సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు vs గోల్డ్ ఈటీఎఫ్.. ఏది మేలు?

స్వ‌ల్ప‌కాలానికి గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ‌ధ్య‌స్థ‌, దీర్ఘ‌కాలాల‌కు సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు అనుకూలంగా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 

Updated : 24 Apr 2021 12:25 IST

ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావానికి త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డులు చేసేందుకు ఉన్న‌ మార్గాల‌లో బంగారం ఒక‌టి. పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మార్గాలు అందుబాటులో ఉన్న‌ప్పుడు బంగారం ధ‌ర‌ను ట్రాక్ చేయ‌డం  మ‌దుపరుల‌కు క‌ష్టం అవుతుంది. దీంతో గంద‌ర‌గోళానికి గుర‌వుయ్యే అవ‌కాశాలు ఉంటాయి. అయితే బంగారంలో పెట్టుబ‌డులు పెట్టేవారికి సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు, గోల్డ్ ఈటీఎఫ్‌లు(ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌) రెండు ర‌కాల పెట్టుబ‌డులు అనుకూలంగా ఉంటాయ‌ని, లిక్విడిటీని దృష్టిలో ఉంచుకుని స్వ‌ల్ప‌కాలానికి మ‌దుపు చేసేవారు గోల్డ్ ఈటీఎఫ్‌లు, మధ్య‌స్థ‌, దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులకు సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు ఎంచుకుంటే మంచిద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

గోల్డ్ ఈటీఎఫ్‌లు..
ప‌సిడి ఈటీఎఫ్‌లు ఎక్స్‌ఛేంజ్‌‌లో జాబితా చేయబడతాయి. వీటిని నేరుగా డీమ్యాట్ ఖాతా నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు 99.5 శాతం స్వ‌చ్ఛ‌మైన బంగారాన్ని క‌లిగి ఉంటాయి. ప్ర‌తి ప‌సిడి ఈటీఎఫ్‌ యూనిట్, 1/2 గ్రాముల 24 క్యారెట్ల భౌతిక‌‌ బంగారాన్ని సూచిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మార్గదర్శకాల ప్రకారం ఈ ఫిజిక‌ల్ గోల్డ్‌ కస్టోడియన్ బ్యాంకులో నిల్వ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిజిక‌ల్ గోల్డ్ కలిగి ఉండటం పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని ఇస్తుంది. నిర్దేశిత బంగారం పెట్టుబ‌డులు చేసిన వారు భౌతిక రూపంలో బంగారాన్ని తిరిగి పొందటానికి మ్యూచువల్ ఫండ్ సంస్థ‌లు అనుమతిస్తాయి. ఎప్పుడైనా ఎక్స్‌ఛేంజ్‌లో అమ్మవచ్చు కాబట్టి బంగారు ఈటీఎఫ్‌లు తగినంత ద్రవ్యత(లిక్విడిటీ)ను అందిస్తాయి. కొనుగోలుపై ప్రీమియం చెల్లించన‌వ‌స‌రంలేదు లేదా డిస్కౌంట్‌లో కూడా అమ్మ‌కోవాల్సిన ప‌రిస్థితి ఉండ‌దు.

ప్రతి ఈటీఎఫ్‌ యూనిట్ 24 క్యారెట్ల భౌతిక బంగారంతో స‌మానంగా ప‌రిగ‌ణించి, సురక్షితంగా నిల్వ చేస్తారు, దీనిపై బీమా కూడా ఉంటుంది. సార్వ‌భౌమ పస‌డి బాండ్ల కంటే గోల్డ్ ఫండ్లు లేదా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల‌లో లిక్విడిటీ ఎక్కువ‌గా ఉంటుంది.

సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాలు..
సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు అంటే ప్ర‌భుత్వ సెక్యూరిటీలు, వీటిని ఆర్‌బీఐ ద‌శ‌ల‌వారీగా జారీచేస్తుంది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌కు కొనుగోలు చేసి, ఉప‌సంహ‌రించుకునే‌ప్పుడు మార్కెట్లో బంగారం ధ‌ర‌కు స‌మానంగా పొందొచ్చు. ఈ బాండ్ల‌పై ఏడాదికి 2.5 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. అది పెట్టుబ‌డిదారుడి ఖాతాలో ఆరు నెల‌ల‌కోసారి జ‌మ‌వుతుంది. చివ‌రి వ‌డ్డీని మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత అందిస్తారు. జాతీయ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకులు, నియ‌మిత‌ పోస్టాఫీసులు, స్టాక్ హోల్డ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), అధికారిక స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు జారీచేస్తాయి. ఈ రికార్డుల‌న్నీ ఆర్‌బీఐ వ‌ద్ద ఉంటాయి. వ్య‌క్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు ఒక గ్రాము నుంచి 4 కిలో గ్రాముల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టేందుకు స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌చ్చు.

సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, " దీర్ఘకాలన్ని దృష్టిలో ఉంచుకుని బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, సావరిన్ గోల్డ్ బాండ్ మంచి ఎంపిక‌.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), దాదాపు ప్ర‌తీ నెల గోల్డ్ బాండ్ల‌ను విడుద‌ల చేస్తుంది. వీటి ద్వారా వివిధ ద‌శ‌ల‌లో బంగారాన్ని సేక‌రించ‌వచ్చు. ఈ ప‌సిడి బాండ్ల కాల‌ప‌రిమితి 8 సంవ్స‌రాలు. అయితే జారీచేసిన ఐదేళ్ల త‌ర్వాత ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంది. ఇవి ఎక్స్‌ఛేంజ్‌ల‌లో ట్రేడ‌వుతాయి. ఇత‌రుల‌కు డీ-మ్యాట్ రూపంలో బ‌దిలీ చేయ‌వ‌చ్చు. 5 సంవ‌త్స‌రాల త‌రువాత విత్‌డ్రా చేసుకుంటే దీర్ఘ‌కాల మూల‌ధ‌న లాభం(ఎల్‌టీసీజీ) మినహాయింపును కోల్పోతారు. కాబట్టి, పన్ను మినహాయింపు పొందటానికి, సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బును 8 సంవత్సరాలు కొన‌సాగించాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు కాకుండా, సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాల‌లో అందుబాటులో ఉన్న‌, గోల్డ్ ఈటిఎఫ్ పథకంలో అందుబాటులో లేని మ‌రొక ప్ర‌యోజ‌నం,  2.5 శాతం హామీ రాబడి. " అని తెలిపారు. 

ఎనిమిది సంవత్సరాల తరువాత, మెచ్యూరిటీ మొత్తం స్వయంచాలకంగా పెట్టుబ‌డిదారుడు ఇచ్చిన‌ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో, పెట్టుబడిదారునికి మెచ్యూరిటీ తేదీని నిర్ణయించే అవకాశం లేదని, గ‌డువు ముగిసే తేదీకి ముందు.. మూడు పనిదినాల బంగారం ధర సగటు ఆధారంగా మెచ్యూరిటీ మొత్తాన్ని నిర్ణయిస్తారని సోలంకి అన్నారు. ప్రవేశం, నిష్క్రమణ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ మేనేజ్‌మెంట్‌.. ఛార్జీలు, బ్రోకరేజీని విధిస్తుంది, అయితే సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాల‌లో ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని