Retirement Fund: ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి ఎంత అవ‌స‌రం?

మీరు యువకుడిగా ఉన్నప్పుడు రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తే నెలవారీగా పొదుపు తక్కువ మొత్తమే అవసరం అవుతుంది.

Updated : 08 Dec 2021 17:16 IST

ఇంటర్నెట్ డెస్క్: రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవితం గడపడానికి తగినంత నగదు అవసరం. ఇందుకోసం కావలసిన కార్పస్‌ను సృష్టించడం కోసం డబ్బు ఆదా చేయడానికి సరైన మొత్తాన్ని ఎంచుకోవడం ముఖ్యం. హాయిగా పదవీ విరమణ చేయడానికి తగినంత పెద్ద కార్పస్‌ను ఏర్పరచుకోవడానికి ప్రతి నెలా మీరు ఎంత ఆదా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు యువకుడిగా ఉన్నప్పుడు రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తే నెలవారీ పొదుపు తక్కువ మొత్తమే అవసరం అవుతుంది. కానీ మీ రిటైర్మెంట్‌కి రూ.2 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే వార్షిక ద్రవ్యోల్బణం 5% అనుకుంటే అది 20 సంవత్సరాల తర్వాత రూ.38 లక్షలు (ఇప్పటి విలువ పరంగా), 25 సంవత్సరాల తర్వాత రూ.30 లక్షలుగా మాత్రమే అని గమనించాలి. అందుచేత ఈ మొత్తం సరిపోకపోవచ్చు.

అయితే, పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఇత‌ర ముఖ్య‌మైన సాధ‌నాల్లో ఈక్విటీలు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుత స‌మ‌యంలో మ్యూచువ‌ల్ ఫండ్స్ అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన పొదుపుగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఇవి ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి అధిక రాబ‌డిని అందిస్తున్నాయ‌ని నిపుణుల అభిప్రాయం. రూ.3 కోట్లు, రూ.5 కోట్లు సృష్టించ‌డం కోసం స‌రైన మొత్తాన్ని చేరుకోవ‌డానికి మీకు స‌హాయ‌ప‌డే అనేక ‘క‌రోడ్‌పతి కాలిక్యులేట‌ర్లు’ ఉన్నాయి. 20, 25, 30 సంవ‌త్స‌రాల త‌ర్వాత సంవ‌త్స‌రానికి 12% వృద్ధి రేటు వ‌ద్ద రూ.2.50 కోట్లు పొంద‌డానికి ఎంత ఆదా చేయాలో ఈ దిగువన చూడొచ్చు.

* 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత రూ.2.50 కోట్లు పొందాలంటే.. నెల‌వారీ పొదుపు అవ‌స‌రం రూ.25,000

* 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత రూ.2.50 కోట్లు పొందాలంటే.. నెల‌వారీ పొదుపు అవ‌స‌రం రూ.13,250.

* 30 సంవ‌త్స‌రాల త‌ర్వాత రూ.2.50 కోట్లు పొందాలంటే.. నెల‌వారీ పొదుపు అవ‌స‌రం రూ.7,125.

రూ.25,000, రూ.13,250, రూ.7,125 నెల‌వారీ ఆదా చేయ‌డం ద్వారా, ఒక‌రు 20, 25, 30 సంవ‌త్స‌రాల్లో దాదాపు రూ. 2.50 కోట్లు సృష్టించ‌వ‌చ్చు. అయితే, సగటు వార్షిక రాబడి 12 శాతంగా ఉంటుందని భావించండి. నేటికి రాబడి చూసినట్టైతే చాలా ఇండెక్స్ ఫండ్లు 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 14% రాబడిని ఇచ్చాయి. అయితే, పైన తెలిపినట్టుగా ద్రవ్యోల్బణం కారణంగా దీర్ఘకాలంలో రూ.2.50 కోట్లు  మీకు సరిపోకపోవచ్చు. కాబట్టి, మీరు మీ వీలు ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని పెంచుతూ వెళ్లడం ముఖ్యం.

ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల్లో సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌)ను ప్రారంభించి క్ర‌మం త‌ప్ప‌కుండా పొదుపు చేయొచ్చు. స్టాక్ మార్కెట్ భారీ తేడాతో ప‌డిపోయిన‌పుడు, అదే మ్యూచువ‌ల్ ఫండ్ ఫోలియోలో మ‌రిన్ని పెట్టుబ‌డులు పెట్టొచ్చు. దీంతో మీరు మరిన్ని యూనిట్స్ కొనుగోలు చేయొచ్చు. మార్కెట్ ప‌రిస్థితుల ఆధారంగా అవ‌స‌ర‌మైతే సిప్‌, ఏక‌మొత్తంగా పెట్టుబ‌డిని ఉప‌యోగించండి. మీ ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు 3 సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న‌ప్పుడు ఈక్విటీ ఫండ్‌ల నుంచి పెట్టుబడి మెల్లగా వెనక్కి తీసుకోవడం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని