పన్ను ప్ర‌ణాళిక‌ వేశారా ?

రూ 2.50 నుంచి రూ 5 లక్షల వరకు ఐదు శాతం పన్ను వర్తిస్తుంది. అయితే దీనిని ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం ద్వారా మినహాయింపు పొందవచ్చు. రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు ఆదాయంపై ..

Updated : 01 Jan 2021 17:02 IST

రూ. 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు ఆదాయంపై 20శాతం పన్ను, రూ 10 లక్షలపైబడితే 30 శాతం పన్ను వర్తిస్తుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం ఫై పన్ను ఏమైనా తగ్గించారా, ఒకవేళ లేకపోతె, రాబోయే ఆరు నెలలకు వచ్చే ఆదాయాన్ని కలిపితే ఏమైనా పన్ను కట్టాలా చూసుకోవాలి. ప్రస్తుత నియమాల ప్రకారం రూ 2.50 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు.

రూ 2.50 నుంచి రూ 5 లక్షల వరకు ఐదు శాతం పన్ను వర్తిస్తుంది. అయితే దీనిని ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం ద్వారా మినహాయింపు పొందవచ్చు. రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు ఆదాయంపై 20శాతం పన్ను, రూ 10 లక్షలపైబడితే 30 శాతం పన్ను వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద జీవిత బీమా ప్రీమియం, ప్రావిడెంట్ ఫండ్, పీ పీ ఎఫ్, ఎన్ పీ ఎస్, గృహ రుణం అసలు చెల్లింపు, ఎన్ ఎస్ సి, 5 సంవత్సరాల ఫిక్సెడ్ డిపాజిట్, యులిప్స్, ట్యూషన్ ఫీజు ద్వారా వార్షికంగా రూ 1.50 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. అదనంగా ఎన్పీఎస్ లో రూ 50 వేలు మదుపు చేయడం ద్వారా సెక్షన్ 80 సి సి డి (1బి) కింద మినహాయింపు పొందవచ్చు.

కొంతమంది తెలియక ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఎండోమెంట్, మనీ బ్యాక్ , యులిప్స్ లాంటి పాలసీలను తీసుకుంటారు. ఇవి బీమా, మదుపు కలబోతగా ఉంటాయి. వీటిలో మదుపుకు రావలసిన రాబడి కానీ, తగిన జీవిత బీమా గాని ఉండవు. కానీ ప్రీమియం అధికంగా ఉంటాయి. వీటి నుంచి దూరంగా ఉండటం మంచిది.

ఉదా: శ్యామ్ వయసు 35 ఏళ్ళు. భార్య, పిల్లలు ఉన్నారు. అతడు 15 ఏళ్ళ కాలపరిమితిగల ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాడు. జీవిత బీమా హామీ మొత్తం రూ 5 లక్షలు. వార్షిక ప్రీమియం రూ. 35 వేలు. కాలపరిమితి పూర్తయిన తరువాత అతనికి బీమా హామీ మొత్తంతో పాటు అదనపు బోనస్ , వంటివి కలిపి రూ 9 లక్షల వరకు అందుతాయి. ఒకవేళ అనుకోని సందర్భంలో కాలపరిమితికి ముందే చనిపోతే బీమా హామీతో పాటు , అప్పటివరకు జమ అయిన బోనస్ వంటివి నామినీకి చెల్లిస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. మారుతున్న జీవన విధానానికి, జీవన ప్రమాణాలకు,పెరుగుతున్న ఖర్చులకు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అందబోయే మొత్తం ఎంతకాలం ఉపయోగపడతాయో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలాంటి పాలసీలలో వార్షిక రాబడి సాధారణంగా 4-5% వరకు ఉంటుంది. వీటికి ప్రత్యామ్న్యాయం టర్మ్ జీవిత బీమా హామీ. టర్మ్ పాలసీలు ఎక్కువ జీవిత హామీ, తక్కువ ప్రీమియంతో వస్తాయి.

ఒక ప్రత్యేక ఆర్ధిక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానికి తగిన పథకాలలో మదుపు చేయటం ద్వారా , దీర్ఘకాలంలో మంచి రాబడితో ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. ఉదా : పిల్లల ఫై చదువుల కోసం పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలంలో మదుపు చేయడం వలన అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. స్వల్ప కాలం లో ఇల్లు కొనుగోలుకు డౌన్ పేమెంట్ కోసం నెల నెలా కొంత రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు.

అలాగే పదవీవిరమణ అనంతర జీవితానికి ఆదాయం పొందాలంటే దానికి సరిపడా నిధిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ వయసులో వేరే ఆదాయం పొందటం ఎంత కష్టమో, పిల్లలపై ఆధార పడటమూ అంతే కష్టం. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ఆరోగ్య సమస్యల కోసం మరింత డబ్బు అవసరం అవుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని చిన్న వయసు నుంచే కొద్ది మొత్తంతోనైనా మదుపు మొదలు పెట్టాలి. ప్రతి సంవత్సరం పెరిగిన ఆదాయానికి తగినట్టుగా మదుపును పెంచుకుంటూ వెళ్ళాలి . దీనివల్ల దీర్ఘకాలంలో మంచి నిధిని సమకూర్చుకోవచ్చు. దీనికోసం ఎన్పీఎస్ మంచి పధకం.

దీనితో పాటు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం, పెట్టుబడి చేసే ముందే ప్రతి పధకం యొక్క అనుకూలతలు, ప్రతికూలతల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము. ఎవరో ఏవో చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మకుండా, నిపుణుల అభిప్రాయాలను తెలుసుకుని , అవి మీకు ఉపయోగపడితేనే పెట్టుబడి పెట్టండి. అయితే పెట్టుబడికి అనుకూలం కాకపోతే కనీసం రికరింగ్ డిపాజిట్ లోనైనా మదుపు చేయండి.
పదవీవిరమణ నిధి కోసం ప్రావిడెంట్ ఫండ్ తోపాటు ఎన్ పీ ఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలంలో మదుపు చేయడం వలన అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు.

మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

ముగింపు: పన్ను ప్రణాళిక అనేది మీ ఆర్ధిక ప్రణాళిక లో భాగం కావాలి. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాల గుర్తుంచుకోవాలి. అన్నిటికన్నా ముందు చేయాల్సింది మీ నెలవారీ బడ్జెట్ ను తయారుచేసుకోవడం. మీ నెలసరి ఆదాయం, నెలసరి ఖర్చులు పోగా ఎంత మిగులుతోంది తెలుసుకోవాలి. అలాగే కొన్ని ఖర్చులు ఆరు నెలలకు గాని, సంవత్సరానికి గాని ఉంటాయి. ఉదా: బట్టల కొనుగోలు, విహార యాత్రలు, బీమా పాలసీ ప్రీమియం లు వంటివి. ఎందుకంటే ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. వీటి కోసం కొంత మొత్తాన్ని కేటాయించాలి. అయితే నోటిలెక్కల కన్నా రాసి పెట్టుకుంటే మరింత స్పష్టత ఉంటుంది. బడ్జెట్ దీర్ఘకాలంలో మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. విజయీ భవ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని