SBI Yono: ఎస్‌బీఐ ఖాతాదారులకు ప్రీ అప్రూవ్డ్‌ టూవీలర్‌ లోన్లు!

యోనో యాప్‌ వినియోగించే కస్టమర్లకు ఎస్‌బీఐ ప్రీ-అప్రూవ్డ్‌ లోన్స్‌ అందిస్తోంది....

Published : 03 Nov 2021 01:45 IST

ముంబయి: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా ఎస్‌బీఐ తీసుకొచ్చిన యోనో యాప్‌నకు మంచి ఆదరణ లభిస్తోంది. దీని వినియోగాన్ని మరింత పెంచేలా ఎస్‌బీఐ పలు చర్యలు చేపడుతోంది. పండగ సీజన్‌లో ఈ యాప్‌ ద్వారా చెల్లింపులు చేసిన వారికి ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తోంది. గృహ రుణాలకు యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వడ్డీరేటులో ప్రత్యేక రాయితీ కల్పిస్తోంది. తాజాగా ద్విచక్రవాహన రుణాలకు కూడా యోనో యాప్‌ వినియోగ ప్రయోజనాలను విస్తరించింది. 

యోనో యాప్‌ వినియోగించే కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్‌ టూ-వీలర్‌ లోన్స్‌ అందిస్తోంది. కావాల్సిన వారు యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు శాఖను నేరుగా సంప్రదించకుండానే రుణం పొందవచ్చు.  వీటినే ‘ఈజీ రైడ్‌ లోన్‌’గా వ్యవహరిస్తున్నారు. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.20,000 నుంచి రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది. నాలుగేళ్ల కాలపరిమితితో 10.5 శాతం వడ్డీరేటు ఉంటుంది. వాహనం ఆన్‌రోడ్‌ ధరలో 85 శాతం వరకు రుణం పొందేందుకు ప్రీ అప్రూవ్డ్‌ కస్టమర్లకు అర్హత ఉంటుంది. నేరుగా వాహన డీలర్ల ఖాతాకు రుణ మొత్తం వెళ్లిపోతుంది.

యోనో యాప్‌ను 2017లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 8.9 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 4.2 కోట్ల మంది రిజిస్టర్‌ అయ్యారు. వీరిలో 1.1 కోట్ల మంది రోజూ యాప్‌ను వినియోగిస్తున్నారు. జూన్‌ త్రైమాసికంలో యాప్‌ ద్వారా 1.5 లక్షల కొత్త ఖాతాలు తెరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని