Stock market: కనిపించని శాంటాక్లాజ్‌ ర్యాలీ.. మార్కెట్‌లోని మరిన్ని సంగతులు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో వరుసగా మూడు రోజులుగా నమోదవుతున్న లాభాల పరంపరకు బ్రేక్ పడింది....

Updated : 24 Dec 2021 16:05 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో వరుసగా మూడు రోజులుగా నమోదవుతున్న లాభాల పరంపరకు బ్రేక్ పడింది. శుక్రవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. ఒమిక్రాన్‌ కేసులు, మూడు రోజుల లాభాల స్వీకరణ సూచీలపై ప్రభావం చూపాయి.


సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 57,567.11 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడేలో 56,813.42 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 190.97 పాయింట్ల నష్టంతో 57,124.31 వద్ద ముగిసింది. 17,149.50 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 16,909.60 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 68.85 పాయింట్లు నష్టపోయి 17,003.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.97 వద్ద నిలిచింది.


ఆంక్షల ప్రభావం..

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో మదుపర్లు కాస్త ఆచితూచి వ్యవహరించారు. దేశీయంగానూ కొత్త వేరియంట్‌ కట్టడికి పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు, జన సమూహంపై ఆంక్షలు విధిస్తుండడం కూడా సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. తర్వాతి రెండు రోజులు సెలవు కావడంతో సోమవారానికి పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయోనన్న ఆందోళనలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అలాగే గత మూడు రోజుల వరుస లాభాలను స్వీకరించారు. ప్రపంచ మార్కెట్లలో క్రిస్మస్‌కి ముందు శాంటాక్లాజ్‌ ర్యాలీ కనిపించినప్పటికీ.. భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.


మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* అరంగేట్రంలో అదరగొట్టిన డేటా ప్యాటర్న్స్‌..

రక్షణ, ఏరోస్పేస్‌ రంగాలకు ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్‌ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. 48 శాతం ప్రీమియంతో అరంగేట్రంలో అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.558 కాగా 47.69 శాతం ప్రీమియంతో రూ.864 వద్ద బీఎస్‌ఈలో.. 46.32 శాతం ప్రీమియంతో రూ.856.05 వద్ద ఎన్‌ఎస్‌ఈలో షేర్లు నమోదయ్యాయి. ఐపీఓలో ఒక్కో లాట్‌కు 25 షేర్లు నిర్ణయించారు. అంటే ఒక్కో లాట్‌పై రూ.13,875 పెట్టుబడిగా పెట్టారు. దీంతో 46.32 శాతం ప్రీమియం లెక్కన ఒక్కో లాట్‌పై మదుపర్లు రూ.6,779 లిస్టింగ్ గెయిన్స్‌ని సొంతం చేసుకున్నారు. చివరకు ఈ షేరు 29 శాతం లాభంతో రూ.755 వద్ద స్థిరపడింది.

* రూ.8 లక్షల కోట్లకు ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువ

ఇంట్రాడేలో ఇన్ఫోసిస్‌ షేర్ల ధర దాదాపు మూడు శాతం మేర పుంజుకుని రూ.1,875.75కు చేరింది. వరుసగా ఈ కంపెనీ షేర్లు నాలుగో రోజు లాభపడ్డాయి. దీంతో బీఎస్‌ఈలో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ మైలురాయిని అందుకున్న నాలుగో దేశీయ ఐటీ సంస్థ.

* రుణ వితరణకు యుగ్రో క్యాపిటల్‌తో చేతులు కలిపిన సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా షేర్లు ఇంట్రాడేలో 10.17 శాతం పెరిగాయి. గత నెల వ్యవధిలో ఇదే గరిష్ఠ వృద్ధి.

* నిఫ్టీ ఫార్మాలోని 20 కంపెనీల్లో 17 నష్టపోయాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని