విదేశీ పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ఎంత‌?

అమెరికా స్టాక్ మార్కెట్‌లో మీ పెట్టుబడుల నుంచి వ‌చ్చే ఆదాయం రెండు ర‌కాలుగా ఉంటుంది  

Published : 18 Dec 2020 13:27 IST

భారతీయ పెట్టుబడిదారులు ఇప్పుడు త‌మ పెట్టుబ‌డుల్లో వైవిధ్యప‌రిచేందుకు విదేశీ మార్కెట్ల వైపు చూస్తున్నారు. అయినప్పటికీ, యుఎస్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే పన్ను గురించి మనలో చాలా మందికి తెలియక గంద‌ర‌గోళం చెందుతారు. వాస్తవానికి ఆ ప‌న్నులు చాలా సరళంగా ఉంటాయి.

భారతీయ పెట్టుబడిదారులు యుఎస్ స్టాక్ నుంచి వచ్చే ఆదాయాలపై పన్ను బాధ్యత రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి సంపాదించే స్వభావం, రెండవది భారతదేశంలో నివాస స్థితి.

ఆదాయం వ‌చ్చే విధానం:
యుఎస్ స్టాక్స్‌లో మీ పెట్టుబడుల నుంచి మీరు రెండు రకాలుగా ‘ఆదాయం’ పొందవ‌చ్చు

డివిడెండ్‌లు:
డివిడెండ్ చెల్లించే యుఎస్ మార్కెట్‌లోని స్టాక్ లేదా ఈటిఎఫ్ మీ వద్ద ఉంటే, యుఎస్‌లో మీ పన్ను బాధ్యత 25 శాతం అవుతుతంది (అమెరికా, భార‌త్‌ మధ్య పన్ను ఒప్పందం కారణంగా విదేశీ పెట్టుబడిదారుడి కంటే తక్కువ). మీరు డివిడెండ్ పొందే ముందు ఈ పన్ను మిన‌హాయిస్తుంది, అంటే మీరు డివిడెండ్‌లో 75 శాతం నగదు చెల్లింపుగా అందుకుంటారు.

ఇటువంటి డివిడెండ్ ఆదాయంపై భార‌త్‌లో కూడా పన్ను చెల్లించాలి. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి, మీరు సంపాదించిన ఏదైనా డివిడెండ్ ఆదాయంపై పన్ను చెల్లించాలి. అలాంటి డివిడెండ్ ఆదాయం సంవత్సరానికి మీ మొత్తం ఆదాయానికి జోడించి, మీకు వర్తించే శ్లాబు రేటుకు పన్ను విధిస్తారు.

ఇక్క‌డ హ‌ర్షించే విష‌యం ఏమిటంటే, అమెరికా, భార‌త్‌ డబుల్ టాక్సేషన్ ర‌ద్దు ఒప్పందం (డిటిఎఎ) కలిగి ఉన్నందున రెండుసార్లు ప‌న్న‌ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేకుండా భార‌త్‌లో చెల్లిస్తే స‌రిపోతుంది. ఇది యుఎస్‌లో నిలిపివేసిన‌ పన్నుకు క్రెడిట్ తీసుకోవడానికి, భారతదేశంలో పన్ను బాధ్యతతో సర్దుబాటు చేయడానికి అనుమతిస్తుంది.

మూలధన లాభాలు:
మీకు అమెరికా మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ల‌ను విక్రయించినప్పుడు, మూలధన లాభాలను (క్యాపిట‌ల్ గెయిన్స్) పొందుతారు. లాభం మొత్తం సెక్యూరిటీల‌ ‘అమ్మకపు ధర - సముపార్జన ఖర్చు’ అవుతుంది. విదేశీయులకు అమెరికాలో మూలధన లాభ పన్ను లేదు. అయినప్పటికీ, మీరు భారతదేశంలో మూలధన లాభాలపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది, మీ పన్ను బాధ్యత మూలధన లాభాలు వచ్చే వర్గాన్ని బట్టి ఉంటుంది.

దీర్ఘకాలిక మూలధన లాభం:
మీరు 24 నెలలకు మించి షేర్ల‌ను క‌లిగి ఉంటే వాటిని వాటిని విక్ర‌యించ‌గా వ‌చ్చిన‌ లాభం దీర్ఘకాలిక మూలధన లాభాలుగా ప‌రిగ‌ణిస్తారు, దీనిపై ప‌న్ను ఇండెక్సేష‌న్ కాస్ట్ త‌ర్వాత‌ 20 శాతం(అదనంగా వర్తించే సెస్, సర్‌చార్జ్ ఉంటుంది).

స్వల్పకాలిక మూలధన లాభం:
మీరు 24 నెలల కంటే త‌క్కువ కాలంలో షేర్ల‌ను విక్ర‌యిస్తే వ‌చ్చిన లాభం స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న లాభంగా ప‌రిగ‌ణిస్తారు. దీనిని మీ ఆదాయానికి జోడించి శ్లాబు ప్ర‌కారం ప‌న్ను విధిస్తారు.

నివాస స్థితి (రెసిడెన్షియ‌ల్ స్టేట‌స్‌):

భారత‌ ఆదాయపు పన్ను విధానంలో, ఒక వ్యక్తి నివాస స్థితి మూడు వేర్వేరు వర్గాలుగా విభజించారు. వారికి వర్తించే పన్నుల గురించి తెలుసుకుందాం.
రెసిడెంట్ & ఆర్డినరీ రెసిడెంట్ (ROR): ఆర్ఓఆర్‌ల‌కు గ్లోబ‌ల్ ఇన్‌క‌మ్‌పై భారతదేశంలో పన్ను విధిస్తారు. అందువల్ల, మీరు భారతదేశంలో యుఎస్ స్టాక్ హోల్డింగ్స్ నుంచి సంపాదించిన మొత్తానికి ఇక్క‌డ‌ పన్ను చెల్లించాలి.

రెసిడెంట్ కాని సాధారణ నివాసి (RNOR) & నాన్-రెసిడెంట్ (NRI): RNOR లు & NRI ల కొరకు, విదేశీ ఆదాయం ఇక్క‌డ స్వీక‌రిస్తేనే దానిపై ఇక్క‌డ పన్ను వ‌ర్తిస్తుంది లేదా భార‌త్ నియంత్ర‌ణ‌లోని వ్యాపారం, వృత్తి నుంచి ల‌భించిన ఆదాయంపై ప‌న్ను ఇక్క‌డ ప‌డుతుంది.

అందువల్ల, మీరు ఆర్‌ఎన్‌ఓఆర్ లేదా ఎన్‌ఆర్‌ఐ అయితే, మీరు భారతదేశంలో అందుకున్న యుఎస్ స్టాక్స్ నుంచి వచ్చిన ఆదాయాలపై మాత్రమే పన్ను చెల్లించాలి లేదా ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ వంటి భారతదేశంలో నియంత్రించబడే లేదా ఏర్పాటు చేసిన వ్యాపారం నుంచి వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను చెల్లించాలి.

పై అంశాల‌ దృష్ట్యా, యుఎస్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి పన్ను చిక్కులు చాలా సరళంగా ఉన్నాయని మనం గ‌మ‌నించ‌వ‌చ్చు. కేవ‌లం ప‌న్ను భ‌యంతో యుఎస్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకుండా ఉండాల‌నుకునేవారు ఈ విష‌యాను తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని