బీమాలో ఏ రైడ‌ర్స్ తీసుకోవ‌చ్చు?

బీమాలో ఏ రైడ‌ర్స్ తీసుకుంటే ఉప‌యోగ‌క‌రంగా ఉంటుందో తెలుసుకోండి

Published : 20 Dec 2020 17:12 IST

జీవిత బీమాను అందిస్తూ, దాంతో అనుబంధంగా అదనపు భరోసా కల్పించే సదుపాయాన్నే రైడర్‌ అంటారు. ఈ రైడర్ల కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విడిగా పొందే మార్గం లేదు. కేవలం మనకున్న బీమాతో అదనంగా రైడర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని సాధారణ జీవిత బీమా పాలసీలు లేదా పెట్టుబడి ఆధారిత జీవిత బీమా పాలసీలతో కలిపి తీసుకోవచ్చు. ఈ రైడర్లను జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో తీసుకోవచ్చు లేదా తర్వాతైనా పొందేందుకు వీలుంది. ఈ రైడ‌ర్లు సాధార‌ణ బీమా, ఆరోగ్య మీమా, వాహ‌న బీమాల‌పై ల‌భిస్తాయి. ఈ రైడ‌ర్లు బీమాతో పాటు ప్ర‌త్యేకంగా మ‌రి కొన్ని ప్ర‌త్యేక ప్రయోజ‌నాలు పొందే అవ‌కాశ‌ముంటుంది.

జీవిత ట‌ర్మ్ బీమా రైడ‌ర్లు:

యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌:

ప్రమాదం వల్ల అనుకోకుండా పాల‌సీదారుడు మృతిచెందితే ప్రాథమిక జీవిత బీమా పాలసీలో కల్పించే సొమ్ము కంటే రైడర్లతో కలిపి అందించే బీమా సొమ్ము అధికంగా ఉంటుంది. ఈ రైడర్‌ ముఖ ఉద్ధేశం అదనపు బీమా సొమ్మును కల్పించడమే.

పాక్షిక /శాశ్వత వైకల్య రైడర్లు (పర్మనెంట్‌/టెంపరరీ డిసేబిలిటీ రైడర్‌):

ప్రమాదం కారణంగా గాయాలపాలై పాక్షికంగా లేదా శాశ్వత వైకల్యం కలిగితే బీమా కంపెనీ బీమా మొత్తంలో కొంత భాగాన్ని క్రమానుగతంగా బీమాదారుడికి కోలుకునే వరకు లేదా నిర్ణీత సమయం వరకు చెల్లిస్తుంది. ఆర్జించ లేని పరిస్థితుల్లో ఈ సొమ్ము ఆదాయ మార్గంగా ఉంటుంది. ఈ రైడర్‌ సాధారణంగా యాక్సిడెంట్‌ రైడర్‌తో కలిపి ఇస్తారు. రైడర్‌ కొనుగోలు చేసే ముందు నియమనిబంధనలను ఓసారి పరిశీలించడం మంచిది.

తీవ్రమైన అనారోగ్యానికి వర్తింపజేసే (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) రైడర్‌:

బీమా కలిగి ఉన్న సమయంలో ఏదైనా ప్రాణాంతక లేదా తీవ్ర అనారోగ్యాన్ని గుర్తిస్తే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ ఉపయోగపడుతుంది. రైడర్‌కు వర్తించే బీమా సొమ్మును అందజేస్తారు. సహజంగా తీవ్ర అనారోగ్యానికి సంబంధించిన చికిత్సలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలాంటి సమయంలో ఈ క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్లు ఆసరాగా ఉంటాయి. కొన్ని బీమా కంపెనీలు ఒక్కో వ్యాధికి అందించే సొమ్ముకు పరిమితిని విధిస్తాయి. అందువల్ల పాలసీ కొనేముందు ఏయే జబ్బులకు ఈ రైడర్‌ వర్తిస్తుందో వాటి పరిమితులేమిటో తెలుసుకోవ‌డం మంచిది.

ప్రీమియం మినహాయింపు (ప్రీమియం వేవర్‌ ) రైడర్‌:

బీమా పొందిన వ్యక్తి ప్రమాదంలో గాయపడి సంపాదించలేని పరిస్థితి ఏర్పడితే పాలసీ ప్రీమియం చెల్లించడం భారంగా మారుతుంది. ఇలాంటి సమయంలో భరోసా కల్పించేందుకు రూపొందించిందే ప్రీమియం మిన‌హాయింపు(ప్రీమియం వేవ‌ర్‌) రైడర్‌. ఈ రైడర్‌ పొంది ఉంటే ప్రీమియంలో కొంత భాగం లేదా ప్రీమియం మొత్తం చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఎంచుకునే రైడర్‌ను బట్టి మినహాయింపు ఉంటుంది.

ఆదాయాన్ని క‌ల్పించే రైడ‌ర్‌:
ఈ రైడర్ పాల‌సీదారుడికీ ఏదైనా జ‌రిగితే ప్ర‌మాద ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు ప్ర‌వేశ‌బెట్ట‌బ‌డింది. పాల‌సీదారుడు అనుకోకుండా మ‌ర‌ణిస్తే వారికి బీమా సంస్థ ఇచ్చే మొత్తంతో ఎలా ప్ర‌ణాళిక చేసుకోవాలో అర్థం కాదు. దీనికి ఈ రైడ‌ర్ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. పాల‌సీదారుడి మ‌ర‌ణం త‌ర్వాత నామినీలు కొంత కోలుకునేందుకు నిర్థేశిత కాలం వర‌కు నెల‌కు కొంత ఆదాయాన్ని అంద‌జేస్తారు . ఇంద‌లో ప్ర‌మీయం ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంది.

వాహ‌న బీమా రైడ‌ర్లు:

జీరో డిప్రిసియేష‌న్ క‌వ‌ర్‌:

సాధార‌ణంగా వాహ‌న బీమాను క్లెయిమ్ చేసిన‌ప్పుడు చెల్లింపు మొత్తాన్ని నిర్ణయించడానికి ముందు వాహనం కొనుగోలు చేనిన కాలాన్ని బ‌ట్టి కొంత త‌గ్గిస్తారు. జీరో డిప్రిసియేషన్ కవర్ ప్రధానంగా ఇప్ప‌టివ‌ర‌కు వాహ‌నానికి ఖ‌ర్చు చేసిన వ్య‌యంపై కూడా క్లెయిమ్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. దీంతో న‌ష్ట ప్ర‌భావం త‌గ్గుతుంది.

రిట‌ర్న్ టు ఇన్‌వాయిస్ కవ‌ర్‌:

ఒక వాహనం దొంగిలించబడిన సందర్భంలో, లేదా ఒక ప్రమాదానికి గురైన స‌మ‌యంలో బీమా క్లెయిమ్ చేస్తే సాధారణంగా హామీ ఇచ్చిన మొత్తానికి చెల్లిస్తారు. అయితే ఈ రైడ‌ర్‌లో వాహనం అసలు ఇన్వాయిస్ విలువకు సమానంగా క్లెయిమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ కవర్ సాధారణంగా 3 సంవత్సరాలు పైబ‌డిన వాహ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇంజ‌న్ ప్రొటెక్ట్ క‌వ‌ర్‌:

ఇది ముఖ్యంగా 3 సంవత్సరాలు పైబ‌డిన అధిక ఇంజ‌న్ సామ‌ర్థ్యం క‌లిగిన వాహ‌నాల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఈ రైడ‌ర్లు వరదలు వంటి అనుకోకుండా వ‌చ్చే ప్ర‌మాదాలు వ‌చ్చిన‌ప్ప‌డు ఇంజిన్ మరమ్మతుకు కావ‌ల‌సిన చెల్లింపుల‌కు భాద్య‌త వ‌హిస్తుంది.

నో క్లెయిమ్ బోన‌స్ ప్రొటెక్ట్ క‌వ‌ర్‌:
బీమా సంస్థలు సాధార‌ణంగా నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్ట్ క‌వ‌ర్ అందిస్తుంటాయి. ఇది ప్రీమియం త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది ఉప‌యోగించ‌కుండా ఉంటే త‌ర్వాత అవ‌స‌ర‌మైన‌ప్పుడు వినియోగించుకోవ‌చ్చు.

రెంట‌ల్ రీఎంబ‌ర్స్‌మెంట్ క‌వ‌ర్‌:

అనుకోకుండా మీ వాహ‌నం ప్ర‌మాదానికి గురైనా లేదా ఎదైనా మ‌రమ్మ‌త్తులు అవ‌స‌ర‌మైన‌ప్పుడు, వేరే వాహ‌నం అద్దెకు తీసుకొని రోజువారి కార్య‌క‌లాపాలు కొన‌సాగించుకోవ‌చ్చు. అప్పుడు మీరు తీసుకున్న వాహ‌నానికి అయిన ఖ‌ర్చును కూడా క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఈ రైడ‌ర్ క‌ల్పిస్తుంది.

ప్రధాన పాలసీ ఉన్నంతకాలం వరకే రైడర్లు పనిచేస్తాయి. ఏ కారణం చేతైనా ప్రధాన పాలసీ కాలపరిమితి ముగిసినా లేదా స్వాధీనప‌రిచినా లేదా ప్రీమియం చెల్లించకుండా రద్దయినా అటువంటి పాలసీలకు రైడర్లు పనిచేయవు. రైడర్లు తీసుకునేముందు వాటి నియమనిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని