Updated : 27 Jun 2021 08:49 IST

తెలుగు బాసూ... సెబాసు..!

భారత్‌లో రోజూ వందల సంఖ్యలో అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ వివిధ సమస్యల్ని పరిష్కరించే ఉద్దేశంతో వస్తున్నవే. తెలుగుబిడ్డల ఆలోచనల్లోంచి పుట్టిన విజయవంతమైన అలాంటి అంకురాలివి!

సెలూన్లకు జినోటి!

కొవిడ్‌ సమయంలో యూనికార్న్‌ స్థాయిని అందుకున్న కంపెనీల్లో జినోటి ఒకటి. సురేష్‌ కోనేరు ప్రారంభించిన ఈ సంస్థ బ్యూటీ పార్లర్లూ, సెలూన్లూ, స్పాలూ, యోగా శిక్షణ సంస్థలకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల్ని అందిస్తూ వారి వెబ్‌సైట్‌, ఆప్‌ నిర్వహణను చేపడుతుంది. సెలూన్‌, స్పాలకు వెళ్లేవాళ్లు జినోటి ద్వారా స్లాట్‌ బుక్‌చేసుకోవచ్చు, చెల్లింపులు కూడా చేయొచ్చు. ఈ విభాగంలో ప్రపంచంలోనే ఇది మొదటి యూనికార్న్‌ సంస్థ. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థను 2010లో తన తమ్ముడు ధీరజ్‌తో కలసి ప్రారంభించారు సురేష్‌. ఎనిమిదేళ్ల పాటు అమెరికాలో మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్‌ యూనిట్‌ మేనేజర్‌గా పనిచేశాక రెండు అంకుర సంస్థల్లో సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు సురేష్‌. ఆ తర్వాత భారత్‌ తిరిగొచ్చారు. ఆ సమయంలోనే యోగా, ధ్యానం, ఫిట్‌నెస్‌ వర్క్‌షాప్‌లకు హాజరయ్యారు. ఆ అనుభవంతో అమెరికాలో లాటిట్యూడ్స్‌ పేరుతో హెల్త్‌ క్లబ్‌లూ, స్పాలూ, సెలూన్ల చెయిన్‌ను ప్రారంభించారు. అయితే వాటి నిర్వహణలో అతడికి చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా అలాంటి సంస్థల సమాచారం అందించే ఒక వేదిక లేకపోవడంతో కస్టమర్లను ఆకర్షించడం కష్టమయ్యేది. తనకున్న టెక్నాలజీ నేపథ్యంతో ఆ పని తానే చేయాలనుకున్నారు. అలా జినోటీని ప్రారంభించారు. 50 దేశాల్లో వీరి సేవలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల్లో 60 శాతం అమెరికా నుంచీ, 20 శాతం యూకే నుంచీ ఉన్నారు. టోనీ అండ్‌ గయ్‌, కోర్‌పవర్‌ యోగా, లాక్మే లాంటి ప్రఖ్యాత సంస్థలు వీరి సేవల్ని వినియోగించు కుంటున్నాయి.

కాలుష్యానికి ఈ-చెక్‌!

ఈట్రయో... హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే వాహన తయారీ సంస్థ. దీని వ్యవస్థాపకులు సత్య యలమంచిలి. హైదరాబాద్‌లోని ముఫఖమ్‌ జా కాలేజీలో ఇంజినీరింగ్‌ చేశాక అమెరికాలోని హార్వర్డ్‌ ఎక్స్‌టెన్షన్‌ స్కూల్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ చేశారు సత్య. తర్వాత నిర్వాణ ల్యాబ్స్‌ అనే డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థను ప్రారంభించారు. ఓసారి చైనా పర్యటనకు వెళ్లినపుడు అక్కడ విద్యుత్‌ వాహనాల వినియోగం పెద్ద స్థాయిలో ఉండటాన్ని చూసి భారత్‌లోనూ అలాంటి మార్పు తేవాలనుకున్నారు. 2017లో ఐఐఎమ్‌ పూర్వ విద్యార్థి దీపక్‌తో కలిసి దీన్ని ప్రారంభించారు సత్య. మొదట్లో అప్పటికే మార్కెట్‌లో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాల్ని విద్యుత్‌తో నడిచేలా మార్చే సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేశారు సత్య. అలా ఆల్టో, స్విఫ్ట్‌ డిజైర్‌, వేగన్‌ ఆర్‌, టాటా ఏస్‌ వాహనాలను విద్యుత్‌ వాహనాలుగా మార్చే కిట్లను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం సొంతంగా ఎలక్ట్రిక్‌ ఆటోలూ, సైకిళ్లనూ తయారుచేస్తోందీ సంస్థ. పలు ఈ-కామర్స్‌ సంస్థలు వస్తువుల పంపిణీకి వీరి వాహనాలను ఉపయోగిస్తున్నాయి. తమ బ్రాండ్‌ నుంచి ఇప్పటికే 200 వరకూ ఈ-ఆటోలను అమ్మారు. త్వరలో ఎలక్ట్రిక్‌ కార్లూ, లైట్‌ కమర్షియల్‌ వెహికల్‌ విభాగంలోకీ అడుగుపెట్టనున్నారు.

భద్రత పెంచే మైగేట్‌!

ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా బాధ్యతలు నిర్వహించిన విజయ్‌ ఆరిశెట్టి భుజానికి గాయం కావడంతో పదేళ్లకే సర్వీసు నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అప్పటివరకూ కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో ఉండటంతో కుటుంబ భద్రత విషయంలో అతనికి ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. కుటుంబంతో పాటు కంటోన్మెంట్‌ నుంచి బయటకు రావాల్సివచ్చినపుడు అతను దీనిగురించి ఆలోచించి గేటెడ్‌ కమ్యూనిటీలో అయితే భద్రత కొంత మెరుగ్గా ఉంటుందని బెంగళూరులో అలాంటి ఇల్లు తీసుకున్నారు. కానీ మెల్లగా తెలిసింది అక్కడ భద్రత డొల్ల అని. విజయ్‌ అప్పటికే హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ నుంచి ఎంబీఏ చేసి బెంగళూరులోని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తన అనుభవంతో గేటెడ్‌ కమ్యూనిటీల భద్రతను పెంచే కంపెనీ ప్రారంభిద్దామని ఐఎస్‌బీ సహాధ్యాయి శ్రేయాంశ్‌ దాగా, సహోద్యోగి అభిషేక్‌ కుమార్‌లతో చెప్పగా... వారికీ ఆ ఆలోచన నచ్చి సరేనన్నారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. పని మనుషులూ, బంధువులూ, డెలివరీ బాయ్స్‌... ఇలా ఎవరైనా గేటుదాటి లోపలికి రావాల్సి వస్తే సంబంధిత ఇంటి యజమాని నుంచి వారికి పిన్‌ వస్తుంది. అది చెబితేనే అనుమతి ఉంటుంది. 2017లో మొదట బెంగళూరులోని మూడు గేటెడ్‌ సముదాయాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. అక్కడికి వచ్చేపోయే చాలామందికి ఈ విధానం నచ్చి తాముండే చోట ఈ సంస్థ సేవల్ని వినియోగించుకోవడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15వేలకు పైగా గేటెడ్‌ కమ్యూనిటీలు వీరి సేవల్ని ఉపయోగించుకుంటున్నాయి. కొవిడ్‌ సమయంలో ఈ ఆప్‌ద్వారా వైద్య సేవలూ అందేలా చూశారు. వివిధ బ్రాండ్‌లకు చెందిన నిత్యావసరాలూ, గృహోపకరణాలూ డిస్కౌంట్‌ ధరల్లో అందిస్తున్నారు. భవిష్యత్తులో ఆప్‌ ద్వారా అందించే సేవల్ని మరింత విస్తరించాలని చూస్తున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని