బీమా వ‌ద్ద‌నుకున్నా... తీసుకోక త‌ప్ప‌దేమో!

కొన్ని కార‌ణాల‌ను సాకుగా చూపి బీమా వ‌ద్ద‌నుకునేవారు వారికి కావాల‌సిన‌వారి ల‌బ్ధి కోసమైనా బీమా తీసుకోవాల్సిందే.

Published : 20 Dec 2020 13:18 IST

బీమా కొనుగోలు చేసేందుకు కొంద‌రు త‌ట‌ప‌టాయిస్తుంటారు. చాలా మంది దీన్నో అద‌న‌పు ఖ‌ర్చుగానే భావిస్తారు త‌ప్ప ర‌క్ష‌ణ‌గా ఉంటుందని ఆలోచించ‌రు. బీమా కొనుగోలు చేయ‌క‌పోవ‌డానికి త‌మదైన కార‌ణాలను వెదికి మ‌రీ చెబుతుంటారు. వాళ్లు చెప్పే కార‌ణాలు అప్ప‌టికి స‌హేతుకంగా అనిపించినా త‌ర్వాత అని త‌ప్ప‌ని రుజువ‌వుతుంది. ఇలా తాత్సారం చేయ‌డంతో బీమా కొనుగోలు మ‌రింత ప్రియం అవుతుంది.

ఈ నేప‌థ్యంలో బీమా కొనుగోలుకు విముఖ‌త చూపేందుకు సాధార‌ణంగా వేటిని కార‌ణాలుగా భావిస్తారో తెలుసుకొని త‌ద్వారా మ‌న‌క‌నుకూల‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుందాం.

నా పై ఆధార‌ప‌డినవారు ఎవ‌రూ లేరు

జీవిత బీమా ముఖ్యోద్దేశం … మ‌న త‌ద‌నంత‌రం మ‌న‌పై ఆధార‌ప‌డిన‌వారికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం. అయితే మ‌న పై ఆధార‌ప‌డిన‌వారు లేక‌పోతే బీమా తీసుకోవ‌డం శుద్ధ దండ‌గ ఖ‌ర్చుగా భావిస్తారు కొంద‌రు. అయితే నిపుణులు చెప్పేది ఏమిటంటే మీ పై ఆధార‌ప‌డిన‌వారు ఎవ‌రూ లేక‌పోయినా స‌రే కొన్ని సంద‌ర్భాల్లో మీ త‌ద‌నంత‌ర‌మూ ఆర్థిక ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.
ఉదాహ‌ర‌ణ‌కు మీరు తీర్చాల్సిన‌ అప్పులు, రుణాలు ఉన్నాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తు అప్పులు తీర‌కుండానే మ‌ర‌ణిస్తే ఆ భారమంతా హామీదారుగా సంత‌కం చేసిన వారిపై ప‌డుతుంది. వారిపై ఆర్థిక‌ భారం మోప‌డం స‌రికాదు క‌దా! అందుకే మీ బాధ్య‌త‌గా ఓ ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే మంచిది.
ప్ర‌స్తుతానికి మీపై ఆధార‌ప‌డిన వారు ఎవ‌రూ లేక‌పోయినా స‌రే భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకొని పాల‌సీ తీసుకోవ‌డం మేలు. ఏమో చెప్ప‌లేం! మున్ముందు కాలంలో మ‌న‌పై ఆధార‌ప‌డేవారు ఉండొచ్చు.

నేను రిటైర్ అయ్యాను

ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌వారికి జీవిత బీమా అవ‌స‌రం లేద‌ని భావిస్తుంటారు. వారికి ఆదాయం ఎలాగూ లేదు. పైగా ఇదో అద‌న‌పు ఖ‌ర్చు అనుకుంటారు. అయితే ఆ వ‌య‌సులోనూ బీమాకు విశిష్ట‌త ఉంటుంది.

రిటైర్‌మెంట్ త‌ర్వాత పింఛ‌ను రూపంలో అందే ఆదాయం మీ ఒక్క‌రికే చెందుతున్న‌ట్ల‌యితే… మీ త‌ద‌నంత‌రం కుటుంబ‌స‌భ్యుల‌కు పింఛ‌ను ఆగిపోతుంది. వారు ఆర్థికంగా ఇబ్బందుల‌కు గురిఅవుతారు. ఇలాంటి ప‌రిస్థితిల్లో వ‌చ్చే ఆదాయాన్ని భ‌ర్తీ చేసేందుకు ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు చేయ‌డం మంచిది.
ప‌ద‌వీ విర‌మ‌ణ చెందాక జీవిత బీమా గురించి ఆలోచించ‌కుండా చిన్న వ‌య‌సులోనే ట‌ర్మ్ పాల‌సీ తీసుకొని దాన్ని రిటైర్‌మెంట్ వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ కొన‌సాగించ‌డం లాభ‌దాయ‌కం. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌క్కువ ప్రీమియంతో లంప్‌స‌మ్ సొమ్మును కుటుంబ‌స‌భ్యుల‌కు అందించిన‌వార‌మ‌వుతాం.

ఇంట్లోనే ఉంటాను… బీమా అవ‌స‌ర‌మేంటి?

చాలా కుటుంబాల్లో జీవిత భాగ‌స్వామి ఇంట్లోనే ఉండి ప‌నులు చూసుకుంటూ ఉంటారు. వారు చేసే ప‌ని వెల‌క‌ట్ట‌లేనిది. ఆ స్థాయిలో సేవ‌లందించేవారు ఎంత డ‌బ్బు పెట్టినా దొర‌క‌డం క‌ష్టం. దుర‌దృష్ట‌వ‌శాత్తు వాళ్ల‌ను కోల్పోవాల్సి వ‌స్తే మైన‌ర్ పిల్ల‌ల‌ను, కుటుంబ బాధ్య‌త‌ల‌ను, ఖ‌ర్చుల‌ను చూసుకోవ‌డం చాలా క‌ష్ట‌మైపోతుంది. క‌నీస ప్ర‌త్యామ్నాయంగా ఆర్థికంగా అయినా లోటును పూడ్చుకునేలా చూసుకోవాలి.
ఇలాంట‌ప్పుడే జీవిత బీమా తెర‌పైకి వ‌స్తుంది. ఇంట్లో వారు అందించే సేవ‌ల‌కు వెల‌క‌ట్టలేం అయితే వారి పేరిట జీవిత బీమా తీసుకునే అంశాన్ని త‌ప్ప‌క ప‌రిశీలించాలి.

సంస్థ అందిస్తున్న పాల‌సీ ఉందిగా…

ఉద్యోగం చేసేవారికి సంస్థ త‌ర‌ఫు నుంచి బృంద ఆరోగ్య పాల‌సీ ఉంటుంది. దీని ప‌రిధిలోనే కుటుంబ‌స‌భ్యులు వ‌స్తారు. అయితే ఇలా ఇచ్చే బీమా అంత‌గా స‌రిపోదు అని బీమా స‌ల‌హాదారుల మాట‌. కొన్ని సార్లు ఉపాధి కోల్పోయిన‌ప్పుడు ఆరోగ్య పాల‌సీ వ‌ర్తించ‌దు. ఇలాంటప్పుడే మ‌న‌కంటూ విడిగా ఆరోగ్య పాల‌సీ తీసుకోవ‌డం మంచిది.

ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే ఆరోగ్య బీమా తీసుకోవ‌డం మంచిది. అప్పుడే ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది, పైగా ముంద‌స్తు రుగ్మ‌త‌ల‌కు వెయిటింగ్ పీరియ‌డ్ కార‌ణంగా చూపి క్లెయిం తిరస్క‌ర‌ణ‌కు గురికాకుండా ఉంటుంది.

ఇలా పాల‌సీ కొనుగోలు చేయ‌కుండా కార‌ణాలు వెదుక్కునే బ‌దులు ర‌క్ష‌ణ కోసం బీమా తీసుకోవ‌డం మంచిది. దీన్నో ఖ‌ర్చుగా భావించ‌కుండా ఉండండి. ఆర్థిక భ‌ద్ర‌త‌లో భాగంగా బీమా కొనుగోలు ఎంతో తోడ్పాటునిస్తుంది. ఉన్న బీమాకు అద‌న‌పు క‌వ‌రేజీ క‌ల్పించుకోవ‌డం, కొత్త బీమా కొనుగోలు విష‌యాల‌పై అప్పుడప్పుడు స‌మీక్షిస్తుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని