ఆల‌స్య చెల్లింపుల‌తో నాలుగు ర‌కాలుగా న‌ష్టపోతారు

క్రమంగా క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయ‌క‌పోతే ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు

Published : 05 Feb 2021 16:23 IST

మీ క్రెడిట్ తిరిగి చెల్లించే చరిత్ర ఆధారంగా మీ క్రెడిట్ స్కోరు లెక్కిస్తారు కాబ‌ట్టి మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సక్రమంగా తిరిగి చెల్లించక‌పోతే  క్రెడిట్ స్కోర్ త‌గ్గుతుంది. క్రెడిట్ స్కోరు త‌క్కువ‌గా ఉంటే  భవిష్యత్తులో మీకు రుణం ల‌భించ‌క‌పోవ‌చ్చు, ఆర్థిక స్థితిపై కూడా ప్ర‌భావం చూపుతుంది. 

క్రమంగా క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయ‌క‌పోతే ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు:
ఆలస్య చెల్లింపు రుసుము, ఛార్జీలు:
క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు, మీరు కనీస మొత్తాన్ని నిర్ణీత తేదీకి తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు ఆలస్యంగా చెల్లింపు రుసుము వ‌ర్తిస్తుంది. క‌నీస బిల్లు సాధారణంగా బిల్లు మొత్తంలో 5 శాతంం ఉంటుంది. దీనికి అదనంగా, మీ క్రెడిట్ కార్డులో ఉన్న ఏదైనా ఈఎంఐతో పాటు  వర్తించే ఛార్జీలు కూడా చెల్లించాల్సిన కనీస మొత్తానికి క‌లిపి లెక్కిస్తారు. కనీస మొత్తాన్ని చెల్లించకపోతే ఆలస్య రుసుము రూ. 1,300 వరకు ఉంటుంది.

అలాగే, మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లు బకాయిల కంటే తక్కువ చెల్లించడం వలన చెల్లించని బిల్లు మొత్తంలో 23 శాతం -49 శాతం వరకు భారీ ఛార్జీలు వ‌ర్తించవ‌చ్చ‌ని గుర్తుంచుకోండి. కనీస మొత్తాన్ని సకాలంలో చెల్లించడం వలన ఆలస్య చెల్లింపు రుసుము ఉండ‌దు కానీ  చెల్లించాల్సిన మొత్తంపై ఇప్పటికీ వర్తించే ఛార్జీలు వసూలు చేస్తారు.

క్రెడిట్ స్కోర్‌:
రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు బ్యాంకులు మొద‌ట ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అంశం మీ క్రెడిట్ స్కోర్.  మీరు రుణం తిరిగి చెల్లించే చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోరు ఉంటుంది. , క్రెడిట్ కార్డ్ బిల్లును సక్రమంగా తిరిగి చెల్లించ‌క‌పోవ‌డం క్రెడిట్ స్కోర్‌ను తగ్గించగలదు. తగ్గిన క్రెడిట్ స్కోరు మీ భవిష్యత్ రుణం, క్రెడిట్ కార్డ్ అర్హతను కూడా దెబ్బతీస్తుంది.
రుణాలు స‌మ‌యానికి తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నాయని రుణదాతలు గ్ర‌హించి మీకు రుణం జారీచేయ‌డం అధిక-రిస్క్‌గా భావిస్తారు. ఒక్క ఆలస్య చెల్లింపు కూడా  మీ స్టేట్‌మెంట్‌లో ఏడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు  క‌నిపిస్తుంది. ఇది మీ క్రెడిట్ విలువను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో మీకు రుణం జారీ చేయాలా లేదా అని బ్యాంకులు నిర్ణయించే అత్యంత కీలకమైన అంశాల్లో చెల్లింపు చరిత్ర ఒకటి. 

 గ్రేస్ పీరియడ్ :
 మీ క్రెడిట్ కార్డ్ లావాదేవీ చేసిన తేదీ నుంచి చెల్లింపు గడువు తేదీ వ్యవధి వ‌ర‌కు వ‌డ్డీ వ‌ర్తించ‌దు. ఇది సాధారణంగా 18- 55 రోజుల మధ్య ఉంటుంది. ఈ స‌మ‌యంలో జరిపిన క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వ‌డ్డీ ఉండదు.  బకాయిలు నిర్ణీత తేదీ నాటికి తిరిగి చెల్లిస్తే ఈ స‌దుపాయం ఉంటుంది.
 మీ మొత్తం క్రెడిట్ కార్డ్ బకాయిలను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, కార్డ్ జారీచేసేవారు మీ వడ్డీ లేని కాలాన్ని ఉపసంహరించుకుంటారు, మొత్తం బకాయిలు తిరిగి చెల్లించే వరకు తాజా క్రెడిట్ లావాదేవీలపై ఫైనాన్స్ ఛార్జీలను విధిస్తారు. అందువల్ల, తదుపరి బిల్లింగ్ చక్రంలో మీ తాజా లావాదేవీలపై వర్తించే ఫైనాన్స్ ఛార్జీలను కూడా వ‌సూలుచేస్తారు.

‌ ఆఫ‌ర్లు ల‌భించ‌వు:
మీ క్రెడిట్ స్కోరు, క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా రుణదాతలు మీకు ముందుగా ఆమోదించిన‌ రుణాలు, క్రెడిట్ కార్డుల ఆఫర్ల‌ను అందిస్తారు. క్రెడిట్‌ చరిత్ర బాగా లేక‌పోతే క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది కాబ‌ట్టి అప్పుడు ఇటువంటి ఆఫ‌ర్లు ల‌భించ‌వు. సాధారణంగా ఈ ఆఫ‌ర్ల‌లో వ‌స్తువులు త‌క్కువ‌కు ల‌భించ‌డం లేదా ప్రాసెసింగ్ స‌మ‌యం త‌క్కువ ఉంటుంది.  క్రెడిట్ కార్డ్ అర్హత ఎక్కువ‌గా ఉండ‌టంతో పాటు మీ రుణ‌ ప్ర‌యోజ‌నాల కోసం ఇత‌ర బ్యాంకుల‌తో  చర్చలు జరపడానికి కూడా మంచి క్రెడిట్ స్కోర్ సాయ‌ప‌డుతుంది.

ఉదాహరణకు, క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు తమ వినియోగదారులకు క్రమశిక్షణతో తిరిగి చెల్లించే చరిత్ర, లావాదేవీల సరళి, కార్డ్ రకం మొదలైన వాటి ఆధారంగా క్రెడిట్ కార్డులపై ముందస్తుగా ఆమోదించిన‌ రుణాలను అందిస్తారు. ఈ రుణాలకు తక్షణ పంపిణీ, 5 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే గ‌డువు ఉండవచ్చు. కొన్ని సంస్థల క్రెడిట్ పరిమితికి మించి ఎక్కువ రుణాలు కూడా జారీచేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని