Tata Sons: టాటాసన్స్‌ నాయకత్వ పునర్‌వ్యవస్థీకరణ..!

భారత్‌లోని అతిపెద్ద కార్పొరేట్‌ హౌస్‌ అయిన టాటాసన్స్‌ నాయకత్వాన్ని పునర్‌ వ్యవస్థీకరించే అవకాశం ఉంది. దీనిలో భాగంగా టాటాసన్స్‌కు సీఈవోను నియమించే

Published : 14 Sep 2021 19:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లోని అతిపెద్ద కార్పొరేట్‌ హౌస్‌ ‘టాటాసన్స్‌’ నాయకత్వాన్ని పునర్‌ వ్యవస్థీకరించనున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా టాటాసన్స్‌కు సీఈవోను నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. సీఈవోపైన ఛైర్మన్‌ పర్యవేక్షణ ఉంటుంది. కంపెనీలో కార్పొరేట్‌ పాలనను మరింత మెరుగుపర్చేందుకు ఈ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

కొత్త పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం సీఈవో పదవిలో ఉన్న వ్యక్తి టాటాసన్స్‌ వ్యాపారాలకు మార్గదర్శకత్వం వహిస్తారు. వాటాదారుల తరపు సీఈవో పనితీరును ఛైర్మన్‌ పర్యవేక్షించనున్నారు. ఈ ప్రతిపాదనలకు టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా ఆమోదం దీనికి కీలకం కానుంది. ప్రస్తుతం టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్ర శేఖరన్‌ ఫిబ్రవరిలోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. టాటా గ్రూప్‌లోని పలువురిని ఇప్పటికే సీఈవో పదవి చేపట్టేందుకు సిద్ధం చేశారు. ఇప్పటికీ విధివిధానాలు ఓ కొలిక్కి రాలేదు. దీనిపై టాటాసన్స్‌ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించినట్లు  ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి.

రతన్‌ టాటా-సైరస్‌ మిస్త్రీ న్యాయ వివాదం ముగిసిన తర్వాత ఈ ప్రతిపాదన ముందుకొచ్చింది. ఏళ్లపాటు సాగిన కేసులో అంతిమంగా రతన్‌ టాటా విజయం సాధించారు. అనంతరం సీఈవో ప్రతిపాదన ముందుకొచ్చింది. దాదాపు 20ఏళ్లపాటు రతన్‌ టాటా కంపెనీని నడిపించి ఇప్పుడు విశ్రాంతి తీసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కంపెనీకి పటిష్టమైన నాయకత్వం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టాటా గ్రూపు 100 వ్యాపారాలకు పైగా నిర్వహిస్తోంది.. దాదాపు డజను లిస్టెడ్‌ కంపెనీలు ఉన్నాయి. 2020లో వీటి ఆదాయం 106 బిలియన్‌ డాలర్లు . మొత్తం 7,50,000 మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని