ఆన్‌లైన్ మోసాలు ఇలా చేస్తారు.. జాగ్ర‌త్త‌!

రోజురోజుకు ఇంట‌ర్నెట్ వినియోగం పెరిగిపోతుంది. ఒక‌ప్పుడు ఇంట్లో ఒక కంప్యూట‌ర్ ఉండేది. దానికే ఇంట‌ర్నెట్ అనుసంధాన‌మై ఉండేది. ఇప్పుడు కుటుంబంలో దాదాపు ప్ర‌తి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌. దాంతో పాటే వైఫైతో ఇంట‌ర్నెట్‌కు అనుసంధానం. ఇలా గ్యాడ్జెట్లు పెర‌గ‌డంతో పాటే మోసాలు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఆర్థికంగా వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు తీర‌ని లోటుగా ప‌రిణ‌మిస్తోంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎక్కువ‌గా స‌మాచార చౌర్యం అవుతుంది...

Published : 16 Dec 2020 14:39 IST

రోజురోజుకు ఇంట‌ర్నెట్ వినియోగం పెరిగిపోతుంది. ఒక‌ప్పుడు ఇంట్లో ఒక కంప్యూట‌ర్ ఉండేది. దానికే ఇంట‌ర్నెట్ అనుసంధాన‌మై ఉండేది. ఇప్పుడు కుటుంబంలో దాదాపు ప్ర‌తి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌. దాంతో పాటే వైఫైతో ఇంట‌ర్నెట్‌కు అనుసంధానం. ఇలా గ్యాడ్జెట్లు పెర‌గ‌డంతో పాటే మోసాలు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఆర్థికంగా వ్య‌క్తుల‌కు, సంస్థ‌ల‌కు తీర‌ని లోటుగా ప‌రిణ‌మిస్తోంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎక్కువ‌గా స‌మాచార చౌర్యం అవుతుంది.

ప్రాథ‌మిక స‌మాచార చౌర్యం:

ప్రాథ‌మిక వ్య‌క్తిగ‌త స‌మాచార చౌర్యం వ‌ల్ల పెద్ద‌గా న‌ష్టం లేక‌పోయినా… మోసాల‌కు ఇదే తొలి అడుగుగా మారుతోంది. ఇదే ప్రాథ‌మిక స‌మాచారాన్ని దొంగిలించి బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బును మాయం చేస్తున్నారు మాయ‌గాళ్లు.

హ్యాక్ చేయ‌డం క‌ష్టం:

నిజానికి వేరే ఏదైనా ప్ర‌దేశంలో ఉండి బ్యాంకు ఖాతాను హ్యాక్‌చేసి అందులోంచి సొమ్ము తీయ‌డం చాలా క‌ష్టం. మ‌ధ్య‌లో మ‌న ప్ర‌మేయం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ప్ర‌తి బ్యాంకు లావాదేవీకి ఓటీపీ వ‌స్తూనే ఉంటుంది. అయినా కూడా ఆన్‌లైన్ మోసాలు జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌రి ఈ మోసాలు ఎలా చేస్తారో అవ‌గాహ‌న ఉంటే వాటి బారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డం సులువు క‌దా!

సిమ్ కార్డు క్లోనింగ్‌:

చాలా మ‌టుకు ఆర్థిక, ఆర్థికేత‌ర లావాదేవీల‌కు ఓటీపీ వ‌స్తుంది. ఇది రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌రుకు వ‌స్తుంది. మ‌న గుర్తింపు ప‌త్రాల‌ను, పాన్ కార్డు న‌క‌లును అవ‌స‌ర‌మైన అనేక చోట్ల ఇస్తుంటాం. ఇవి కొంద‌రు దుర్మార్గుల చేతిలో పడితే వాళ్లు ఇక దాన్ని అనేక ర‌కాలుగా ఉప‌యోగిస్తారు. ఇవే డాక్యుమెంట్లు ఉప‌యోగించి కొత్త‌గా సిమ్ కార్డును కొనుగోలు చేస్తారు. మీ టెలికాం సంస్థ వ‌ద్ద మిమ్మ‌ల్ని సంప్ర‌దించేందుకు ఇత‌ర నెంబ‌రు ఉన్న‌ట్ల‌యితే మీరు కొత్త‌గా సిమ్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్టు స‌మాచార‌మందిస్తారు. ఒక‌వేళ అలా చేసి ఉండ‌క‌పోతే అస‌లు మీ పేరిట మ‌రో నెంబ‌రు తీసుకున్న విష‌యం కూడా తెలీకుండా పోతుంది.

నెట్‌వ‌ర్క్‌లో లోపంగా భావిస్తే:

కొత్త సిమ్ కార్డు యాక్టివేట్ అయిన వెంట‌నే అంత‌వ‌ర‌కు మ‌నం ఉప‌యోగిస్తున్న నెంబ‌రు డిస్ క‌నెక్ట్ అవుతుంది. అయితే చాలా మంది దీన్ని గుర్తించ‌రు. నెట్‌వ‌ర్క్ లోపం వ‌ల్ల సిగ్న‌ళ్లు స‌రిగ్గా అంద‌డంలేదని భావిస్తుంటారు. ఈ లోప‌లే జ‌ర‌గాల్సిన ఘోరం జ‌రిగిపోతుంటుంది. అయితే ఈ మ‌ధ్యే రిల‌య‌న్స్ జియో ప్ర‌వేశంతో ఆధార్ ద్వారా గుర్తింపును తీసుకోవ‌డం వ‌ల్ల న‌కిలీ సిమ్ కార్డుల సృష్టి క‌ష్ట‌మైపోయింది.

సామాజిక ఇంజ‌నీరింగ్‌:

మోసాల దృకోణంలో సామాజిక ఇంజ‌నీరింగ్ అంటే సామాజిక అనుసంధాన వేదిక‌ల ద్వారా ఎవ‌రి వ‌ద్ద నుంచైనా వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని దొంగ‌త‌నం చేయ‌డం. మోస‌గాళ్లు సాధార‌ణంగా వెయ్యి మందిని టార్గెట్ చేస్తే ఏ ఇద్ద‌రో, ముగ్గురో వీరి వ‌ల‌లో ప‌డ‌తారు. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల ద్వారా పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నెంబ‌రు, ఇ-మెయిల్ ఐడీ క‌నుక్కోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

సెక్యూరిటీ క్వ‌శ్చ‌న్‌తో తంటా:

మ‌రి కొంత మంది మోస‌గాళ్లు మ‌రింత ముందుకెళ్లి… ఇ-మెయిల్ హ్యాక్ చేసేందుకు సెక్యూరిటీ క్వ‌శ్చ‌న్ల‌పై ప్ర‌యోగాలు చేస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు సెక్యూరిటీ క్వ‌శ్చ‌న్‌గా మీ ఇంటి పేరు ఏమిటి, లేదా మీరు చ‌దివిన పాఠ‌శాల పేరు చెప్పండి లాంటివి ఉంటాయి. ఇవ‌న్నీ ఎవ‌రి ఫేస్‌బుక్ లేదా ట్విట‌ర్ అకౌంట్‌ను కాస్త శోధిస్తే తెలిసిపోతుంది. ఇలా మెయిల్‌ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల వివ‌రాలు కూడా తెలుసుకునే ప్ర‌మాద‌ముంది.

మాల్వేర్‌:

మ‌నం వాడే డివైజ్‌లో కొన్ని ప్రోగ్రాములు అనుకోకుండా వ‌చ్చి దాగి ఉంటాయి. ఉచితంగా పాట‌లు, వీడియోలు, సినిమాలు ఇంట‌ర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న‌ప్పుడు మ‌న డివైజ్‌లోకి వ‌చ్చి చేరుతుంటాయి. త‌ర్వాత మ‌న‌మేదైనా బ్యాంకు స‌మాచారాన్ని కొడితే వాటిని త‌స్క‌రించేలా ప్రోగ్రామ్ అయి ఉంటుంది.

ప్ర‌ధానంగా ఇవి కొన్ని ర‌కాల కీవ‌ర్డ్‌ల‌ను గుర్తించేలా రూపొందిస్తారు. పాస్‌వ‌ర్డ్‌, బ్యాంకింగ్‌, ట్రాన్సాక్ష‌న్ లాంటివి ఉంటే ఇవి వెంట‌నే గుర్తుప‌ట్టి మోసగాళ్ల‌కు చేర‌వేసేలా డిజైన్ చేస్తారు. కాబ‌ట్టి వీటి బారి నుంచి ర‌క్షించుకునేందుకు మంచి యాంటీ వైర‌స్ ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

ర్యాన్స‌మ్‌వేర్:

మాల్వేర్‌లోనే అడ్వాన్స్‌డ్ వెర్ష‌న్ ర్యాన్స‌మ్‌వేర్‌. ర్యాన్స‌మ్‌వేర్ స‌మాచారాన్ని చౌర్యం చేయ‌దు. డేటాను ఎన్‌క్రిప్ట్ చేసేస్తుంది. దీని వ‌ల్ల డేటాను యాక్సెస్ చేయ‌డం క‌ష్ట‌మైపోతుంది. ఒక‌వేళ యాక్సెస్ కావాల‌నుకుంటే ర్యాన్స‌మ్‌గా కొంత సొమ్ము పంపాల్సిందిగా మోస‌గాళ్లు డిమాండ్ చేస్తారు. కొంతే క‌దాని వాళ్ల‌కు న‌గ‌దు బ‌దిలీ చేశామో ఇక అంతే సంగ‌తులు, మొత్తం బ్యాంకు ఖాతా ఖాళీ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ర్యాన్స‌మ్‌వేర్ నుంచి ర‌క్షించుకునేందుకు బ్యాక్ అప్ డేటా ఎక్స్‌ట‌ర్న‌ల్ డివైజ్‌లో ఉంచుకోవ‌డం మంచిది. ఇది ఇంట‌ర్నెట్‌తో అనుసంధానం కాకుండా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని