వార‌స‌త్వ బంగారంపై ప‌న్ను వ‌ర్తిస్తుందా?

వివాహిత‌ మ‌హిళ, అవివాహిత యువ‌తి, పురుషుల వ‌ద్ద కొంత వరకు నిర్ణీత బంగారాన్ని ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌కుండా నిల్వచేసుకోవ‌చ్చు.

Updated : 16 Sep 2021 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌త‌దేశంలో ఆభ‌ర‌ణాల రూపంలో ఉన్న బంగారాన్ని ఒక త‌రం వారు మ‌రో త‌రానికి అంటే వారి వార‌సుల‌కు అందజేస్తారు. ఇలా వ‌చ్చిన బంగారాన్ని వార‌స‌త్వపు బంగారం అంటారు. ఒక‌వేళ మీరు బంగారు ఆభ‌ర‌ణాల‌ను వారస‌త్వంగా పొందిన‌ట్ల‌యితే, ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల్లో పొందుప‌ర‌చాల్సిన అవసరం లేదు. కానీ వార్షిక ఆదాయం రూ.50 ల‌క్ష‌ల మించి ఉంటే ఆభ‌ర‌ణాల రూపంలో ఉన్న బంగారం స‌హా మొత్తం నిల్వ‌ల‌ను రిట‌ర్నుల్లో పొందుప‌ర‌చాల్సి ఉంటుంది. 

వారసత్వంగా వచ్చిన బంగారం విషయంలో కొనుగోలుదారు చెల్లించిన అస‌లు ధరను వెల్లడించవచ్చు. ఒక‌వేళ చెల్లించిన అసలు ధర వివరాలు మీ వద్ద లేకపోతే 2001 ఏప్రిల్‌ 1నాటికి ఉన్న మార్కెట్ విలువను రిట‌ర్నుల్లో వెల్లడించొచ్చు.

బంగారం నిల్వ‌ల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌జ‌ల వ‌ద్ద ఉండే బంగారం, ఆభ‌ర‌ణాల‌కు సంబంధించి ఎటువంటి ప‌రిమితీ లేదని ఆదాయపు ప‌న్ను శాఖ 2016లో జారీ చేసిన స‌ర్క్యుల‌ర్‌లో స్ప‌ష్టం చేసింది. వార‌స‌త్వంగా వ‌చ్చిన బంగారం, ఆభ‌ర‌ణాల‌పై కూడా ప‌రిమితి లేదు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుతో కొన్న‌ట్లు చూపితే స‌మ‌స్య ఉండ‌దు. అంతేకాకుండా ఒక వ్య‌క్తి వ‌ద్ద ఎంత బంగారం ఉండొచ్చు అనే విష‌యాన్ని కూడా ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌ ఈ సర్క్యులర్‌లో తెలియ‌జేసింది. ఆదాయ‌పు ప‌న్ను రైడింగ్ జ‌రిగిన‌ప్పుడు తెలియ‌జేసిన‌ ప‌రిమితి వ‌ర‌కూ ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల‌కు స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌క పోయిన‌ప్ప‌టికీ స్వాధీనం చేసుకోరు.

వివాహిత‌ మ‌హిళ వ‌ద్ద 500 గ్రాములు, అవివాహిత యువ‌తి వ‌ద్ద 250 గ్రాములు, పురుషుల వ‌ద్ద 100 గ్రాముల వ‌ర‌కూ బంగారం ఉండొచ్చు. ఈ ప‌రిమితి వ‌ర‌కూ ఉన్న బంగారం, ఆభ‌ర‌ణాల‌కు సంబంధించి అధికారులు ఎటువంటి వివ‌ర‌ణా అడ‌గ‌రు. స్వాధీనం చేసుకోరు. కుటుంబ ఆచారాలు, సంప్ర‌దాయాలు వంటి కార‌ణాల చేత ఎక్కువ బంగారం క‌లిగి ఉంటే అధికారులు వాటిని స్వాధీనం చేసుకోకుండా వారికి అధికారాలు ఉంటాయి.

పన్ను పరిశీలన చేసేప్పుడు, బంగారం మూలాన్ని వివరించాల్సి ఉంటుంది. అందువల్ల, కొనుగోలు చేసిన బంగారం‌ రశీదులను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం మంచిది. వారసత్వంగా వ‌చ్చిన బంగారం, ఆభ‌ర‌ణాలు మీ వ‌ద్ద ఉన్న‌ట్ల‌యితే, వాటికి సంబంధించిన‌ అసలు ఇన్వాయిస్ల కాపీ లేదా బహుమతి దస్తావేజు, సెటిల్మెంట్ డీడ్ లేదా వీలునామా కాపీని చూపొచ్చు. డాక్యుమెంటరీ ఆధారాలు లేకపోతే, బంగారు మూలాన్ని నిర్ణయించడానికి పన్ను అధికారులు కుటుంబ ఆచారాలు, సామాజిక స్థితిగతులు మొదలైన వాటిని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని