‘రెండో వేవ్‌తో ఆర్థిక వ్యవస్థలో భారీ అనిశ్చితి’

కరోనా వైరస్‌ మరోసారి భారీగా విజృంభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులు, మదుపర్ల సెంటిమెంటులో భారీ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని నీతి ఆయోగ్ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. అందుక...........

Published : 18 Apr 2021 21:30 IST

నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అంచనా

దిల్లీ : కరోనా వైరస్‌ మరోసారి భారీగా విజృంభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులు, మదుపర్ల సెంటిమెంటులో భారీ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని నీతి ఆయోగ్ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. అందుకు భారత్‌ సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే, అవసరమైనప్పుడు ప్రభుత్వం తగు ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

కొన్ని రోజుల కిందటితో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా దిగజారాయని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. అయినప్పటికీ ఈ ఏడాది వృద్ధి రేటు 11 శాతం ఉండొచ్చునని అంచనా వేశారు. కరోనా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న తరుణంలో యూకే సహా ఇతర దేశాల నుంచి వచ్చిన కరోనా రకాలు పరిస్థితిని మునుపటి కంటే దారుణంగా మార్చాయని తెలిపారు.

రెండో వేవ్‌ ప్రభావాన్ని ఆర్థికశాఖ అంచనా వేసిన తర్వాతే.. మరో దఫా ఉద్దీపన చర్యల అవసరంపై ఓ అంచనాకు రాగలమని రాజీవ్‌ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఆర్‌బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగిస్తూ.. పరపతి విధాన నిర్ణయాలను ప్రకటించిందని గుర్తు చేశారు. కరోనా ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీ కింద కేంద్రం గత ఏడాది పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని