రెండు రోజుల్లో నెట్‌వ‌ర్క్ మార్చుకోవ‌చ్చు

మొబైల్ నంబ‌ర్ పోర్ట‌బులిటీ ఇక‌పై రెండు రోజుల్లో పూర్తికానుంద‌ని ట్రాయ్ ప్ర‌క‌టించింది....

Published : 21 Dec 2020 16:17 IST

మొబైల్ నంబ‌ర్ పోర్ట‌బులిటీ ఇక‌పై రెండు రోజుల్లో పూర్తికానుంద‌ని ట్రాయ్ ప్ర‌క‌టించింది.

17 డిసెంబర్ 2019 మధ్యాహ్నం 11:36

టెలికమ్‌ రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ)కి సంబంధించి కొత్త నిబంధనలు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు రెండు రోజుల్లో ఒక నెట్‌ వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారిపోవచ్చు. గత కొంత కాలంగా నెట్‌వర్క్‌ ఆపరేటర్ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా వినియోగదారులను ఆకర్షించేందుకు ఆపరేటర్లు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. వీటి కారణంగా వినియోగదారులు తరచుగా నంబర్‌ పోర్టబిలిటిని కోరుకుంటున్నారు. దీంతో ఈ సేవలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది.

గతంలో ఎంఎన్‌పీ కోసం 96 గంటలు సమయం పట్టేది. ప్రస్తుతం ఆ సమయాన్ని 48 గంటలకు కుదిస్తూ ట్రాయ్‌ నిబంధనల్లో మార్పులు చేసింది. దాని ప్రకారం ఎంఎన్‌పీకి దరఖాస్తు చేసుకున్న వినియోగదారునికి యునిక్ పోర్టింగ్‌ కోడ్‌ (యుపీసీ) జారీ అవుతుంది. అయితే ఈ యుపీసీ అనేది కేవలం మొబైల్ నంబర్‌ వినియోగంలో ఉన్న సమయంలో మాత్రమే జారీ అవుతుంది. దీని కోసం ట్రాయ్‌ వినియోగదారుడికి కొన్ని షరతులు విధించింది. దాని ప్రకారం, వినియోగదారుడు ప్రస్తుత నెట్‌వర్క్‌ ఆపరేటర్‌కి నెలవారి బిల్లుతోపాటు పాత బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. అలానే 90 రోజుల నుంచి ప్రస్తుత నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుండాలి. దానితో పాటు నంబర్‌ను ఒకరి పేరుమీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చుకునేందుకు అవకాశం లేదు. ఇంకా ఎంఎన్‌పీ కోరుకుంటున్న నంబర్‌ చట్టం చేత నిషేధించిన‌ది కాకూడదు, ఆ నంబర్‌పై ఎటువంటి న్యాయపరమైన వివాదాలు ఉండకూడదు అని తెలిపింది.

ఈ నిబంధనలు అన్నింటికి వినియోగదారులు అర్హులైతే ఎంఎన్‌పీకీ దరఖాస్తు చేసుకున్న ఐదు నిమిషాల్లో యుపీసీ జారీచేస్తారు. దాని కోసం పోర్ట్‌ అని ఆంగ్లంలో టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మొబైల్‌ నంబర్‌ టైప్ చేసి 1900 ఎస్సెమ్మెస్‌ పంపాలి. తర్వాత ఎస్సెమ్మెస్‌ ద్వారా యుపీసీ వస్తుంది. గతంలో యుపీసీ చెల్లుబాటు కాలం 15 రోజులుగా ఉండేది. ప్రస్తుతం దీన్ని 4 రోజులకు కుదించారు (జమ్ము కశ్మర్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇది 30 రోజులుగా నిర్ణయించారు). ఎంఎన్‌పీ ప్రక్రియను ప్రారంభించడానికి అడ్రస్‌ ప్రూఫ్‌, ఐడెంటీ ప్రూఫ్‌ వంటివి సమర్పించాలి. ఒకే సర్కిల్‌లో ఉన్న ఆపరేటర్లకు ఎంఎన్‌పీ మూడు రోజుల్లో పూర్తవుతుంది. అదే ఇతర సర్కిల్‌లో ఉన్న ఆపరేటర్లకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపింది. కార్పొరేట్ పరిధిలోని మొబైల్‌ కనెక్షన్స్‌కు పాత నిబంధనలే వర్తిస్థాయని ట్రాయ్‌ తెలిపింది. ఒక వేళ ఎవరైనా వినియోగదారులు తమ ఎంఎన్‌పీ దరఖాస్తు ఉపసంహరించుకోవాలంటే 24 గంటల లోపల దానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ట్రాయ్‌ పేర్కొంది.

ఛార్జీలు

  • టెలికాం నియంత్ర‌ణ సంస్థ ప్ర‌తి పోర్ట‌బులిటీ రిక్వెస్ట్‌కు రూ.6.46 ట్రాన్సాక్ష‌న్ ఫీజు ఛార్జ్ చేస్తుంది
  • వ్యక్తిగత వినియోగదారుల కోసం, యుపిసి చెల్లుబాటు అయ్యే వరకు పోర్టింగ్ అభ్యర్థన తిరస్కరించదు. కార్పొరేట్ మొబైల్ నంబర్ వినియోగదారులు పోర్ట‌బులిటీ కోసం కార్పొరేట్ సంస్థ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ప్రామాణీకరణ లేఖను సమర్పించాలి
  • ఒకే స‌ర్కిల్‌లో పోర్ట్ నంబ‌ర్ చేసుకోవాల‌నుకుంటే మూడు రోజుల్లో, వేరే స‌ర్కిల్‌లో అయితే ఐదు రోజుల్లో పూర్తవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని