Elon Musk: మస్క్‌ను భయపెట్టిన 19 ఏళ్ల కుర్రాడు..!

స్పేస్‌ఎక్స్‌, టెస్లా కంపెనీలతో యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎలాన్ మస్క్‌ని ఓ కుర్రాడు కలవరపెట్టాడు. ఒక రకంగా భయపెట్టాడనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.....

Published : 31 Jan 2022 01:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్పేస్‌ఎక్స్‌, టెస్లా కంపెనీలతో యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎలాన్ మస్క్‌ని ఓ కుర్రాడు కలవరపెట్టాడు. ఒక రకంగా భయపెట్టాడనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. జాక్‌ స్వీనీ అనే 19 ఏళ్ల కుర్రాడికి టెక్నాలజీ అంటే అత్యంత ఆసక్తి. తన సొంత నైపుణ్యంతో విమానాల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఓ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. అలా ప్రైవేటు వ్యక్తుల విమానాలు ఎప్పుడు.. ఎక్కడ.. ఉన్నాయో ఇట్టే చెప్పేస్తున్నాడు. అందుకోసం ట్విటర్‌ను వేదికగా చేసుకున్నాడు.

స్వీనీ ట్రాక్‌ చేస్తున్న విమానాల్లో ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బిల్‌ గేట్స్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మస్క్‌.. స్వీనీని ట్విటర్‌లోనే సంప్రదించారు. తాను చేస్తున్న పనిని ఆపేయాలని కోరారు. దానివల్ల ఎంత నష్టమో వివరించాడు. అందుకు 5,000 (రూ.3.75 లక్షలు) డాలర్లు ఇస్తానని ఆఫర్‌ చేశారు. కానీ, స్వీనీ అందుకు నిరాకరించాడు. తనకు 50,000 డాలర్లు (దాదాపు రూ.37.55 లక్షలు) కావాలని డిమాండ్‌ చేశాడు. ఈ మొత్తంతో తాను స్కూల్‌ ఫీజు చెల్లించడంతో పాటు టెస్లా కారు కొనుక్కుంటానని తెలిపాడు.

ఇలా మొత్తం 15 మంది ప్రముఖ వ్యక్తుల ప్రైవేటు విమానాల కదలికల్ని స్వీనీ ట్రాక్‌ చేస్తున్నాడు. వాటన్నింటినీ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తుంటాడు. మస్క్‌ విమాన వివరాల కోసం ‘ఎలాన్‌జెట్‌’ అనే ఖాతాను తెరిచాడు. విమానం టేకాఫ్‌ అయిన దగ్గరి నుంచి ల్యాండ్‌ అయ్యే వరకు అన్ని వివరాలను స్వీనీ రూపొందించిన సాంకేతికతతో ట్రాక్‌ చేయొచ్చు. ఇతరుల విమానాల గురించి కూడా స్వీనీ పోస్ట్‌ చేస్తున్నప్పటికీ.. మస్క్‌ ఖాతానే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దాదాపు 83,000 మంది ఫాలోవర్లు ఉన్నట్లు సమాచారం.

తాను ఎలాన్‌ మస్క్‌కు పెద్ద అభిమానినని స్వీనీ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఇరువురి మధ్య జరిగిన సంభాషణలో తాను అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి మస్క్‌ అంగీకరించినట్లు తెలిపాడు. అయితే, ఇంకా చెల్లించారా.. లేదా.. మాత్రం తెలియదు. ఇలా విమానాల కదలికల్ని ట్రాక్‌ చేయడం వల్ల తాను చాలా లబ్ధి పొందానని ఈ కాలేజీ కుర్రాడు చెప్పుకొచ్చాడు. కోడింగ్‌పై పట్టు పెరిగిందని వివరించాడు. అలాగే సోషల్‌ మీడియాలో తనకు ఫాలోయింగ్‌ పెరిగిందన్నాడు. ఉబర్‌జెట్స్‌లో అప్లికేషన్‌ డెవలపర్‌గా పార్ట్‌ టైం జాబ్‌ కూడా దొరికిందని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని