Sputnik V: వీటి ఆధారంగానే ధర నిర్ణయించాం!

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి నేటి నుంచి భారల మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ఒక్కో డోసు ధరను జీఎస్టీతో కలుపుకొని రూ.995.40గా నిర్ణయించారు......

Published : 14 May 2021 17:51 IST

డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ఎం.వి.రమణ

హైదరాబాద్‌: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి శుక్రవారం నుంచి భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ఒక్కో డోసు ధరను జీఎస్టీతో కలుపుకొని రూ.995.40గా నిర్ణయించారు. భారత్‌లో స్పుత్నిక్‌-వి ఉత్పత్తి, పంపిణీ కోసం రష్యన్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సీఈఓ ఎం.వి.రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీకాను అత్యుత్తమ నాణ్యతతో అందరికీ అందబాటులోకి తీసుకొచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ పాటుపడుతోందని తెలిపారు.

ఇక ధర గురించి మాట్లాడుతూ.. రష్యా నుంచి దిగుమతి, (మైనస్‌) -18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉండడం వంటి అంశాల ఆధారంగా ధరను నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 250 మిలియన్ డోసులను డాక్టర్ రెడ్డీస్ నుంచి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వీటిలో రష్యా నుంచి కేవలం 15-20 శాతం డోసులు మాత్రమే దిగుమతి చేసుకుంటామని తెలిపారు. మిగిలిన వాటిని తమ సంస్థ భాగస్వామ్య కంపెనీలలో ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.

స్పుత్నిక్-వి రెండో డోసుకు సంబంధించిన టీకాలు రష్యా నుంచి మరో వారం రోజుల్లో భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయని ఎం.వి.రమణ తెలిపారు. తొలుత దేశంలోని ప్రధాన నగరాల్లో  పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్పుత్నిక్-వి టీకాను వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు. 

ఇక స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను రూపొందించిన రష్యన్‌ సంస్థ నుంచే సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ అనే మరో టీకా వస్తున్న విషయం తెలిసిందే. దీని క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను భాతర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) పరిశీలించి వినియోగానికి అనుమతించిన తర్వాతే దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రమణ తెలిపారు.

అలాగే డీఆర్‌డీఓ(DRDO)తో కలిసి తాము అబివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) ఔషధం వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన విషయాన్ని ఎం.వి.రమణ గుర్తుచేశారు. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారికి కూడా ఇది పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైందని డీఆర్‌డీఓ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది బాగా పనిచేస్తోందని, కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తోందని వెల్లడించింది. ఈ 2-డీజీ డ్రగ్‌ను జూన్ మధ్య నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని రమణ తెలిపారు. దీని ధరను ఇంకా నిర్ణయించలేదన్నారు.

అలాగే కొవిడ్ చికిత్సలో వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్ ఔషధ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నామని రమణ తెలిపారు. జూన్ మధ్య నాటికి వాణిజ్య సరఫరాకు సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. అలాగే స్పుత్నిక్-వి సప్లయ్‌ చైన్ నిమిత్తం పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని