రేపటి నుంచి ఆటోమేటిక్‌ చెల్లింపులు లేనట్లే

ఏప్రిల్‌ 1 నుంచి అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ)ను రిజర్వు బ్యాంక్‌ తప్పనిసరి చేయడంతో రీఛార్జ్‌, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్‌ చెల్లింపులు చేయడం ఇక కుదరదు. అయితే ఆటోమేటిక్‌ రికరింగ్‌

Published : 31 Mar 2021 11:56 IST

దిల్లీ: ఏప్రిల్‌ 1 నుంచి అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ)ను రిజర్వు బ్యాంక్‌ తప్పనిసరి చేయడంతో రీఛార్జ్‌, యుటిలిటీ బిల్లు సహా పలు సేవలకు సంబంధించి ఆటోమేటిక్‌ చెల్లింపులు చేయడం ఇక కుదరదు. అయితే ఆటోమేటిక్‌ రికరింగ్‌ చెల్లింపుల విషయంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలు అమలు చేయడానికి బ్యాంకులు, పేమెంట్‌ గేట్‌వే సంస్థలు మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నాయి. మార్చి 31 తర్వాత ఏఎఫ్‌ఏకు లోబడకుండా కార్డులు, ప్రీపెయిడ్‌ పేమెంట్‌ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తున్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్‌ఆర్‌బీలు, ఎన్‌బీఎఫ్‌సీలు, పేమెంట్‌ గేట్‌వేలతో పాటు బ్యాంకులను ఆర్‌బీఐ గతేడాది డిసెంబరు 4న ఆదేశించింది. కార్డు లావాదేవీల భద్రత, రక్షణ బలోపేతం చేసేందుకు ఆర్‌బీఐ ఈ చర్య చేపట్టింది. కొన్ని సంస్థలు ఇందుకు సిద్ధంగా లేకపోవడంతో వినియోగదారుల వినియోగ బిల్లులు, రీఛార్జులు, డీటీహెచ్‌, ఓటీటీ వంటి రికరింగ్‌ చెల్లింపులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
కెయిర్న్‌ ఎనర్జీకి నోటీసులు
దిల్లీ: వెనకటి తేదీ నుంచి పన్ను వసూలు కేసులో తమకు సానుకూలంగా వచ్చిన ఆర్బిట్రేషన్‌ తీర్పుపై భారత ప్రభుత్వం అప్పీలు చేస్తున్నందున, తమకు నోటీసులు అందినట్లు కెయిర్న్‌ ఎనర్జీ పేర్కొంది. కంపెనీపై విధించిన రూ.24,500 కోట్ల పన్ను బ్రిటన్‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద చట్టబద్ధంగా చెల్లదంటూ ద హేగ్‌ ట్రైబ్యునల్‌ జారీ చేసిన ఆదేశాలపై భారత ప్రభుత్వం అప్పీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కెయిర్న్‌ తన వాటాదార్ల ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటుంద’ని కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని