Rakesh Jhunjhunwala: ఝున్‌ఝున్‌వాలా స్టాక్స్‌ ఎప్పుడు అమ్ముతారంటే..

వేటి ఆధారంగా స్టాక్స్‌ను విక్రయిస్తారో తాజాగా జరుగుతోన్న ఇండియా టుడే కాంక్లేవ్‌లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వెల్లడించారు....  

Updated : 09 Oct 2021 14:07 IST

దిల్లీ: గంటల వ్యవధిలో రూ.కోట్ల సంపదను సృష్టించడం ప్రముఖ మదుపరి, ఇండియన్‌ బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకే సాధ్యమనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పెట్టుబడులు ఉన్న టైటన్‌ కంపెనీ షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 9.32 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.17,700 కోట్లకు చేరింది. ఈ సంస్థలో ఝున్‌ఝున్‌వాలా, ఆయన సతీమణి రేఖాకు కలిపి 4.81 శాతం వాటాలున్నాయి. దీంతో వారి వాటాల విలువ ఏకంగా కొన్ని గంటల వ్యవధిలో రూ.854 కోట్లు పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్‌ను ఏళ్లుగా తన ఖాతాలో కొనసాగిస్తూ లాభాలను గడిస్తున్న ఈ బిగ్‌బుల్‌.. ఏదో ఒక సమయంలో లాభాలను స్వీకరించేందుకు స్టాక్స్‌ను అమ్మాల్సిందే కదా..! మరి ఆయన స్టాక్స్‌ను ఏ ఆధారంగా విక్రయిస్తారో తాజాగా జరుగుతోన్న ఇండియా టుడే కాంక్లేవ్‌లో వెల్లడించారు.  

ఈ మూడే అమ్మకానికి ఆధారం..

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా శుక్రవారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడారు. ట్రేడింగ్‌లో ఆయన పాటించే కొన్ని సూత్రాలతో పాటు ప్రస్తుత స్టాక్‌ మార్కెట్‌ పోకడపై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న స్టాక్స్‌ను ఎప్పుడు విక్రయిస్తారనే దానిపై ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. స్టాక్స్‌ను అమ్మడానికి తాను మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటానని తెలిపారు. ‘‘రాబడి గరిష్ఠ స్థాయికి చేరుకుంటే; పీ/ఈ నిష్పత్తి గరిష్ఠానికి చేరితే; వేరే చోట మంచి పెట్టుబడి అవకాశం లభిస్తే’’ ఈ మూడు సందర్భాల్లో తాను స్టాక్స్‌ను విక్రయించి లాభాలను స్వీకరిస్తానని ఝున్‌ఝున్‌వాలా వివరించారు. లేదంటే తాను అసలు స్టాక్స్‌ను అమ్మే అవకాశం ఉండదన్నారు. పీ/ఈ నిష్పత్తి అంటే.. ప్రస్తుత స్టాక్ ధరను, ఒక్కో షేరుపై ఆ కంపెనీ ఆర్జిస్తున్న మొత్తంతో భాగిస్తే తెలుస్తుంది. ఉదాహరణకు ఈ నిష్పత్తి 10గా ఉందంటే.. కంపెనీ ఒక్కరూపాయి ఆర్జనను పొందడానికి మదుపర్లు రూ.10 చెల్లిస్తున్నారన్నమాట!

స్టాక్‌ మార్కెట్లలో దిద్దుబాటుపై...

ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గరిష్ఠ స్థాయిల్లో నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూచీలు భారీ దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందా అనే అంశంపైనా బిగ్‌ బుల్‌ స్పందించారు. దిద్దుబాటు అనేది సర్వసాధారణమన్నారు. కానీ, సూచీలు తిరిగి కిందకు రావడమన్నది మాత్రం జరగదన్నారు. కొన్ని స్టాక్స్‌ దిద్దుబాటుకు గురైనప్పటికీ.. స్థూలంగా సూచీలు మాత్రం కరెక్షన్‌ అయ్యే పరిస్థితి ఉండదన్నారు. ఒకవేళ కొన్ని స్టాక్స్‌ పడ్డా.. మరికొన్ని స్టాక్స్‌ పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. తాను భారత మార్కెట్‌ సూచీల పెరుగుదలపై అత్యంత విశ్వాసంతో ఉన్నానన్నారు. మార్కెట్‌ విలువ, మార్కెట్ల పోకడను.. భయం, ఆశతో కూడిన మానవ ఆలోచనా తీరే నిర్దేశిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏళ్లుగా దీంట్లో ఎలాంటి మార్పు లేదన్నారు.

ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై...

ఇక ప్రభుత్వ పెట్టుడుల ఉపసంహరణ ప్రక్రియపై మాట్లాడుతూ.. బీపీసీఎల్‌, ఎల్‌ఐసీ, సీసీఐ, ఎస్‌సీఐ వంటి కంపెనీలను కొనడానికి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇప్పటి నుంచి మార్చి 2022 వరకు దాదాపు 8 నుంచి 10 కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన ఝున్‌ఝున్‌వాలా.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోనుందన్న విషయాన్ని ఆయనతో పంచుకున్నానని తెలిపారు.

జీవితంలో ఇది తప్పనిసరి...

విమానయాన రంగంలోకి ప్రవేశించనుండడంపై ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ రంగంలో రానున్న ఎలాంటి ఫలితాల్ని స్వీకరించడానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ విషయంలో తాను అప్రమత్తతతో కూడిన రిస్క్‌ను తీసుకుంటున్నానన్నారు. ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. ఓటమికి కూడా సన్నద్ధంగా ఉన్నానన్నారు. జీవితంలో రిస్క్‌ తప్పనిసరని సూచించారు. ప్రస్తుతం విమానయాన రంగం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను పక్కా లెక్కలతో కూడిన రిస్క్‌ తీసుకుంటాను. మీరు ఏదైనా రిస్క్‌ తీసుకుంటున్నారంటే.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎలాంటి మానసిక ఒత్తిడి, భారీ ఆర్థిక నష్టం లేకుండా చూసుకోవాలి. నేను మార్కెట్లను అంచనా వేస్తుంటాను. ఒక్కోసారి నా అంచనాలు తప్పుతాయి. నేను వాటి నుంచి నేర్చుకుంటాను. తప్పు చేయడానికి నేను భయపడను. కానీ, నేను భరించగలననుకుంటేనే తప్పు చేస్తాను’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని