పీపీఎఫ్‌తో రూ.45 ల‌క్ష‌లు..ఎలా?

పీపీఎఫ్‌లో సంవ‌త్సరానికి రూ.1.5 ల‌క్ష‌ల పెట్టుబ‌డుల‌తో 15 ఏళ్ల‌కి రూ.45 ల‌క్ష‌ల‌ను సంపాదించ‌వ‌చ్చు.....

Published : 19 Dec 2020 10:44 IST

పీపీఎఫ్‌లో సంవ‌త్సరానికి రూ.1.5 ల‌క్ష‌ల పెట్టుబ‌డుల‌తో 15 ఏళ్ల‌కి రూ.45 ల‌క్ష‌ల‌ను సంపాదించ‌వ‌చ్చు.​​​​​​​

మీ పెట్టుబ‌డుల‌కు రెట్టింపు రాబడితో పాటు ఆదాయ ప‌న్ను మిన‌హాయింపును కోరుకుంటున్నారా. అయితే ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్‌) మీకు స‌రైన ఆప్ష‌న్‌. పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌కు ఇది స‌రైన స‌మ‌యం. దీనిపై ఇప్పుడు 8 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇది సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డుల్లో ఒక‌టి. ఇందులో రూ.500 నుంచి పెట్టుబ‌డులు ప్రారంభించి సంవ‌త్స‌రానికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్ట‌వ‌చ్చు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో లేదా 12 వాయిదాల్లో డిపాజిట్ చేయ‌వ‌చ్చు. పీపీఎఫ్ కాల‌ప‌రిమితి 15 సంవ‌త్స‌రాలు. ఖాతాదారుడు కోరుకుంటే గ‌డువు 5 సంవ‌త్స‌రాల చొప్పున‌ మ‌రింత పెంచే అవ‌కాశం కూడా ఉంటుంది.

పీపీఎఫ్ క్యాలిక్యులేట‌ర్‌

పీపీఎఫ్‌పై ప్ర‌స్తుతం ఉన్న వ‌డ్డీ రేటు 8 శాతం కాగా, 15 సంవ‌త్స‌రాలు వ‌రుస‌గా ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల గ‌రిష్ఠంగా డిపాజిట్ చేస్తే 15 సంవ‌త్స‌రాల గడువు పూర్త‌య్యేనాటికి ఇది రూ.45.15 ల‌క్ష‌ల‌కు చేరుతుంది. మీ మొత్తం పెట్టుబ‌డి రూ.22.5 ల‌క్ష‌లు కాగా వ‌డ్డీతో క‌లిపి అంత మొత్తం రాబ‌డి పొంద‌వ‌చ్చు.

  • అదేవిధంగా సంవ‌త్స‌రానికి ల‌క్ష రూపాయ‌ల‌ను డిపాజిట్ చేస్తే 15 ఏళ్ల‌కి రూ.30.10 ల‌క్ష‌లు,
  • రూ.50 వేల‌కు రూ.15 లక్ష‌లు ( మీ మొత్తం డిపాజిట్ రూ.7,50,000)
  • నెల‌కు రూ.5000 డిపాజిట్ చేస్తే 15 సంవ‌త్స‌రాల‌క ఉరూ.17.42 లక్ష‌లు సంపాదించ‌వ‌చ్చు.
    పీపీఎఫ్‌పై వ‌డ్డీ రేట్ల‌ను త్రైమాసికం ప్రాతిప‌దిక‌న ప్ర‌భుత్వం మారుస్తుంది.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం, పీపీఎఫ్ పెట్టుబ‌డులు, వ‌డ్డీపై ఆదాయ ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఖాతాలో ఉన్న మొత్తం న‌గ‌దుపై ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. దీంతో పాటు పీపీఎఫ్‌పై రుణం పొందే అవ‌కాశం కూడా ఉంది. ఖాతాదారుని వ‌య‌సు, బ్యాలెన్స్ ఆధారంగా రుణం ఇస్తారు. 15 సంవ‌త్స‌రాల‌కు మందు పీపీఎఫ్ ఖాతాను మూసివేసేందుకు వీలుండ‌దు. అయితే కొన్ని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో త‌గిన ప‌త్రాల‌ను అందించి ఖాతా మూసివేసే అవకాశ‌ముంటుంది. ఆరేళ్ల త‌ర్వాత పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ చేసుకోవ‌చ్చు. మీకు ద‌గ్గ‌ర‌లోని బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో పీపీఎఫ్ ఖాతాను తెరిచి ఇప్ప‌టినుంచే పెట్టుబ‌డులు చేయ‌డ ప్రారంభించండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని