బంగారం పెట్టుబ‌డుల‌కు పసిడి బాండ్లు ఇప్పుడు మంచి ఆప్ష‌న్

గ్రాము ధ‌ర రూ.4,639 గా నిర్ణ‌యించింది. సెకండ‌రీ మార్కెట్‌లో కూడా కొనుగోలు చేసే వీలుంది.....

Published : 23 Dec 2020 15:48 IST

గ్రాము ధ‌ర రూ.4,639 గా నిర్ణ‌యించింది. సెకండ‌రీ మార్కెట్‌లో కూడా కొనుగోలు చేసే వీలుంది

గ‌త కొన్ని వారాల నుంచి ప్ర‌పంచం తీవ్ర ఆర్థిక సంక్ష‌భంలోకి జారుకుంది. తిరిగి సాధార‌ణ ప‌రిస్థితులు వ‌చ్చేందుకు కొన్ని నెల‌లు ప‌ట్టే అవ‌కాశం ఉంది. కోవిడ్-19, ప్ర‌పంచ మార్కెట్ల‌తో పాటు దేశీయ మార్కెట్ల‌ను న‌ష్టాల్లోకి నెట్టేసింది. కొన్నేళ్ల నుంచి పెట్టిన పెట్టుబ‌డులు ఒక్క‌సారిగా ఆవిర‌య్యాయి. ఉద్యోగాల్లో కోత‌లు, వేత‌న కోతలు పెరుగుతున్నాయి. దీంతో మాంద్యం త‌ప్పేలా లేదు. ఇన్ని ప్ర‌తికూల‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ, ఒక్క పెట్టుబ‌డి మాత్రం ఇప్పుడు లాభ‌దాయ‌కంగా కనిపిస్తోంది. అదే బంగారంలో పెట్టుబ‌డి. గ‌త ఏడాది నుంచి ఇప్ప‌టివ‌ర‌కు బంగారం ధ‌ర 30 శాతం పెరిగింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా లాభాలు పొందాలంటే మీ పోర్ట్‌ఫోలియోలో కొన్ని మార్పులు చేసుకొని బంగారం పెట్టుబ‌డుల‌కు కొంత ఎక్కువ కేటాయించవ‌చ్చ‌ని నిపుణుల స‌ల‌హా.

అక్ష‌య తృతీయ రోజు నాణేలు, ఆభ‌ర‌ణాలు కొన‌డం సాంప్ర‌దాయంగా వ‌స్తోంది. అయితే ఈసారి లాక్‌డౌన్ కార‌ణంగా అన్ని దుకాణాలు మూసివేసిన సంగ‌తి తెలిసిందే. కొన్ని సంస్థ‌లుత‌మ వెబ్‌సైట్ల, యాప్‌ల‌ ద్వారా ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే స‌దుపాయం క‌ల్పిస్తున్నాయి. లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత వాటిని దుకాణాల వ‌ద్ద తీసుకోవ‌చ్చు లేదా ఇంటికే డెలివ‌రీ చేస్తారు. అయితే పెట్టుబ‌డుల కోసం బంగారం కొనాల‌నుకుంటే మ‌రిన్ని ఆప్షన్లు ఉన్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ఆటీఎఫ్‌లు, సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు వంటివి. ఇందులో ఇత‌ర వాటికంటే ప‌సిడి బాండ్ల పెట్టుబ‌డుల‌కు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు అంటే ఏంటి?
సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు అంటే ప్ర‌భుత్వ సెక్యూరిటీలు, వీటిని ఆర్‌బీఐ ద‌శ‌ల‌వారీగా జారీచేస్తుంది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌కు కొనుగోలు చేసి , ఉప‌సంహ‌రించుకునేట‌ప్పుడు మార్కెట్లో బంగారం ధ‌ర‌కు స‌మానంగా పొంద‌వ‌చ్చు. ఈ బాండ్ల‌పై ఏడాదికి 2.5 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. అది పెట్టుబ‌డిదారుడి ఖాతాలో ఆరు నెల‌ల‌కోసారి జ‌మ‌వుతుంది. చివ‌రి వ‌డ్డీని మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత అందిస్తారు. జాతీయ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, నియ‌మిత‌ పోస్టాఫీసులు, స్టాక్ హోల్డ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), అధికారిక స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు జారీచేస్తాయి. ఈ రికార్డుల‌న్నీ ఆర్‌బీఐ వ‌ద్ద ఉంటాయి. వ్య‌క్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు ఒక గ్రాము నుంచి 4 కిలో గ్రాముల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టేందుకు స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌చ్చు.

ట్ర‌స్టులు, యూనివ‌ర్సిటీలు వంటివాటికి ఇంకా ఎక్కువ పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం ఉంది. మైన‌ర్ పిల్ల‌ల పేరుతో కూడా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఈ ప‌సిడి బాండ్ల కాల‌ప‌రిమితి 8 సంవ్స‌రాలు. అయితే జారీచేసిన ఐదేళ్ల త‌ర్వాత ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంది. ఇవి ఎక్స్‌ఛేంజ్‌ల‌లో ట్రేడ‌వుతాయి. ఇత‌రుల‌కు డీ-మ్యాట్ రూపంలో బ‌దిలీ చేయ‌వ‌చ్చు. ఆదాయ ప‌న్ను చ‌ట్ట ప్ర‌కారం దీనిపై వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. కానీ క్యాపిట‌ల్ గెయిన్స్‌పై మిన‌హాయింపు ల‌భిస్తుంది. అయితే బాండ్ల బదిలీపై ఏ వ్యక్తికైనా ఉత్పన్నమయ్యే దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న ప‌న్ను (ఎల్‌టీసీజీ) కి ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంటుంది.

ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మొద‌టి విడ‌త బాండ్ల‌ను ఆర్‌బీఐ ఏప్రిల్ 20 జారీచేసింది. గ్రాము ధ‌ర రూ.4,639 గా నిర్ణ‌యించింది. ఏప్రిల్ 20 నుంచి 24 వ‌ర‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ.50 డిస్కౌంట్ కూడా ల‌భిస్తుంది. ఈ అవ‌కాశం మిస్ అయితే సెకండ‌రీ మార్కెట్‌లో కూడా కొనుగోలు చేసే వీలుంది.

సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌తో ప్ర‌యోజ‌నాలు:
ముఖ్యంగా బంగారం భ‌ద్ర‌త‌, స్వ‌చ్ఛ‌త‌కు సంబంధించి ఎటువంటి భ‌యం ఉండ‌దు. నాణేలు, ఆభ‌ర‌ణాలు కొంటే స్వ‌చ్ఛ‌త విష‌యంలో అనుమానాలు ఉంటాయి. దీంతో పాటు త‌యారీ ఛార్జీలు, జీఎస్‌టీ వంటి వాటితో ఎక్కువ ధ‌ర అవుతుంది. తిరిగి అమ్మేట‌ప్పుడు ఇవేవి ల‌భించ‌వు. పైగా ఒక‌వేళ బ్యాంకు లాక‌ర్‌లో దాచుకోవాల‌నుకుంటే అద‌నంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే పస‌డి బాండ్ల‌లో అయితే మార్కెట్ బంగారానికి స‌మానంగా ధ‌ర ల‌భిస్తుంది. భ‌ద్ర‌త గురించి ఎటువంటి దిగులుండ‌దు. ఇవి బాండ్ల రూపంలో ఉంటాయి కాబ‌ట్టి ఇటువంటి భ‌యాలు ఉండ‌వు.

అధిక రాబ‌డి:
సార్వ‌భౌమ పసిడి బాండ్ల‌పై 2.5 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇది ఆభ‌ర‌ణాలు, నాణేలు కొంటే రాదు. ఇంకా అమ్మేట‌ప్ప‌డు త‌రుగు పోగా త‌క్కువ డ‌బ్బు వ‌స్తుంది. ఇక చెప్పాలంటే గోల్డ్ ఈటీఎఫ్‌ల‌ను కూడా ఉప‌సంహ‌రించుకునేట‌ప్పుడు రాబ‌డి త‌గ్గుతుంది. ఎందుకంటే అమ్మకం రోజున ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధర ఆధారంగా దీనిని నిర్ణ‌యిస్తారు. ఇక్క‌డ మ‌రో ఉప‌యోగం ఏంటంటే బంగారం తాక‌ట్టు రుణం తీసుకున్న‌ట్లుగానే …బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీలో ఈ ప‌సిడి బాండ్ల‌పై కూడా రుణం ల‌భిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లో ఈ స‌దుపాయం లేదు.

ప‌న్ను మిన‌హాయింపులు:
మూడేళ్ల‌ కంటే ఎక్కువ‌కాలం బంగారం లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లు మీ వ‌ద్ద ఉంచుకుంటే ఎల్‌టీసీజీ సెస్‌తో క‌లిపి 20.8 శాతం వ‌ర్తిస్తుంది. స్వ‌ల్ప‌కాలిక ప‌న్ను, మీ స్థూల‌ ఆదాయంతో క‌లిపి ప‌న్ను శ్లాబు ప్ర‌కారం విధిస్తారు. అయితే సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల వ‌డ్డీపై ప‌న్ను ఉన్న‌ప్ప‌టికీ , ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో మూల‌ధ‌న లాభంపై ప‌న్ను ఉండ‌దు.

చివ‌రిగా…
ఇవ‌న్నీ కార‌ణాల దృష్ట్యా , ఇప్పుడున్న మార్కెట్‌ ప‌రిస్థితుల ప్ర‌కారం బంగారంలో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే సార్వ‌భౌమ ప‌స‌డి బాండ్ల‌కు మించిన మంచి ఆప్ష‌న్ లేదు. మీ పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ంగ్, వైవిధ్య‌త‌కు బంగారం పెట్టుబ‌డులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ పెట్టుబ‌డులు పోర్ట్‌ఫోలియోలో 10 శాతానికి మించి ఉండ‌కూడ‌ద‌ని నిపుణుల అభిప్రాయం. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆర్థిక భ‌ద్ర‌త కోసం మాత్ర‌మే ఈ పెట్టుబ‌డులు ఉండాలి. బంగారంలో ఎక్కువ పెట్టుబ‌డులు మీ ఆర్థిక ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌చ్చు. దీంతో పాటు బంగారం స్వ‌చ్ఛ‌త‌, నాణ్యత వంటి అంశాల గురించి భ‌యం లేకుండా బాండ్ల పెట్టుబ‌డులు మంచివి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని