Stock market : సెన్సెక్స్‌ 60,000+.. నిఫ్టీ 17850+..

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి.....

Updated : 07 Jan 2022 09:48 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. కజఖ్‌స్థాన్‌, లిబియాలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో మదుపర్లు నేడు కొంత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, గురువారం నాటి భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మార్నింగ్‌ సెషన్‌లో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. 

ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద.. నిఫ్టీ (Nifty) 125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.40 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

*  రిలయన్స్‌ : ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌ క్విక్‌ కామర్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం దేశీయ దిగ్గజ క్విక్‌కామర్స్‌ సంస్థ డుంజోలో 25.8 శాతం వాటాను రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోలు చేసింది. మరోవైపు గురువారం రిలయన్స్‌ సుమారు రూ.30,000 కోట్లను విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా సమీకరించింది.

* టైటన్‌ : మూడో త్రైమాసికంలో కంపెనీ కన్జ్యూమర్‌ విభాగంలో భారీ వృద్ధి నమోదైంది. ముఖ్యంగా క్రితం ఏడాదితో పోలిస్తే పండగ సీజన్‌లో 36 శాతం వృద్ధి నమోదైంది.

* గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ : ధరల పెరుగుదల కారణంగా మూడో త్రైమాసికంలో కంపెనీ మార్జిన్స్‌ తగ్గాయి. 

* వోకార్డ్ : ఔషధ సంస్థ వోకార్డ్‌.. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల నిధుల్ని సమీకరించనుంది. ఈ నిధుల్ని కంపెనీ ఆర్థిక అవసరాలు, రుణ బకాయిల చెల్లింపులు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.

* ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ : గ్రాస్‌ లోన్‌ బుక్‌ 15 శాతం పెరిగి రూ.16,600కు పెరిగింది. డిపాజిట్లు కూడా 10 శాతం ఎగబాకి రూ.15,600కు పెరిగాయి. 

* అరబిందో ఫార్మా, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్ ‌: మోల్నుపిరవిర్‌ కేప్సూల్‌ను స్థానిక ఫార్మా కంపెనీలైన అరబిందో ఫార్మా, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ దేశీయ విపణిలోకి విడుదల చేశాయి. అరబిందో ఫార్మా ‘మోల్నాఫ్లూ’ బ్రాండు పేరుతో, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ‘మోలులో’ బ్రాండుతో ఈ ఔషధాన్ని తీసుకువచ్చాయి. 

* హిందూజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌ : ఒక్కో షేరుపై కంపెనీ రూ.150 డివిడెండు ప్రకటించింది. 1:1 ప్రాతిపదికన బోనస్‌ షేర్లను కూడా కేటాయించింది.

* అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ : దేశంలోని వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలకు 1 ఎంఎంటీ బొగ్గును అందించేందుకు ఎన్‌టీపీసీ నుంచి కాంట్రాక్టు అందింది.  

* కొవిడ్‌-19 వ్యాధి చికిత్స కోసం మరొక ఔషధం ‘పాక్స్‌లోవిడ్‌’ త్వరలో అందుబాటులోకి రానుంది. బహుళజాతి సంస్థ అయిన ఫైజర్‌ అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని ‘కొవిడ్‌’ చికిత్సలో వినియోగించడానికి ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లలో అనుమతి లభించింది. దీని సబ్‌-లైసెన్సింగ్‌ కోసం దేశీయ ఫార్మా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీ షేర్లు కొంతమేర లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని