Stock Market Closing Bell: స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో లాభాల జోరు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి....

Updated : 07 Dec 2021 15:37 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న సానుకూల సంకేతాలు సూచీల పరుగుకు దన్నుగా నిలిచాయి. ఆసియా మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు, యూఎస్‌ ఫ్యూచర్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు సోమవారం నాటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ కేసులు పెరుగుతున్నప్పటికీ.. పెద్దగా ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చునన్న విశ్లేషణలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. ఇక రేపు వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఫలితాల్లో రేట్ల పెంపు ఏమీ ఉండకపోచ్చునన్న సంకేతాలూ సెంటిమెంటును పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 57,125.98 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,905.63 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 886.51 పాయింట్ల లాభంతో 57,633.65 వద్ద ముగిసింది. 17,044.10 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,251.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 264.45 పాయింట్లు లాభపడి 17,176.70 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.45 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క ఏషియన్‌ పెయింట్స్‌ మినహా అన్ని షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు రాణించిన వాటిలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని