‘సెక్ష‌న్ 80డీ’ తో ప‌న్ను మిన‌హాయింపు ఎలా?

సెక్ష‌న్ 80డీ తో వ్య‌క్తిగ‌త‌, కుటుంబ ఆరోగ్య బీమా పాల‌సీల‌పై చెల్లించే ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ప్ర‌తి ఏడాది మీరు చేసిన పెట్టుబ‌డులు, పొదుపు, జీవిత‌ బీమా ప్రీమియంల‌పై సెక్ష‌న్ 80 సీ కింద‌ ప‌న్ను మిన‌హాయింపు..

Updated : 15 Jan 2021 11:46 IST

సెక్ష‌న్ 80డీ తో వ్య‌క్తిగ‌త‌, కుటుంబ ఆరోగ్య బీమా పాల‌సీల‌పై చెల్లించే ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ప్ర‌తి ఏడాది మీరు చేసిన పెట్టుబ‌డులు, పొదుపు, జీవిత‌ బీమా ప్రీమియంల‌పై సెక్ష‌న్ 80 సీ కింద‌ ప‌న్ను మిన‌హాయింపు కొర‌కు క్లెయిమ్ చేసుకుంటారు. అయితే సెక్ష‌న్ 80 డీ కూడా ప్ర‌త్యేక ప‌న్ను మిన‌హాయింపుల‌ను అందిస్తుంది.

సెక్ష‌న్ 80 డీ ఎందుకు?
గ‌త ద‌శాబ్ద కాలంగా బీమా పాల‌సీలు బాగా ఆద‌ర‌ణ పొందుతున్నాయి. ప్ర‌భుత్వం వీటిపై ప‌న్ను మిన‌హాయింపు కూడా ఇస్తుండ‌టంలో పాల‌సీ అవ‌స‌రాల‌ను అందరు అర్థం చేసుకుంటున్నారు. కుటుంబ సంర‌క్ష‌ణ కోసం బీమా పాల‌సీ తప్ప‌నిస‌రి. సెక్ష‌న్ 80 డీ ఆరోగ్య‌ బీమా ప్రీమియం చెల్లింపుల‌కు సంబంధించిన అన్ని ప‌రిమితులు, నిబంధ‌న‌ల‌కు లోబ‌డి పన్ను మిన‌హాయింపు ఇస్తుంది. ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80డీ తో ప‌న్ను మిన‌హాయింపు ఎలా పొంద‌వ‌చ్చు తెలుసుకుందాం.

వ్య‌క్తిగ‌త బీమా పాల‌సీ ప్రీమియంతో పాటు కుటుంబానికి సంబంధించిన (భార్య లేదా భ‌ర్త‌, పిల్ల‌లు, తల్లిదండ్రులు) ఆరోగ్య బీమా ప్రీమియంపై క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే సోద‌రుడు లేదా ఓద‌రి పేరుతో బీమా ప్రీమియం చెల్లిస్తే వారు ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు వీలుండ‌దు. ఇక దీని గురించి వివ‌రంగా చెప్పాలంటే…

వ్య‌క్తిగ‌త పాల‌సీల‌కు
► భార్య లేదా భ‌ర్త‌
► 18 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సున్న పిల్ల‌లు
► త‌ల్లిదండ్రుల పేరుతో ప్రీమియం చెల్లిస్తే క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

సెక్ష‌న్ 80డీ కింద‌ ఎంత క్లెయిమ్ చేసుకోవ‌చ్చు?

♦  60 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సున్న‌వారు గ‌రిష్ఠంగా రూ.25 వేల వ‌ర‌కు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపుపై పన్ను మినహాయింపు పొందొచ్చు.
♦  మీ త‌ల్లిదండ్రుల వ‌య‌సు 60 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ అయితే 50 వేల వ‌ర‌కు క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌తి ఏడాది ల‌భించే హెల్త్ చెకప్ కోసం రూ.5000 కూడా ఇందులోకి వ‌స్తాయి.
కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల ద్వారా ప‌రిశీలిస్తే ..
కేస్ 1: రామ్ వ‌య‌సు 35 సంవ‌త్స‌రాలు . అత‌నికి భార్య , ఒక కూతురు , త‌ల్లిదండ్రులు (త‌ల్లి వ‌య‌సు 55, తండ్రి వ‌య‌సు 57 సంవ‌త్స‌రాలు)

ఒక ఏడాదికి రామ్ త‌న‌కు + బార్య‌కు + కుతురు పేరుతో క‌లిపి ఉన్న పాల‌సీకి రూ.15,000 చెల్లించాడు. త‌ల్లిదండ్ర‌లు బీమా ప్రీమియం రూ.34 వేలు చెల్లించాడు. అయితే సెక్ష‌న్ 80 డీ కింద రామ్‌కి ఎంత ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుందో చూద్దాం…

వ్య‌క్తిగ‌త + కుటుంబానికి క‌లిపి ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితి రూ.25,000 , త‌ల్లిదండ్రుల‌కు రూ.25,000. అంటే రామ్ ఇప్పుడు రూ.15,000 + రూ.25,000 మొత్తం క‌లిపి రూ.40,000 సెక్ష‌న్ 80డీ కింద క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

కేస్ 2: రాకేశ్ వ‌య‌సు 48 సంవ‌త్స‌రాలు, అత‌నికి భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు, తండ్రి (వ‌య‌సు 75 సంవ‌త్సరాలు) ఉన్నారు. సంవ‌త్స‌రానికి బీమా ప్రీమియం త‌న‌కు, భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు క‌లిపి రూ.32,000 చెల్లిస్తున్నాడు. తండ్రి కోసం రూ.63,000, అదేవిధంగా మెడిక‌ల్ చెక‌ప్ కోసం రూ.8000 చెల్లిస్తున్నాడు. అయితే ఇప్పుడు రాకేశ్ సెక్ష‌న్ 80డీ కింద ఎంత క్లెయిమ్ చేసుకోచ్చు అంటే…

రాకేశ్ + భార్య + పిల్ల‌లు క‌లిపి మిన‌హాయింపు ప‌రిమితి రూ.25,000, తండ్రి సినియ‌ర్ సిటిజ‌న్ కావ‌డంతో ప‌రిమితి రూ.50,000. అంటే రాకేశ్ ఇప్పుడు మొత్తం రూ.75,000 క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. రాకేశ్ చెల్లిస్తున్న ప్రీమియం మిన‌హాయింపు ప‌రిమితికి మించి ఉంది కాబ‌ట్టి ఇంకా మెడిక‌ల్ చెక‌ప్ కోసం చెల్లించిన మొత్తం క్లెయిమ్ చేసుకునేందుకు వీల్లేదు. ఎందుకంటే మెడిక‌ల్ చెక‌ప్ వ్యక్తిగ‌త ప్రీమియం మిన‌హాయింపులో క‌లిపి ఉంటుంది.

ఒకేదానితో రెండు ప్ర‌యోజ‌నాలు: ఆరోగ్య బీమా పాల‌సీపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌డం మంచి విష‌యం. ఆరోగ్య బీమా అనేది ప్ర‌తి ఒక్క‌రికి త‌ప్ప‌నిస‌రి. అదేవిధంగా పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌లో ఆరోగ్య బీమా పాల‌సీ త‌ప్న‌నిస‌రిగా ఉండేలా చూసుకోవాలి. వ్య‌క్తిగ‌త‌, కుటుంబ ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకుంటే ఆరోగ్య భ‌ద్ర‌తతో పాటు డ‌బ్బును ఆదా చేసుకోవ‌చ్చు. బీమా హామీ ఎంత తీసుకోవాలన్నది వ్యక్తిగత స్థితిగతులు, కుటుంబ ఆరోగ్య పరిస్థితులు లాంటి వాటి మీద ఆధార పది ఉంటుంది. ఒకరు రూ. 3-4 లక్షల వరకు బేస్ పాలసీ తీసుకుని, రూ. 7-10 లక్షల వరకు సూపర్ టాప్ పాలసీ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని