రూ.2.62 లక్షల కోట్ల పన్ను రిఫండ్‌

గత ఆర్థిక సంవత్సరంలో 2.38 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదార్లకు రూ.2.62 లక్షల కోట్ల మేర పన్ను రిఫండ్‌లు జారీ చేశామని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. ఇందులో 2.34 కోట్ల మందికి వ్యక్తిగత ఆదాయపు పన్ను

Published : 02 Apr 2021 01:52 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో 2.38 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదార్లకు రూ.2.62 లక్షల కోట్ల మేర పన్ను రిఫండ్‌లు జారీ చేశామని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. ఇందులో 2.34 కోట్ల మందికి వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.87,749 కోట్లు, 3.46 లక్షల కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను రూ.1.74 లక్షల కోట్లు రిఫండ్‌ చేసినట్లు తెలిపింది. 2020-21లో పన్ను రిఫండ్‌లు 43.2 శాతం మేర పెరిగాయని పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1.83 లక్షల కోట్ల పన్ను రిఫండ్‌ చేసినట్లు వివరించింది.


పీఈఎస్‌బీ ఛైర్‌పర్సన్‌గా మల్లికా శ్రీనివాసన్‌

దిల్లీ: ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ (టీఏఎఫ్‌ఈ) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లికా శ్రీనివాసన్‌ను ప్రభుత్వ సంస్థల ఎంపిక బోర్డు (పీఈఎస్‌బీ) ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది (పర్సనల్‌) మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు రంగంలోని నిపుణురాలిని పీఈఎస్‌బీ ఛైర్‌పర్సన్‌గా నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని (సీపీఎస్‌ఈలు) ఉన్నత మేనేజ్‌మెంట్‌ పదవులకు అధికారులను ఎంపిక చేసే బాధ్యత పీఈఎస్‌బీ చూస్తుంది. కేబినెట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ) మల్లికా శ్రీనివాసన్‌ నియామకాన్ని ఆమోదించింది. ఈమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.  


ఐటీఆర్‌ ఫామ్స్‌లో మార్పుల్లేవ్‌

దిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి దాఖలు చేయాల్సిన ఐటీ రిటర్నుల ఫామ్స్‌ను ఆదాయ పన్ను(ఐటీ) విభాగం నోటిఫై చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పేర్కొంది. ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో గతేడాది ఫామ్స్‌తో పోలిస్తే ఈ సారి ఐటీఆర్‌ ఫామ్స్‌లో పెద్ద మార్పులేమీ లేవని ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయ పన్ను చట్టం-1961లో సవరణల కారణంగా కొన్ని కనీస మార్పులు మాత్రమే చేపట్టినట్లు అందులో వివరించింది. పన్ను చెల్లింపుదార్లు తమకు ఇష్టమైతే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వీలు కూడా కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని