కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేయడమే కాకుండా ఛార్జింగ్‌ స్టేషన్‌లనూ హాప్‌ ఎలక్ట్రిక్‌ సిద్ధం చేయనుంది. స్వాపబుల్‌ బ్యాటరీల ద్వారా వాహనదారులు కేవలం 30 సెకన్లలో తమ బ్యాటరీని ఇక్కడ మార్చుకోవచ్చు. లియో బేసిక్‌, లియో, లియో ఎక్స్‌టెండ్‌ ఇ-స్కూటర్లు గంటకు 60కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. ఇందులో 2x లిఅయాన్‌ బ్యాటరీ అమర్చారు. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 125 కి.మీ. వెళ్లవచ్చని కంపెనీ చెబుతోంది. అదే విధంగా ఎల్‌వైఎఫ్‌ మోడల్‌ విషయానికొస్తే గంటకు 50కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బైక్‌ల్లో రివర్స్‌ గేర్‌ కూడా అమర్చారు. ఇక పార్క్‌ అసిస్టెంట్‌, సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌, మూడు రైడింగ్‌ మోడల్‌లు, డ్యుయల్‌ డిస్క్‌ బ్రేక్స్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌, రీమోట్‌ కీ, యాంటీ థెఫ్ట్‌ అలారమ్‌ ఇతర ఫీచర్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని