ఆరోగ్య బీమా.. వెయిటింగ్ పీరియ‌డ్ మ‌రిన్ని వివ‌రాలు

రెండు పాల‌సీల‌ను క‌లిగి ఉంటే ఒక పాల‌సీ నిలిపివేసినా, మ‌రో పాల‌సీకి వెయిటింగ్ పీరియ‌డ్ ప్ర‌యోజ‌నం ఉంటుంది

Published : 27 Dec 2020 20:09 IST

అనారోగ్యం, అల‌వాట్లు :
ఒకసారి ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న తరువాత , మీ ఆరోగ్యం లో గానీ, అలవాట్లలో గానీ మార్పులు వచ్చినట్లైతే, వాటిని బీమా సంస్థకు తెలియచేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్లెయిమ్ చేసినట్లయితే, మరుసటి పునరుద్ధరణ సమయంలో ప్రీమియం పెంచే అవకాశం ఉంటుంది.

ప్రీమియం పెరిగేందుకు మరొక కారణం పెరిగిన వయసు వల్ల త‌క్కువ‌ శ్లాబ్‌ నుంచి ఎక్కువ శ్లాబ్‌ కు చేరటం. ఉదా : 31-35 ఏళ్ల వయసు లో పాలసీ ప్రీమియం కంటే, 36-40 ఏళ్ల వయసులో ప్రీమియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఒక వ్యక్తి 35 ఏళ్ళు దాటి 36 ఏళ్ల వయసు లోకి ప్రవేశిస్తే , వయసుకు తగిన ప్రీమియం విధిస్తారు.

వెయిటింగ్ పీరియ‌డ్ :
ఆరోగ్య బీమాలో మరో ముఖ్య విషయం పోర్టబిలిటీ. అంటే ఒకే బీమా సంస్థలో ఒక పాలసీ నుంచి మరొక పాలసీలోకి మారటం. లేదా ఒక బీమా కంపెనీ పాలసీ నుంచి మరొక బీమా కంపెనీ పాలసీ కి మారటం.
దీనివల్ల మొదటి పాలసీ తీసుకున్న నాటి నుంచి సాధారణంగా 2-4 సంవత్సరాలు ఉండే వెయిటింగ్ పీరియడ్, కలుపుకునే సౌకర్యాన్ని పొందవచ్చు.

ఉదా : చంద్రం ఒక ఆరోగ్య బీమా పాలసీ ఆగష్టు, 2017 లో తీసుకున్నాడు. దీని ప్రకారం పాలసీ తీసుకునే నాటికి ఉన్న రోగాలను , పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తరువాత మాత్రమే చికిత్స పొందే వీలుంది. ఇప్పటి వరకు రెండు సంవత్సరాలే పూర్తయింది. ఇప్పుడు అతను మరొక పాలసీ లోకి మారటం వలన, ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు, కావున మరో రెండు సంవత్సరాల తరువాత వెయిటింగ్ పీరియడ్ పూర్తవుతుంది. అయితే, ఇవి అన్ని పాలసీ లకు , అన్ని కంపెనీలు ఇస్తాయన్న పూర్తి భరోసా లేదు. షరతులకు లోబడి మాత్రమే అంగీకరించే అవకాశం ఉంటుంది.

పాల‌సీ నిలిపివేత‌:
సాధారణంగా ఒకరు ఒక బీమా కంపెనీ నుంచి ఒక పాలసీనే కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో కొందరు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల నుంచి ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటారు. దీనికి ఒక కారణం , ఏదేని సందర్భంలో ఒక కంపెనీ సేవలు సరిగా లేక పొతే , ఆ పాలసీ నుంచి వైదొలగాల‌నుకున్న‌ప్పుడు , వెయిటింగ్ పీరియడ్ నష్టపోకుండా , మరొక పాలసీ ని చేతిలో కలిగి ఉండడం . దీనివలన అధిక ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు.

ఉదా : 30 ఏళ్ల వ్యక్తి రూ 5 లక్షల బీమా హామీ తో వ్యక్తిగత పాలసీ తీసుకున్నట్లైతే , దాని ప్రీమియం సుమారుగా రూ 8 వేలు ఉంటుంది. మరో కంపెనీ నుంచి అదే మొత్తానికి వేరొక పాలసీ తీసుకున్నట్లైతే , దానికి కూడా రూ 8 వేలు ప్రీమియం చెల్లించాల్సిరావచ్చు. కాబట్టి మొత్తం ప్రీమియం సుమారుగా రూ 16 వేలు అవుతుంది. అదే ఒకే కంపెనీలో బీమా హామీ మొత్తం రూ 10 లక్షలకు తీసుకుంటే దాని ప్రీమియం సుమారుగా రూ. 11 వేల వరకు మాత్రమే ఉంటుంది

వేర్వేరు పాల‌సీలు… క్లెయిమ్ :
కొన్ని సందర్భాలలో కొందరికి వివిధ రకాలైన ఆరోగ్య బీమా పాలసీలు ఉండవచ్చు. ఉదా: రత్నం చేసే కంపెనీ ద్వారా అతనికి బృంద ఆరోగ్య బీమా పాలసీ పొందాడు. అలాగే అతను కుటుంబం మొత్తానికి కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ బీమా తీసుకున్నాడు. అలాగే దానికి తగిన సూపర్ టాప్-అప్ పాలసీ తీసుకున్నాడు. ఒకవేళ క్లెయిమ్ చేయాల్సి వస్తే ముందుగా తన బృంద ఆరోగ్య బీమా పాలసీ ని ఉపయోగించడం మంచిది. ఒకవేళ అదే సంవత్సరం మరొకసారి అనారోగ్యం తో ఆసుపత్రి పాలై, బృంద పాల‌సీ హామీ మొత్తం పూర్తయి, ఇక క్లెయిమ్ చేసుకునే అవకాశం లేనప్పుడు , ఫ్యామిలీ ఫ్లోటర్ బీమా ద్వారా క్లెయిమ్ పొందవచ్చు. ఆ తరువాత సూపర్ టాప్-అప్ ను వినియోగించుకోవచ్చు.

ఆరోగ్య బీమా గురించి మ‌రిన్న వివ‌రాలను తెలుసుకునేందుకు ఈ క‌థ‌నాల‌ను చ‌ద‌వండి

ఆరోగ్య బీమా పాల‌సీ గురించి ఈ విషయాలు తెలుసా?
ఆరోగ్య బీమా పాల‌సీల గురించి ఈ విష‌యాలు తెలుసా ? -2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని