ఓఎన్‌జీసీ చమురు క్షేత్రాల్లో వాటా ప్రైవేటుకు!

చమురు ఉత్పత్తి క్షేత్రాల్లో వాటాను ప్రైవేటు కంపెనీలకు విక్రయించాలని ఓఎన్‌జీసీకి చమురు మంత్రిత్వ శాఖ సూచించింది.

Updated : 26 Apr 2021 07:20 IST

దిల్లీ: చమురు ఉత్పత్తి క్షేత్రాల్లో వాటాను ప్రైవేటు కంపెనీలకు విక్రయించాలని ఓఎన్‌జీసీకి చమురు మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే కేజీ క్షేత్రాల్లో విదేశీ భాగస్వాములను తెచ్చుకోవాలని; ప్రస్తుత మౌలిక వసతులను నగదీకరించుకోవాలని; డ్రిల్లింగ్‌, ఇతర సేవలను ప్రత్యేక కంపెనీకి బదిలీ చేసి ఉత్పత్తి పెంచుకోవాలని కూడా తెలిపింది. ఆ మేరకు ‘ఓఎన్‌జీసీ వే ఫార్వర్డ్‌’ పేరిట ఒక ఏడు సూత్రాల ప్రణాళికను ఏప్రిల్‌ 1న ఓఎన్‌జీసీ ఛైర్మన్‌, ఎండీ సుభాశ్‌ కుమార్‌కు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శి(తవ్వకం) అమర్‌ నాథ్‌ లేఖ రాశారు. తద్వారా 2023-24 కల్లా చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని మూడో వంతు పెంచుకోవచ్చని అందులో తెలిపారు. పన్నా-మక్తా, రత్న, ఆర్‌ సిరీస్‌ వంటి క్షేత్రాల్లో వాటాను విక్రయించాలని, పనితీరు సరిగా లేని క్షేత్రాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని వివరించారు.
మూడో ప్రయత్నమిది: ఓఎన్‌జీసీకి చెందిన చమురు, గ్యాస్‌ క్షేత్రాలను ప్రైవేటీకరించడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న మూడో ప్రయత్నం ఇది. అక్టోబరు 2017లోనూ 15 క్షేత్రాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నించారు. అయితే ఓఎన్‌జీసీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను విరమించారు. ఆ తర్వాతి ఏడాది సైతం 149 చిన్న, మధ్య స్థాయి క్షేత్రాలను ప్రైవేటు, విదేశీ కంపెనీలకు ఇవ్వడానికి గుర్తించారు. ఫిబ్రవరి 19, 2019న 64 మధ్య స్థాయి క్షేత్రాలను విక్రయించడానికి యత్నించినా.. టెండర్లకు పెద్దగా స్పందన రాలేదు. 2020-21లో ఓఎన్‌జీసీ 20.2 మిలియన్‌ టన్నుల చమురును ఉత్పత్తిని చేయగా.. అంతక్రితం ఏడాది 21.1 మి. టన్నులను ఉత్పత్తి చేయగలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని